Special Stories

ఆపరేషన్ ‘కామధేను’..! ఈ దీపావళికి చైనాకు చుక్కలే..!!

మనం కాకరవత్తులు కాలిస్తే.. వాడికి కాసులు కురుస్తాయి. మనం చిచ్చుబుడ్లు వెలిగిస్తే.. వాడి జేబులు నిండుతాయి. మనం టపాసులు పేలిస్తే.. వాడి ఖజాన కళకళలాడుతుంది. మొత్తానికి, మన దీపావళికి.. వాడు పండగ చేసుకుంటాడు. వాడెవడో తెలుసా..? ఇంకెవడు చైనావోడు..! గత ప్రభుత్వాల చేతగానితనం, చిన్నతరహా పరిశ్రమలను పట్టించుకోకపోవడం, స్వదేశీ ఉత్పత్తిని పెంచకపోవడం వల్ల.. దశాబ్దాలుగా చైనా మన మార్కెట్లను కొల్లగొడుతూనేవుంది. ఒక్క దీపావళి బాణసంచా మాత్రమే కాదు.. ఆట బొమ్మల నుంచి మొదలు పెడితే.. మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ చిప్స్, 4జీ, 5జీ, టెలికాం ఉత్పత్తుల వరకు అన్నింటినీ మనపై రుద్దుతున్నాడు. నాణ్యతలేని వస్తువులతో భారత్‎ను ఓ డంప్ యార్డ్‎గా మార్చేసి.. కోట్లలో డబ్బులు దండుకుంటున్నాడు. చైనావోడి మోచేతి నీళ్లు తాగిన సోకాల్డ్ సెక్యులర్ ప్రభుత్వాలు.. స్వదేశీ మార్కెట్‎ను ఎదగకుండా చేశారు. అస్తమానం చైనా భజన చేస్తూ.. మన మార్కెట్‎ను వాడికి ధారదత్తం చేశారు. దీంతో మన సంపద మెక్కుతూ తెగబలిసిన డ్రాగన్.. మనపైనే విషం చిమ్ముతోంది. సరిహద్దులను చెరిపేస్తూ.. కయ్యానికి కాలుదువ్వుతోంది. మన జవాన్ల ప్రాణాలను బలితీసుకుంటోది.

కానీ, మార్పు మొదలైంది. ఇటీవలికాలంలో చైనా కంపెనీలకు భారతీయులు చుక్కలు చూపిస్తున్నారు. మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్‎లో భాగంగా.. స్వదేశీ తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తోంది మోదీ ప్రభుత్వం. ఓవైపు స్వదేశీ ఉత్పత్తులకు చేయూతనిస్తూనే.. మరోవైపు చైనా ఉత్పత్తులపై ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే చైనా యాప్‎లతో పాటు కొన్ని వస్తువుల దిగుమతులను నిలిపివేసింది. కొన్నేళ్లుగా చైనా నుంచి దిగుమతయ్యే దీపావళి ఉత్పత్తులపైనా ఉక్కుపాదం మోపుతోంది. ఈసారి కూడా చైనా టపాసులకు మోదీ ప్రభుత్వం చెక్ పెట్టబోతోంది. తక్కువ నాణ్యత కలిగిన దీపావళి అలంకరణ సామాగ్రి, దీపాలు, టపాసుల అమ్మకాల్లో కొన్ని దశాబ్దాలుగా చైనా పెత్తనం చెలాయిస్తోంది. అయితే, గతేడాది చైనా టపాసులను తిరస్కరించి.. భారతీయులు డ్రాగన్‎కు షాకిచ్చారు. దీపావళి వస్తువులను ఎగుమతి చేస్తున్న చైనా కంపెనీలను భారతీయ వ్యాపారులు స్వచ్ఛందంగా బైకాట్ చేశారు. దీంతో చైనా కంపెనీలు 40 వేల కోట్ల నష్టాన్ని చవిచూడాల్సివచ్చింది. ఇదే అదనుగా మోదీ ప్రభుత్వం కూడా చైనా ఉత్పత్తులకు వ్యతిరేక పోరాటంలో మరో అడుగు ముందుకు వేసింది. ఈసారి కూడా చైనా దీపావళి ఉత్పత్తులకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. కేంద్ర మత్స, పశుసంవర్ధక శాఖ ఇందుకు బాటలు వేసింది.

తాజాగా ‘కామధేను దీపావళి 2021’ పేరుతో కొత్త క్యాంపెయిన్‎ను ప్రారంభించింది మోదీ ప్రభుత్వం. కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్రీయ కామధేను ఆయోగ్ మాజీ చైర్మన్ వల్లభాయ్ కటారియా,.. మత్స, పశుసంవర్ధక శాఖామంత్రి పర్శోత్తం రూపాలా వెబినార్ ద్వారా ఈ క్యాంపెయిన్‎ను ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 100 కోట్ల విలువైన స్వదేశీ దీపావళి ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయి. ఆవు పేడతో తయారుచేసే మట్టి దీపాలు, లక్ష్మీ గణపతుల విగ్రహాల తయారీ దారులకు ప్రోత్సాహం లభించనుంది. ఆవు పేడ, గోమూత్రం, పాలు, పెరుగు, నెయ్యి వంటి గోఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించడమే.. ‘కామధేను దీపావళి 2021’ ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం ఈ పంచగవ్యాలతో 300లకు పైగా వస్తువులు తయారవుతున్నాయి. దీపావళి పర్వదినం నాడు ఉపయోగించే దీపాలు, కొవ్వొత్తులు, సాంబ్రాణి కప్పు, అగరువత్తులు, ధూపం కర్రలు, హార్డ్ బోర్డు, వాల్ పీస్, లక్ష్మీ-గణేష్ విగ్రహాలు వంటివన్నీ ఆవు పేడతో తయారు చేయారవుతున్నాయి. హానికారక రసాయనాలు ఉపయోగించి.. చైనా తయారు చేసే దీపాలకంటే.. ఈ గోమయ దీపాలు పర్యావరణాన్ని కపాడతాయి. గతేడాది భారత్‎లో ఆవుపేడతో కొన్ని కోట్ల దీపాలు తయారుచేసినట్టు పశుసంవర్ధక శాఖామంత్రి పర్శోత్తం రూపాలా తెలిపారు. ఇలా గోఆధారిత ఉత్పత్తులను మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. గాంధీ జయంతి రోజున ఎలాగైతే ఖాదీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తామో.. దీపావళికి గోమయ ఉత్పత్తులను కొనుగోలు చేసేలా భారత దేశం అంతటా ప్రచారం చేయాలని అన్నారు.

గతేడాది లాగానే, ఈ దీపావళి సీజన్‌లోనూ గో ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించడానికి మోదీ ప్రభుత్వం నడుం బిగించింది. ఈ క్రతువులో ఈసారి నేరుగా పాలుపంచుకుంటోంది. ఎప్పటిలాగే ఈ దీపావళికి కూడా భారతీయ మార్కెట్‎ను దోచుకోవాలని కాచుక్కూచున్న చైనాకు.. ఇది ముచ్చెమటలు పట్టించే పరిణామం.

నిజానికి, చైనా వస్తువులు చాలా చౌకగా లభిస్తాయి. దీంతో మన్నిక గురించి ఆలోచించకుండా కొనేయడం మనకు అలవాటైపోయింది. దీంతో భారతీయ మార్కెట్‎లో చైనా వేళ్లూనుకుపోయింది. 2018-19 వరకు భారతీయ మార్కెట్‎లో చైనా హవా అడ్డూ అదుపూలేకుండా సాగింది. భారత్‎లో ప్రత్యామ్నాయాలు ఎక్కువగా లేనందున, ప్రజలు చైనా వస్తువులవైపు మొగ్గుచూపాల్సివచ్చింది. అయితే, గల్వాన్ ఘటన తర్వాత భారతీయులు మైండ్ సెట్ మార్చుకోవడం ప్రారంభించారు. ముఖ్యంగా చైనా పంట పండించే దీపావళి పండుగ సీజన్‎లో.. ఆ దేశ ఉత్పత్తులు కొనడం భారీగా తగ్గించారు. ఇదే సమయంలో మోదీ ప్రభుత్వం స్వదేశీ వస్తువులు, వస్తుసేవలను ప్రోత్సాహిస్తోంది. ఇప్పుడు కూడా, గో ఆధారిత ఉత్పత్తులు పెద్దమొత్తంలో తయారవుతుండటంతో వినియోగదారులకు ఆప్షన్స్ పెరిగాయి. చైనా ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా.. ఇప్పుడు అనేక రకాల దేశీయ ఉత్పత్తులు కనబడుతున్నాయి.

కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా ప్రకారం.. గతేడాది దసరా-దీపావళి పండుగ సీజన్‌లో.. ఒక నెలలోనే 72 వేల కోట్ల అమ్మకాలు పెరిగాయి. దేశవ్యాప్తంగా 4 వేల వ్యాపారుల సంస్థలు, 7 కోట్లకు పైగా వ్యాపారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న.. ఈ ట్రేడర్స్ యూనియన్ లెక్కల ప్రకారం.. పండుగ సీజన్ విక్రయాలు ఏటా 10.8 శాతం స్వదేశీ ఉత్పత్తులుపెరుగుతున్నాయన్నమాట. దీంతో గతేడాది చైనా కనీసం 6 బిలియన్ డాలర్లు 40 వేల కోట్ల నష్టాన్ని చవిచూసింది. 2020 లో గల్వాన్ ఘర్షణ తరువాత,.. CAIT డిసెంబర్ 2021 నాటికి లక్ష కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన చైనా వస్తువులను బహిష్కరించాలని నిర్ణయించింది. ముఖ్యంగా బొమ్మలు, గిఫ్టులు, ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్, మిఠాయిలు, బట్టలు, గడియారాలతో సహా.. నేడు 3 వేల రకాల చైనా వస్తువులకు స్వదేశీ ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఇదంతా ప్రధాని మోదీ సంకల్పించిన మేకిన్ ఇండియాతోనే సాధ్యమవుతోంది. అయినా,.. దేశాన్ని ఆత్మనిర్భరంగా ఈ క్రతువును కుహనా లెఫ్ట్ లిబరల్ లౌకికవాదులు విమర్శిస్తూనేవున్నారు. కానీ, దేశభక్తిగల భారతీయుల సహకారంతో ప్రధాని మోదీ నిరంతరం స్వయం సమృద్ధి కోసం పాటుపడుతున్నారు. తాజాగా ‘కామధేను దీపావళి 2021’ పేరుతో మోదీ విసిరిన ఉక్కు పంజా.. ఈసారి దీపాల పండక్కి చైనాకు చుక్కలు చూపించడం ఖాయమంటున్నారు మార్కెట్ నిపుణులు. అయితే, ప్రభుత్వం స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించినంత మాత్రానా సరిపోదు. భారతీయులుగా మనం కూడా చైనా ఉత్పత్తులను బహిష్కరించాలి.

నిజానికి, చైనా వస్తువుల ముప్పును భారతీయులు ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడుతున్న కార్యక్రమాలతో నిజాలు తెలుసుకుంటున్నారు. చైనా వస్తువులు కొనడమంటే.. మన మార్కెట్‎ను మనమే చేజేతులా నాశనం చేసుకుని.. శత్రు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమేనని అర్థంచేసుకుంటున్నారు. చైనా వస్తువులు కొనడమంటే.. సరిహద్దుల్లో మన వీరజవాన్ల మరణాలకు మనమే నిధులు సమకూర్చడమన్న.. కఠోర సత్యాన్ని గ్రహిస్తున్నారు. అందుకే, మెల్లమెల్లగా చైనా వస్తువులకు దూరం జరుగుతున్నారు. కానీ, ఇది సరిపోదు, చైనా వస్తు బహిష్కరణ ఓ ఉద్యమంలా సాగాలి. ప్రతి భారతీయ వినియోగదారుడు చైనా వస్తువులను బైకాట్ చేయాలి. అప్పుడే దేశం స్వయం సమృద్ధిని సాధిస్తుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

14 − 10 =

Back to top button