కరోనా లాక్డౌన్ ముగిసిన తర్వాత.. ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి దేశం దాటారు. రెండురోజుల పర్యటనలో భాగంగా ఆయన బంగ్లాదేశ్ వెళ్లారు. బంగ్లాదేశ్‌కు స్వాతంత్ర్యం సిద్ధించి 50 ఏళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. సరిగ్గా 1971 మార్చి 26న పాక్ నుంచి బంగ్లాదేశ్‌కు విముక్తి లభించింది. తూర్పు పాకిస్థాన్‌గా ఉన్న బంగ్లా స్వతంత్ర దేశంగా అవతరించడంలో భారత్ నాడు కీలక పాత్రపోషించింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ స్వాతంత్ర్య స్వర్ణోత్సవాలకు గౌరవ అతిథిగా ప్రధాని మోదీని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆహ్వానించింది. వారి ఆహ్వానం మేరకు ఆయన బంగ్లాలో పర్యటిస్తున్నారు. అటు బంగ్లాదేశ్ జాతిపిత, బంగ బంధు షేక్ ముజిబుర్ రహమాన్ శత జయంతి ఉత్సవాలు కూడా ఇదే సమయంలో జరగడంతో నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఇటీవలే ముజిబుర్ రహమాన్‌కు భారత ప్రభుత్వం 2019గానూ గాంధీ శాంతి పురస్కారం ప్రకటించింది. మోదీ పర్యటనలో రెండు దేశాల జాతిపితలు బంగబంధు-బాపూ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
తొలిరోజు పర్యటనలో భాగంగా.. శుక్రవారం ఉదయం ఢాకా చేరుకున్న మోదీకి.. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత మోదీ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అమరవీరుల స్మారకాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్‌లోని భారతీయులను మోదీ కలుసుకున్నారు. వారితో ముచ్చటించి వారితో ఫొటోలు దిగారు. పలువురు బంగ్లా రాజకీయ నేతలు, అక్కడ పౌరులను కలిసి వారితో ముచ్చటించారు. బంగ్లాదేశ్ ప్రతిపక్ష నేతలతోనూ, ఆ దేశ విదేశాంగ మంత్రితోనూ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. బంగ్లాదేశ్ స్వాతంత్ర్య స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా.. ప్రధాని షేక్ హసీనా ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. అనంతరం డిజిటల్ ప్రదర్శనను తిలకించారు.
ఈ సదర్భంగా బంగ్లాదేశ్ విముక్తిపోరాటం నాటి రోజులను మోదీ గుర్తుచేసుకున్నారు. బంగ్లాదేశ్ 50వ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ఆ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం తాను చేసిన సత్యాగ్రహం తన రాజకీయ జీవితం తొలినాళ్ళలో చేసిన పోరాటాల్లో ఒకటని అన్నారు. తన రాజకీయ జీవితంలో కూడా బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటం చాలా ముఖ్యమైనదని చెప్పారు. బంగ్లా విముక్తికోసం తాను తన సహచరులతో కలిసి భారత దేశంలో సత్యాగ్రహం చేసిన రోజులను గుర్తుచేసుకున్నారు. అప్పట్లో తన వయసు ఇరవైలలో ఉండేదని.. సత్యాగ్రహం సందర్భంగా జైలుకు కూడా వెళ్లానని చెప్పారు. మహోన్నత బంగ్లాదేశ్ సైనికులు, వారికి సహకరించిన భారతీయులు చేసిన గొప్ప త్యాగాలను ఎన్నటికీ మర్చిపోలేమని తెలిపారు.
ఇక రెండో రోజు బంగ్లాదేశ్‌లోని పలు ప్రముఖ హిందూ ఆలయాలను ప్రధాని మోదీ సందర్శిస్తారు. పురాణాల్లోని 51 శక్తిపీఠాల్లో ఒకటైన జసోరేశ్వరి ఆలయం బంగ్లాలో ఉంది. పశ్చిమ్ బెంగాల్ సరిహద్దుకు సమీపంలో సత్యానగర్‌లోని ఈశ్వర్‌పూర్ వద్ద ఉండే జసోరేశ్వరి కాళీ ఆలయాన్ని ప్రధాని మోదీ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సత్ఖీరా, ఓరకండీలోని మరో రెండు ఆలయాలను కూడా మోదీ దర్శించుకుంటారు.