ప్రధాని మోదీ స్పీచ్ హైలైట్స్

0
656

ప్రధాని నరేంద్రమోదీ ఎర్రకోటలో నిర్వహించిన 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన త్యాగధనులను దేశం స్మరించుకుంటోందని తెలిపారు. దేశ సరిహద్దుల్లో నిరంతరం పహారా కాస్తున్న వీర జవాన్లను, కరోనా మహమ్మారిపై వైద్యులు, సిబ్బంది చేసిన పోరాటాన్ని ఆయన కొనియాడారు. ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటారని.. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన వారంతా మనకు స్ఫూర్తి అని మోదీ అన్నారు. సర్వ సమృద్ధ భారత్‌ నిర్మాణానికి మనం సంకల్పం తీసుకోవాలి. సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌, సబ్‌ కా విశ్వాస్‌.. మన రణనినాదం కావాలని మోదీ అన్నారు. జమ్మూకశ్మీర్‌ వికాసానికి చర్యలు చేపట్టామని.. లడఖ్ లో సింధూ సెంట్రల్‌ యూనివర్శిటీ ఏర్పాటు చేశామన్నారు. ఇంటర్‌నెట్‌ను గ్రామస్థాయికి అందిస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. డిజిటల్‌ విప్లవంతో ఆర్థిక శక్తిని మరింత బలోపేతం చేసుకోవాలని.. వ్యవసాయ రంగంలో నూతన సంస్కరణలు అవసరమని మోదీ అన్నారు. పెరుగుతున్న జనాభాతో భూకమతాల పరిమాణం తగ్గుతోందని.. దేశంలో 80శాతం రైతులు ఐదెకరాల లోపు భూమి కలిగినవారేనని అన్నారు. చిన్న, సన్నకారు రైతులు దేశానికి గర్వకారణం అయ్యేలా పథకాలు ఉండాలని.. రైతు పంటకు మంచి ధర లభించే సౌకర్యం కల్పించాలని ఆకాంక్షించారు.

దేశంలో గతి శక్తి జాతీయ మాస్టర్ ప్లాన్‌ తీసుకురానున్నట్లు మోదీ ప్రకటించారు. రూ.100లక్షల కోట్లకు పథకం లక్షలాది మంది యువతకు ఉపాధిని అందిస్తుందన్నారు. గతి శక్తి దేశానికి జాతీయ మౌలిక సదుపాయాల ప్రధాన ప్రణాళిక అవుతుందన్నారు. ఆర్థిక వ్యవస్థకు సమగ్ర బాటలు అందిస్తుందని చెప్పారు. స్పీడ్ పవర్ అన్ని అడ్డంకులు, ఇబ్బందులను తొలగిస్తుందని, సామాన్యుల ప్రయాణ సమయం తగ్గిస్తుందని చెప్పారు. రేషన్ షాపులు లేదంటే మధ్యాహ్న భోజన పథకం ద్వారా అయినా, ప్రతి ప్రభుత్వ కార్యక్రమం కింద అయినా అందుబాటులో ఉన్న బియ్యం 2024 నాటికి పటిష్టం చేస్తామని చెప్పారు. పోషకాహారంతో పాటు వైద్యం అత్యంత కీలకమైందన్నారు. మండలస్థాయి వరకు సంపూర్ణ వైద్య సౌకర్యాలు అందించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయన్నారు. సంపూర్ణ ఆరోగ్య సాధన కోసం వైద్యుల సంఖ్య పెంచాల్సి ఉందన్నారు. వైద్యుల సంఖ్య పెంచేందుకు ఎన్నో సంస్కరణలు చేపట్టామన్నారు. ఓబీసీల్లో ఎవరు ఉండాలనేదానిపై రాష్ట్రాలకే అధికారం ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకొని ప్రతి ఒక్కరికి లబ్ధి కలిగేలా చూడాలన్నారు.

దేశంలోని అన్ని సైనిక్ స్కూళ్ల‌లో బాలిక‌ల‌కు ఎంట్రీ ఉంటుంద‌ని.. చాలా మంది బాలిక‌లు నాకు లేఖలు రాస్తున్నారు. అందుకే ఇక నుంచి బాలిక‌ల కోసం అన్ని సైనిక్ స్కూళ్ల త‌లుపులు తెర‌వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిందని ప్ర‌ధాని మోదీ అన్నారు. రెండున్న‌రేళ్ల కింద‌ట తొలిసారి ప్ర‌యోగాత్మ‌కంగా మిజోరంలోని సైనిక్ స్కూల్‌లో బాలిక‌ల‌ను అనుమ‌తించిన‌ట్లు మోదీ చెప్పారు. ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా ఉన్న అన్ని సైనిక్ స్కూళ్లు మ‌న దేశంలోని కూతుళ్ల కోసం త‌లుపులు తెరుస్తాయ‌ని ఆయ‌న తెలిపారు. ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ నియంత్ర‌ణలో ఉండే సైనిక్ స్కూల్స్ సొసైటీ ఈ సైనిక్ స్కూళ్ల‌ను నిర్వ‌హిస్తుంది. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా 33 సైనిక్ స్కూళ్లు ఉన్నాయి.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here