More

    రైతు చట్టాలు వెనక్కి..!
    మోదీ సంచలన నిర్ణయం..!!

    కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మూడు చట్టాలను వెనక్కు తీసుకోవాలని నిర్ణయించినట్లు ప్రధాని వెల్లడించారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో చట్టాల రద్దు పైన తీర్మానం చేస్తామని ప్రకటించారు. డిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులంతా.. గురునానక్ జయంతి నాడు ఇళ్లకు చేరాలని సూచించారు. ప్రధాని మోదీ దేశ ప్రజలకు గురు నానక్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. తాను స్వయంగా రైతుల కష్టాలు దగ్గరి నుంచి చూశానన్నారు. దేశంలో 80 శాతం చిన్న తరహా రైతులే ఉన్నారని.. వారి కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తులు పెంచామన్నారు. మైక్రో ఇరిగేషన్ ను నిధులు భారీగా ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. రైతు బడ్జెట్ ను సైతం గతంలో ఎన్నడూ లేని విధంగా పెంచి.. వారికి అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తున్నామని ప్రధాని వివరించారు.

    చిన్న.. సన్న కారు రైతులకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ ప్రభుత్వం కీలకంగా వ్యవహరిస్తుందన్నారు ప్రధాని మోదీ. వారికి విత్తనాలు.. బీమా.. మార్కెటింగ్ సదుపాయంతో పాటుగా ఆర్దికంగా వారికి ప్రయోజనం ఉండేలా నిర్ణయాలు అమలు చేస్తున్నామని చెప్పారు. రైతులకు యూరియా.. భూ పరీక్షల కార్డులు.. మైక్రో ఇరిగేషన్ వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు. కనీస మద్దతు ధరపైన మాత్రమే కాకుండా.. ప్రొక్యూర్ మెంట్ పైన దశాబ్దాల కాలంగా జరగని విధంగా చేసామని ప్రధాని వెల్లడించారు. తాము రైతు సంక్షేమం కోసమే ఈ నిర్ణయాలు తీసుకున్నామని చెబుతూనే… తాము, రైతుల ఆందోళన పరిగణలోకి తీసుకుని తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నామని స్పష్టం చేశారు మోదీ.

    తాము అధికారంలోకి వచ్చిన తరువాత గతంలో కంటే అయిదు రెట్లు వ్యవసాయ బడ్జెట్ ను తీసుకొచ్చామని ప్రధాని చెప్పుకొచ్చారు. ఇంత కాలం రైతులను ఇబ్బంది పెట్టినందుకు ప్రధాని విచారం వ్యక్తం చేసారు. ప్రధాని చేసిన సంచలన ప్రకటనతో ఏడాదికి పైగా సాగుతున్న రైతుల ఆందోళన ముగియనుంది. ఈ నెలాఖరులో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఈ మూడు చట్టాలను వెనక్కు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    ఇదిలావుంటే, రైతు చట్టాలన వెనక్కితీసుకోవడంపై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విపక్ష పార్టీలు ఆనందం వ్యక్తం చేస్తుంటే.. ఆర్థిక, రాజకీయ నిపుణలు మాత్రం విచారం వ్యక్తం చేస్తున్నారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించగానే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. రైతుల సత్యాగ్రహానికి కేంద్ర ప్రభుత్వం తలవంచక తప్పలేదన్నారు.

    ఇక, రైతు చట్టాలను వెనక్కు తీసుకోవడం పట్ల మాజీ ఎమ్మెల్యే, మాజీ ఐఏఎస్, లోక్ సత్తా అధినేత జయ ప్రకాష్ నారాయణ్ మాత్రం విచారం వ్యక్తం చేశారు. రైతులకు ఎంతో మేలు చేసే చట్టాలు రద్దు కావడం వల్ల రైతులకే చాలా నష్టమని అన్నారు. అయితే చట్టాలకు మద్దతుగా వారు తమ గొంతుక వినిపించలేదని., ఇప్పుడు వారు విచారం వ్యక్తం చేసినా ప్రయోజనం లేదన్నారు.

    Trending Stories

    Related Stories