More

  ఇది మోదీ మార్క్ విప్లవం..! దూసుకొస్తున్న ఇ-రూపీ..!! ఉగ్రమూకలు చుక్కలే..

  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇ-రూపీని తీసుకొచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టింది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి సంబంధించిన కాన్సెప్ట్ నోట్‌ను అక్టోబర్ 7న విడుదల చేసింది. ఆర్‌బీఐ తీసుకు వచ్చే డిజిటల్ కరెన్సీ వినియోగదారులకు అదనపు చెల్లింపు మార్గంగా ఉంటుందని, ఇప్పటికే ఉన్న చెల్లింపు వ్యవస్థల్ని రీప్లేస్ చేయడం లక్ష్యం కాదని ఆర్‌బీఐ తన కాన్సెప్ట్ నోట్ లో స్పష్టం చేసింది.

  సాధారణంగా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ -CBDCల గురించి అవగాహన కల్పించడం, డిజిటల్ రూపాయి ప్రణాళికాబద్ధమైన ఫీచర్స్ తెలపడమే ఈ కాన్సెప్ట్ నోట్ జారీ వెనుక ఉద్దేశమని ఆర్‌బీఐ వివరించింది. ఆర్‌బీఐ రూపొందించే డిజిటల్ కరెన్సీకి ఇ-రూపీ అని నామాకరణం చేశారు. ఇ-రూపీని త్వరలో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్టూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.  

  కరెన్సీ నోట్ల ముద్రణ వ్యయాన్ని తగ్గించడం, రవాణా ఖర్చులు ఆదా చేయడం, భద్రతా పరమైన సమస్యలను అధిగమించడం, జాతి వ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేయడం, మానిలాండరింగ్ లాంటి చట్ట వ్యతిరేక లావాదేవీలను అరికట్టడం కోసమే డిజిటల్ కరెన్సీ ప్రవేశపెడుతున్నట్టూ…బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ వేదికగా ప్రకటించారు.

  సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఆర్‌బీఐ ఆధ్వర్యంలో వస్తుంది. ఇ-రూపీ డిజిటల్ ఫార్మాట్‌లో నిక్షిప్తమయి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న కరెన్సీకి ఇ-రూపీ అదనంగా ఉంటుంది. బ్యాంకు నోట్లకు భిన్నంగా ఏమీ ఉండదు. కానీ డిజిటల్‌ రూపంలో ఉండటం వల్ల సులభంగా చెలామణి చేసుకోవచ్చు. ఇది ఇతర రకాల డిజిటల్ కరెన్సీకి ఉన్నట్టుగానే లావాదేవీ ప్రయోజనాలు ఉంటాయి. చట్టబద్ధంగా ఎక్కడైనా చెల్లుతుంది.

  ఈ ఆర్థిక సంవత్సరంలోనే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి తేనుంది. 2023 మార్చి 31 లోగా ఎప్పుడైనా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి రావొచ్చు. త్వరలోనే కొన్ని లావాదేవీల కోసం ప్రయోగాత్మక పద్ధతిలో ఇ-రుపీ ప్రారంభిస్తామని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఆ తర్వాత దశల వారీగా డిజిటల్ కరెన్సీ వినియోగాన్ని విస్తరిస్తుంది. పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం అయిన తర్వాత డిజిటల్ కరెన్సీ ఫీచర్స్‌ని, ఇ-రూపీ ప్రయోజనాలను ఎప్పటికప్పుడు వివరిస్తామని ఆర్‌బీఐ కాన్సెప్ట్ నోట్ లో తెలిపింది. దీంతో ఇప్పటి వరకు ఎక్కువగా కరెన్సీ నోట్లపై ఆధారపడిన భారత్.. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కరెన్సీల డిజిటల్ వెర్షన్‌ తెస్తోంది.

  ఇ-రూపీ అంటే ఏంటి? కరెన్సీకి ఇ-రూపీకి ఏమైనా విలువ వ్యత్యాసం ఉంటుందా? డిజిటల్ కరెన్సీ వల్ల ప్రభుత్వానికి కలిగే ప్రయోజనాలేంటి? ప్రజలకు కలిగే అనుకూలతలేంటి? క్రిప్టోకరెన్సీకీ, ఇ-రూపీకి ఉన్న భేదం ఏంటి? రాబోయే రోజుల్లో పేపర్ కరెన్సీ మాయం కానుందా? ప్రస్తుతం నోట్ల ముద్రణకు అవుతున్న వ్యయమెంత?  డిజిటల్ కరెన్సీ తేవడంలో ప్రభుత్వం ప్రధాన ఉద్దేశం ఏంటి?

  ఆర్థిక రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పుల గురించి విశ్లేషణాత్మకంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం….

  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్లను ముద్రించి.. వాటికి విలువను నిర్ధారిస్తుంది.  కానీ.. ఒకప్పుడు ఇవేవీ లేవు. వస్తు మార్పిడి పద్ధతి మాత్రమే ఉండేది. దీన్నే బార్టర్ సిస్టం అని సంబోదిస్తాం. బంగారాన్ని విలువకు ప్రమాణంగా చేసుకోవడం.. తరువాతి కాలంలో బ్యాంకు నోట్లు.. క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల వరకూ ధనం అనేక విధాలుగా రూపాంతరం చెందుతూ వచ్చింది. ఈ పరిణామక్రమంలో తాజా మజిలీ డిజిటల్ కరెన్సీ!!  ప్రైవేట్ రంగంలోని డిజిటల్ కరెన్సీ…రకరకాల రూపాల్లో ఉంది. బిట్‌కాయిన్‌ అనండి.. ఎరిథ్రియం అనండి.. లేదా ఇంకోటి అని పిలవండి… అన్నీ హైటెక్‌ యుగపు డిజిటల్‌ టెక్నాలజీ ప్రతిరూపాలే! 

  ఈమధ్యకాలంలో క్రిప్టో కరెన్సీ గురించి బోలెడన్ని వార్తలు వస్తున్నాయి. తక్కువకాలంలో ఎక్కువ లాభాలకు ఇవి మేలు మార్గాలన్న ప్రచారం జరుగుతోంది. స్టాక్‌ మార్కెట్‌లో కంపెనీల షేర్ల మాదిరిగానే క్రిప్టో వ్యవహారాల కోసం ఎక్సే్చంజీలూ పుట్టుకొచ్చాయి. బోలెడన్ని టీవీ, వార్తా పత్రికల ప్రకటనలూ కనిపిస్తున్నాయి. అయితే క్రిప్టో కరెన్సీలో జరుగుతున్న మోసాలపై ప్రభుత్వం ఓ కన్నేసింది. అనధికారిక డిజిటల్ కరెన్సీకి అడ్డుకట్ట వేయాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా పుట్టుకొచ్చిందే ఇ-రూపీ.

  అసలు ఇ-రూపీ అంటే ఏంటి?

  ఈ-రూపీ అనేది ప్రస్తుతం చలామణిలో ఉన్న కరెన్సీలకు అదనపు ఆప్షన్. అయితే బ్యాంకు నోట్లతో పోలిస్తే పెద్దగా ఎలాంటి తేడాలుండవు. ఇది కేవలం డిజిటల్ రూపంలో మాత్రమే ఉంటుంది. కరెన్సీ నోట్లకు ఎంత వాల్యూ అయితే ఉంటుందో అంతే వాల్యూ ఈ-రూపీకి ఉంటుంది. అంతేకాక దీన్ని తేలిగ్గా వాడుకోవచ్చు.ఈ కరెన్సీలో లావాదేవీలను వేగంగా పూర్తి చేసుకోవచ్చు. ఇతర డిజిటల్ మనీకి ఉన్న లావాదేవీల ప్రయోజనాలన్ని కూడా దీనికి ఉంటాయి.

  డిజిటల్ చెల్లింపుల కోసం క్యాష్‌లెస్, కాంటాక్ట్‌లెస్ ప్లాట్‌ఫారమే ఇ-రూపీ. ఇది QR కోడ్ లేదా SMS ఆధారంగా ఓ ఈ-వోచర్‌లా పనిచేస్తుంది. కార్డు, డిజిటల్ చెల్లింపుల యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏవీ లేకుండానే ఇ-రూపీ వోచర్‌ను యూజర్లు రిడీమ్ చేసుకోవచ్చు. బ్యాంకు ఖాతా, గూగుల్, ఫోన్ పే, ఇంటర్నెట్ బ్యాంకింగ్, స్మార్ట్ ఫోన్ లేకున్నా ఇ-రూపీ వోచర్లను వాడుకోవచ్చు.

  గూగుల్ పే, ఫోన్ పే, యూపీఐ, పేటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి చెల్లింపు విధానాల మాదిరిగా ఇ-రూపీ అనేది పేమెంట్ ప్లాట్ ఫాం కాదు. ఇది కొన్ని ప్రత్యేక సేవలకు ఉద్దేశించిన ఒక ఇ-వోచర్ మాత్రమే. లబ్ధిదారుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచడం వలన ‘ఇ-రూపీ’ ఎంతో సురక్షితంగా, సులభంగా ఉంటుందని భావిస్తున్నారు. అవసరమైన డబ్బు మొత్తం ముందే వోచర్‌లో నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి ఇ-రూపీ ద్వారా జరిగే లావాదేవీలు వేగంగా, విశ్వసనీయంగా ఉంటాయని అంటున్నారు.

  ప్రభుత్వం వివిధ పథకాల కింద పేదలకు, రైతులకు నగదును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేస్తోంది. కరోనా సమయంలో కూడా ఇదే జరిగింది. అయితే, ఇలాంటి నగదు బదిలీ వ్యవహారాల్లో ప్రభుత్వ ఉద్యోగుల జోక్యం చాలా ఉంటుంది. దీనివల్ల కొన్నిసార్లు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి.

  ఇ-రూపీ వ్యవస్థ ఇలాంటి సమస్యలకు స్వస్తి పలుకుతుందని, “ఎలాంటి ఇబ్బందీ లేకుండా లబ్ధిదారుడికి ప్రయోజనాలు చేకూరేలా చేస్తుందని” ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. దీన్ని ప్రభుత్వ ప్రత్యేక నగదు సహాయంగా చూడవచ్చు. ప్రయివేటు సంస్థలు కూడా తమ ఉద్యోగుల కోసం దీన్ని ఉపయోగించవచ్చు.

  ఇ-రూపీకి డిజిటల్ కరెన్సీకి మధ్య తేడా ఏంటి?

  రెండింటికీ మధ్య తేడాలు ఉన్నాయి. ఈ-రూపీ అనేది నిర్దేశిత ప్రయోజనాలకే వాడుకునే సదుపాయం ఉంది. వర్చువల్ మనీతో పోలిస్తే ఇది విభిన్నం. ఈ-రూపీ వౌచర్ బేస్డ్ పేమెంట్ సిస్టంగా ఉండనుంది. వౌచర్​ను నిర్దిష్టమైన అవసరం కోసమే వినియోగించుకునే అవకాశం ఉంటుంది.

  ఎందుకోసం ఈ డిజిటల్ కరెన్సీ?

  ఈ రోజుల్లో అనేక ఆర్థిక నేరాలు బయటపడుతున్నాయి. మనీ లాండరింగ్ వంటి నేరాలు ఎక్కువయ్యాయి. ఇలాంటి హవాలా ట్రాన్సాక్షన్లు, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చటం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అదుపుచేయటానికి ఇది ఎంతగానే తోడ్పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అనేక మందిని పన్ను పరిధిలోకి తీసుకురావటానికి, పన్ను ఎగవేతదారులను గుర్తించేందుకు సైతం ఇది దోహదపడుతుందని వారు అంటున్నారు. ఇది క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టర్లకు పెట్టుబడుల నిర్వహణ సులువుగా మారుతుందని క్రిప్టో ఎక్స్ఛేంజీలు చెబుతున్నాయి.

  సంక్షేమ పథకాల అమలులో  ఎలాంటి అవకతవకలు జరగకుండా ఈ-రూపీ ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మాతా, శిశు పౌష్టికాహార పథకం, టీబీ నిర్మూలన కార్యక్రమం, ఆయుష్మాన్ భారత్​ కింద మందులు, చికిత్స, ఎరువుల సబ్సిడీ తదితర కార్యక్రమాలకు ఈ-రూపీ ద్వారానే లబ్ధిదారులకు చెల్లింపులు చేయాలని ప్రభుత్వం అనుకుంటోంది. ప్రైవేటు సెక్టార్లలోనూ ఎంప్లాయిమెంట్​ వెల్ఫేర్​, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కార్యక్రమాల కింద కూడా ఈ-రూపీ డిజిటల్ వౌచర్లను ప్రవేశపెట్టాలని భావిస్తోంది.

  దేశంలో నకిలీ కరెన్సీ నోట్లు విపరీతంగా చెలామణీలోకి వచ్చాయి. రిజర్వు బ్యాంక్ గణాంకాల ప్రకారం.. నకిలీ 500 రూపాయల నోట్ల సంఖ్య 102 శాతం పెరిగినట్లు మార్చిలో వెల్లడించింది. ఇదే సమయంలో నకిలీ 2000 రూపాయల నోట్ల సంఖ్య 55 శాతం మేర పెరిగిందని వెల్లడించింది. వీటికి సూత్రధారులు పాకిస్తాన్ కేంద్రంగా ఉన్నట్లు అనేక మార్లు వెల్లడైంది. డీమానిటైజేషన్ సమయంలో పాకిస్తాన్ కేంద్రంగా ముద్రిస్తున్న పాత కరెన్సీ నోట్ల దందా వీడియోలు సైతం చాలానే మీడియాలో వచ్చాయి. ఈ నిర్ణయం పూర్తి స్థాయిలో అమలు అయితే డిజిటల్ చెల్లింపులు పెరుగుతాయి. దీని ద్వారా పాకిస్తాన్ ఆట కట్టించవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

  డిజిటల్ కరెన్సీని ఎలా ఉపయోగించుకోవచ్చు?

  ఉదాహరణకు, ఏదైనా ఓ కంపెనీ, ఒక నెలలో తన ఉద్యోగులకు జీతాలతో పాటు అదనంగా ఐదు వందలు ఇవ్వాలని నిర్ణయించుకుంటే ఇ-రూపీ వోచర్లు ఇవ్వొచ్చు. ఉద్యోగుల మొబైల్ ఫోన్‌కు కోడ్ లేదా మెసేజ్ ద్వారా ఈ వోచర్ వచ్చేస్తుంది. ఇచ్చిన ఇ-రూపీ వోచర్లను వినియోగించారా, లేదా అనేది కూడా ట్రాక్ చేయవచ్చు. డిజిటల్ వాలెట్‌, డిజిటల్ చెల్లింపు వ్యవస్థలకు మొదటి నుంచీ ప్రధాని మోదీ భారీ స్థాయిలో మద్దతు ఇస్తూ వస్తున్నారు. ఆ దిశలో ఇ-రూపీ వ్యవస్థ మరిన్ని ప్రయోజనాలను అందించగలదని విశ్లేషకులు భావిస్తున్నారు.

  కరెన్సీ నోట్ల ముద్రణకు మన ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది ఎంత?

   కరెన్సీ నోట్ల ముద్రణకు అయ్యే ఖర్చులో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒక్క 100 రూపాయల నోటును ముద్రించేందుకు ఆర్బీఐకి 15 నుంచి 17 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక 200 నోటు ముద్రణకు సుమారు 19 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే విధంగా 500 రూపాయల నోటు ముద్రణకు 23 రూపాయలు ఖర్చు అవుతుంది.

  దేశంలో అత్యధిక విలువ కలిగిన కరెన్సీ నోటు 2000. ప్రస్తుతం దీని ముద్రణను నిలిపివేసింది ఆర్బీఐ. పాత నోట్ల రద్దు తరువాత 2000 రూపాయల నోటును ఆర్బీఐ ముద్రించింది. ఈ నోటును ముద్రించడం కోసం ఆర్బీఐ 28 రూపాయలు ఖర్చు చేస్తుంది. ఇలా ఒక్కో నోటు ముద్రణకు ఒక్కో స్థాయిలో ఖర్చు అవుతుంది.

  కరెన్సీ నోట్ల ముద్రణ కోసం రిజర్వ్ బ్యాంక్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో 4,984.80 కోట్లు ఖర్చు చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 4,012.10 కోట్లు ఖర్చు చేసింది. 2008-09 ఆర్థిక సంవత్సరంలో 2,063.16 కోట్లు ఖర్చు చేసింది. నోట్ల రద్దు తర్వాత 2016-17లో సుమారు 8వేల కోట్లు కరెన్సీ ముద్రణకు రిజర్వ్ బ్యాంక్ ఖర్చు పెట్టింది.

  భద్రతా పరమైన సమస్యలు….

  పశ్చిమ భారతంలో నాషిక్ లో, మధ్య భారతంలోని దేవాస్ లో కరెన్సీ నోట్ల ముద్రణ జరుగుతుంది. ఈ రెండు ప్రింటింగ్ ప్రెస్ లు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. మైసూర్, తూర్పు భారతంలోని సల్బోనీలో ఉన్న ప్రింటింగ్ ప్రెస్ లు సెంట్రల్ బ్యాంక్ ఆధీనంలో ఉన్నాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ లిమిటెడ్ సంస్థ ముంబై, హైదరాబాద్, కలకత్తా, నొయిడా కేంద్రంగా నాణేలను అచ్చు వేస్తుంది. వీటిని ఒకచోటు నుంచి మరోచోటుకు తరలించడంలో భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్ లలో చోరీ సంఘటనలు కూడా తరచూ జరుగుతున్నాయి. గతేడాది జూలైలో నాషిక్ లో 5లక్షల రూపాయలు చోరికీ గురయ్యాయి. దేవాస్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి 90లక్షలు కాజేసీ సీఐఎస్ఎఫ్ కు పట్టుబడ్డాడు ఓ ప్రెస్ ఉద్యోగి. ఇక ఉగ్రమూకలు, తీవ్రవాదుల కార్యకలాపాలను అదుపు చేయడంలో ఇ-రూపీ ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలోనే డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఇ-రూపీని అందుబాటులోకి తేనుంది. 2016లో డీమోనిటైజేషన్ అమలు చేయడం ద్వారా అక్రమ నగదుకు స్వస్తి పలికి, భారతదేశాన్ని నగదు రహిత సమాజంగా మార్చాలని ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసింది. తక్కువ నగదు అమలులో ఉండే వ్యవస్థగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ప్రకటించింది. నిరంతరం డిజిటల్ వాలెట్‌ను ప్రోత్సహిస్తూ వచ్చింది. అయితే 2020లో భారత్ లో 89 శాతం లావాదేవీలు నగదు రూపంలో జరిగాయని ఓ అధ్యయనంలో తేలింది. దీంతో వీలైనంత త్వరగా డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించాలని ప్రభుత్వం-రిజర్వ్ బ్యాంక్ భావిస్తున్నాయి.

  Related Stories