It's 4 U

బాలీవుడ్ బద్మాష్ ఫ్యాక్టరీకి కేంద్రం చెక్..!

మనిషన్నాక కాస్త కళాపోషణ ఉండాలంటారు. మరి, సినిమా అన్నాక వివాదం ఉండాలా..? 24 కళలకు కేంద్రమైన సినిమా.. కాంట్రవర్సీకి కేరాఫ్ గా నిలవాలా..? సంస్కృతిని, సంప్రదాయాన్ని ప్రశ్నించాలి. లేదంటే ఏదైనా వర్గాన్ని గాని, ధర్మాన్ని టార్గెట్ చేసుకోవాలి. అవసరమైతే దేవుడి అస్తిత్వాన్ని సైతం ప్రశ్నించాలి. ఇవే ఇప్పుడొస్తున్న సినిమాలకు కథా వస్తువులు. ఈ సినీ సంస్కృతి సమాజంలో భయాందోళనలు రేకెత్తిస్తోంది. ప్రజల్లోకి శరవేగంగా దూసుకెల్లే ప్రధాన మాధ్యమం సినిమానే. అలాంటి సినిమా అందిరినీ మెప్పించేలా ఉండాలి. కానీ, ఇప్పుడొస్తున్న సినిమాలు వివాదాలకు కేంద్రబిందువులుగా మారుతున్నాయి. రెండున్నర గంటలు వినోదాన్ని, విజ్ఞానాన్ని పంచాల్సిన సినిమా.. సమాజంపై విషం చిమ్ముతోంది.

ముఖ్యంగా బాలీవుడ్ లో కొన్నేళ్లుగా ఇలాంటి ఉన్మాదం చాలా పెరిగిపోయింది. కొందరు డైరెక్టర్లు, నటులు హిందువులను, హిందుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. కథ, కథనం, సన్నివేశం.. ఇలా ఏదో రూపంలో హిందూ వ్యతిరేకతను జొప్పిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. ఒకటా రెండా.. ఎన్ని సినిమాలని..! ఒకడేమో హిందూ దేవుళ్లను కించపరుస్తాడు. మరొకడు దేవుడే లేడని చెబుతాడు..! ఇంకొకడు హైందవ ధర్మాన్ని ప్రశ్నిస్తాడు.సినిమాకు 24 ఫ్రేమ్స్ మాదిరిగా వివాదాలకు కూడా ఎన్నో ఫ్రేములు జోడించారు. ఇటీవలికాలం రిలీజ్ అవుతున్న దాదాపు ప్రతి సినిమా కాంట్రవర్సీగా మారుతోంది. అయితే, కాంట్రవర్సీలు పైకి కనిపిస్తున్నా.. కనిపించని కోణం సినిమాల్లో ఏదో ఉంటోందనే భావన వ్యక్తమవుతోంది. దేశ సంస్కృతి, సంప్రదాయాలను కించపరిచేలా సినిమాలు తీయడం వెనుక ఏదో కుట్ర జరుగుతోందనే అనుమానాలు లేకపోలేదు. గత పదేళ్లలో వచ్చిన కొన్ని బాలీవుడ్ సినిమాలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఒకప్పుడు సినిమాలు వివాదాలకు గురికావడం చాలా అరుదుగా జరుగుతుండేది. అది కూడా.. అశ్లీలత అతిగావుందనో, శృంగారం శృతిమించిందనో ఓ రెండు మూడు సీన్లకు కట్లు పడేవి. కానీ, ఇప్పుడు టైటిల్ దగ్గర నుండే తగువు మొదలవుతోంది.

పైగా.. నేటి సినీవివాదాలు యాంటీ రిలీజియన్, యాంటీ సొసైటీ టర్న్ తీసుకున్నాయి. రెండు దశాబ్దాలుగా బాలీవుడ్ ఇలాంటి వివాదాలతోనే కాలక్షేపం చేస్తోంది. దేవుళ్లను కించపరిచేలా తీసిన ఎన్నో సినిమాలు కోర్టు మెట్లెక్కాయి. కొన్ని విడుదలకు కూడా నోచుకోలేదు. కథలేం దొరకనట్టు.. వినోదాన్ని పంచే అంశాలు కరువైనట్టు.. కొందరు దర్శక నిర్మాతలు దేవుడినే టార్గెట్ చేసుకుంటున్నారు. సంస్కృతి, సంప్రదాయాలను ప్రశిస్తూ.. గందరగోళం సృష్టిస్తున్నారు. ఏదో కాలక్షేపానికి సినిమాకు వెళ్లే సగటు ప్రేక్షకుడికి చుక్కలు చూపిస్తున్నారు.

2012 లో వచ్చిన ఓ మై గాడ్ సినిమా బాలీవుడ్ లో రేపిన దుమారం అంతా ఇంతా కాదు. ఆక్ట్ ఆఫ్ గాడ్ కాన్సెప్ట్ తో దేవుడి అస్తిత్వాన్నే ప్రశ్నిస్తూ ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారి కాన్జీ లాల్జీ మెహతా దేవుణ్ని నమ్మడు. కానీ దేవుడి విగ్రహాలు అమ్మే దుకాణం నడుపుతుంటాడు. అయితే, ఓ రోజు అతడి దుకాణం కూలిపోతుంది. ఇన్సూరెన్స్‌ కోసం వెళ్తే అది దేవుడి చర్య వల్ల జరిగిన నష్టం కాబట్టి ఇన్సూరెన్స్‌ రాదంటారు. దీంతో దేవుడి మీదే కోర్టుకెళ్తాడు కాన్జీ లాల్. సినిమా ప్రారంభం నుంచి ఎండ్ కార్డు వరకు ఎన్నో సీన్లు వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నాయి. హిందువులు పవిత్రంగా కలశంలో మద్యంసేవించడం. దేవుడి విగ్రహాలను అవమానించడం. భగవంతుడిని పాశ్చాత్య దుస్తుల్లో చూపించి.. భక్తల మనోభావాలను దెబ్బతీయడం. ఇలాంటి అనేక వివాదాస్పద సీన్లు ఓ మై గాడ్ లో చిత్రీకరించారు. అసలు తన దుకాణం కూలిపోవడానికి దేవుడే కారణమంటూ.. కాన్జీలాల్ కోర్టుకెక్కడమే పెనువివాదానికి దారితీసింది.

ఇక 2014 లో వచ్చిన పీకే సినిమా వివాదాలకు కేంద్రబిందువయ్యింది. సినిమాను నిషేధించాలంటూ అనేక ఉద్యమాలు చెలరేగాయి. దేవాలయంలో హీరో చోరీ చేస్తున్నట్టు చూపించడం. పూజారులు డబ్బుకోసం ఎగబడేవారుగా చిత్రీకరించడం వివాదాస్పదమైంది. మరోవైపు శివుడి వేషధారుడిని తరుముతున్నట్టు సినిమాలో కొన్ని దృశ్యాలున్నాయి. ఈ సినిమాలో విగ్రహారాధనను అవహేళన చేస్తూ ఉన్న సీన్లపై దేశవ్యాప్తంగా ఉద్యమాలు చెలరేగాయి.

ఇక డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ నటించిన మెసేంజర్ ఆఫ్ గాడ్ దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపింది. బంగారు ఆభరణాలు ధరించిన ఓ మత గురువు పాశ్యాత్య దుస్తులలో కనిపించడం. బైక్ నడపడం వంటి సీన్లపై అభ్యంతరం వ్యక్తమైంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పడంతో సినిమా యూనిట్ కోర్టుకెక్కింది. ఈ వివాదం చినికి చినికి గాలివానలా మారడంతో అప్పటి సెన్సార్ బోర్డు చైర్మన్ లీలా శాంసన్ తో పాటు.. 9 మంది సభ్యులు రాజీనామా చేయాల్సివచ్చింది.

ఓ మైగాడ్, పీకే, మెసేంజర్ ఆఫ్ గాడ్ సినిమాలు మచ్చుకుమాత్రమే. తరచిచూస్తే బాలీవుడ్ లో ఇలాంటి సినిమాల శాతమే ఎక్కువ. వైల్డ్ లైఫ్ నేపథ్యంలో వచ్చిన తాజా బాలీవుడ్ సినిమా ‘షెర్నీ’లోనూ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా పలు సీన్లను చిత్రీకరించారు. 2018లో అవని అనే పులిని చంపిన అస్గర్ అలీ పాత్రను ఈ సినిమాలో చూపించారు. అయితే, ఈ సినిమాలో ఆ పాత్రధారిని ఓ హిందువుగా చూపించారు. ఆ పాత్రను పోషించిన శరత్ సక్సేనాను.. ముంజేతికి కాషాయ కంకణం ధరించినట్టుగా చూపించారు. అంటే, తప్పు చేసింది ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయితే, సినిమాలో అదే పాత్రలో ఓ హిందువును చూపించడం వివాదాస్పందంగా మారింది. పైగా ఈ సినిమాకు CBFC సర్టిఫికెట్ కూడా లభించింది.

ఇటీవలికాలంలో ఇలాంటి పైత్యం వెబ్ సిరీస్ లకు కూడా పాకింది. తాండవ్ అనే వెబ్ సిరీస్ లో.. హిందువుల ఆరాధ్యదైవమైన పరమశివుడిని కించపరిచేలా పలు సన్నివేశాలు వుండటం అప్పట్లో పెను వివాదానికి దారి తీసింది. అంతేకాదు, హిందువులు దళిత వ్యతిరేకులుగా ముద్రవేసి మరో వివాదానికి దారి తీసింది. ఇక సూటబుల్ బాయ్ అనే మరో వెబ్ సిరీస్ లో హిందువుల దేవాయాల్లో అపవిత్ర కార్యాలను చూపించి కించపరిచారు. నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన ల్యూడో అనే సినిమా పైనా విమర్శలు వెల్లువెత్తాయి.

ఇలా చెప్పుకుంటూ పోతే.. అసలు బాలీవుడ్ మొత్తం హిందూ వ్యతిరేక హబ్ గా మారిందా అనుకోవడంలో అతిశయోక్తి లేదేమో అనిపిస్తుంది. ఇటీవల ఐఐఎం అహ్మదాబాద్ నిర్వహించిన ఓ సర్వేలో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు వెలుగుచూశాయి. ఇప్పటివరకు వచ్చిన బాలీవుడ్ సినిమాల్లో 58 శాతం సినిమాల్లో బ్రాహ్మణ సమాజాన్ని కించపరిచే సన్నివేశాలు ఉన్నాయి. ఇక 62 శాతం సినిమాల్లో.. దోపిడీలకు పాల్పడే ఆర్థిక నిపుణుల పాత్రలకు వైశ్యుల పేర్లే వున్నాయి. 72 శాతం సినిమాల్లో సిక్కులను జోకర్లుగానే చూపించారు. ఇలా బాలీవుడ్ మొత్తం హిందూ వ్యతిరేక హబ్ గా మారిపోయింది. దావూద్ ఇబ్రహీం వంటి మాఫియా, ఖాన్ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన సూపర్ స్టార్లు వున్న బాలీవుడ్ లో ఇలాంటి మతోన్మాద సినిమాలు తప్ప వేరే సినిమాలను ఎలా ఊహించగలం..?

అందుకే, ఈ బాలీవుడ్ విషవలయాన్ని చేధించడానికి కేంద్ర ప్రభుత్వం ఓ బ్రహ్మాస్త్రాన్ని తయారు చేసింది. బాలీవుడ్ లో వెర్రివెతలు వేస్తున్న కొన్ని జాతి వ్యతిరేక శక్తుల ఆటకట్టించేలా.. కొత్త చట్టానికి రూపకల్పన చేసింది. అదే ‘సినిమాటోగ్రఫీ చట్టసవరణ బిల్లు – 2021’. ఇప్పటికే సిద్ధమైన బిల్లు ముసాయిదాపై.. జూలై 2 వరకు ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. త్వరలోనే ఈ బిల్లును చట్టసభల గడప తొక్కనుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. ఈ బిల్లు కార్యరూపం దాల్చుతుంది. ఈ బిల్లుకు ఆమోదముద్ర పడితే.. బాలీవుడ్ బద్మాష్ ఫ్యాక్టరీ ఆటలకు చెక్ పడినట్టే. ఎందుకంటే, ఈ బిల్లు ద్వారా CBFC సిర్టిఫికేషన్ లభించిన సిమాలను కూడా రివ్యూ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లభిస్తుంది. సినిమాలను ధృవీకరించడానికి సంబంధించిన చట్టంలోని సెక్షన్ 5B(1)ని ఉల్లంఘించినా.. చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అంటే, నిబంధనలు ఉల్లంఘించే సెన్సార్ బోర్డుపైనా చర్యలు తీసుకోవచ్చన్నమాట.

సో.. ఇకపై సెన్సార్ బోర్డు సైతం ఒళ్లు దగ్గరపెట్టుకుని సినిమాలకు సర్టిఫికేషన్ ఇవ్వాల్సివుంటుంది. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించి ఏదైనా సినిమా CBFC సర్టిఫికేషన్ పొందితే.. దానిని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి వుంటుంది. గతంలో సుప్రీం కోర్టు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసిందని.. కేంద్ర సమాచార ప్రసార శాఖ తెలిపింది. ఇకపై సంస్కృతి పేరుతో మతం పేరుతో సినిమాల ద్వారా జరిగే దాడులు.. ప్రజల దృష్టి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేవు. ఇకపై చేతిలో మెగాఫోన్ ఉంది కదా అని.. ప్రేక్షకులు చూస్తున్నారు కదా అని.. ఇకపై ఏది పడితే అది తీస్తే కుదరదు. హిందువుల మనోభావాలు కించపరిచినా.. ఆ మాటకొస్తే ఏ మతం మనోభావాలను గాయపరిచినా.. మూల్యం చెల్లించుకోవాల్సిందే.

Leave a Reply

Your email address will not be published.

3 + 11 =

Back to top button