ప్రధాని నరేంద్ర మోదీ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌లో శనివారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మమత ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు.
బెంగాల్ ఓటర్లను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ.. శుక్రవారం రాత్రి 55 నిమిషాల పాటు వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ ఆగిపోయిందని అందరూ చాలా చింతించారని చెప్పారు. అయితే.. బెంగాల్ ఆశలు, కలలు, అభివృద్ధి కూడా 50-55 సంవత్సరాల నుంచే కుంటుపడిందని ప్రధాని వ్యాఖ్యానించారు. అందుకు కారణం.. తొలుత కాంగ్రెస్ కాగా.. ఆ తర్వాత లెఫ్ట్ పార్టీలని.. ఇప్పుడు తృణముల్ కాంగ్రెస్ అని మోదీ విమర్శించారు. టీఎంసీ వల్ల రాష్ట్రాభివృద్ధి స్తంభించిందని మోదీ చెప్పారు.
బెంగాల్‌లో ఈసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, అధికారంలోకి వస్తుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. బెంగాల్‌ను 70 ఏళ్ల దోపిడి నుంచి బయటపడేలా చేస్తామని, నిజమైన మార్పంటే ఏంటో చూపిస్తామని ఆయన ఓటర్లకు చెప్పారు. బీజేపీని ఆశీర్వదించేందుకు ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడికి రావడం తన బాధ్యతను మరింత పెంచిందని ప్రధాని తెలిపారు. బీజేపీని అధికారంలోకి తీసుకొస్తే బెంగాల్ ప్రజలను కష్టాల నుంచి గట్టెక్కిస్తామని ఆయన చెప్పారు.
మెరుగైన నీటిపారుదల, వ్యవసాయానికి ఊతమిచ్చే విధంగా మెరుగైన అవకాశాలు, మెరుగైన కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు కల్పిస్తామని ఓటర్లకు మోదీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు చేసిన విధ్వంసాన్ని చూశారని, తృణముల్ మీ ఆశలను ఆవిరి చేసిందని మోదీ ఓటర్లనుద్దేశించి వ్యాఖ్యానించారు. గత 70 ఏళ్లలో మీరు ఎంతోమందికి అవకాశమిచ్చారని, 70 ఏళ్ల విధ్వంసం నుంచి బెంగాల్‌కు విముక్తి కల్పిస్తామని.. మీ కోసం ప్రాణ త్యాగాలకైనా సిద్ధమని ప్రధాని నరేంద్ర మోదీ బెంగాల్‌లో భావోద్వేగంతో మాట్లాడారు. ఆట మొదలైందని దీదీ చెబుతున్నారని.. కానీ ఆట ఎప్పుడో ముగిసిందని.. ఇకపై బెంగాల్ అభివృద్ధి మొదలవుతుందని మోదీ టీఎంసీకి చురకలంటించారు. దీదీకి బెంగాల్ ప్రజలు 10 ఏళ్ల పాటు అవకాశమిచ్చారని.. కానీ ఆమె ప్రజలను మోసం చేశారని మోదీ విమర్శించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని హింసకు, అధికార దుర్వినియోగానికి మమత పాల్పడ్డారని ప్రధాని ఆరోపించారు.
ఇక మోదీ మాట్లాడిన వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ ఉపమానంతో కూడిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారిన వేళ మీరూ ఓ లుక్కేయండి.