నకిలీ ఓటు.. ప్రజాస్వామ్య భారత దేశానికి పట్టిన అతిపెద్ద పెనుభూతం ఇది. ఈ నకిలీ నోట్ల వల్ల ఒక్కోసారి మనకు ఇష్టం లేని నేతల్ని కూడా మనం మోయాల్సివస్తుంది. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తికాబోతున్నా.. దేశం ఆజాదీ అమృతోత్సవాలను జరుపుకుంటున్నా.. ఈ నకిలీ నోట్ల భూతం మాత్రం ఇఫ్పటికీ వీడలేదు. అందుకే, నరేంద్ర మోదీ ప్రభుత్వం నకిలీ నోట్లను సీరియస్‌గా తీసుకుంది. నకిలీ నోట్ల పీడ విరగడయ్యే మార్గాల కోసం అన్వేషించి.. ఓ పరిష్కారాన్ని వెతికింది. అదే, ఓటర్ ఐడీతో ఆధార్ అనుసంధానం. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. ఎన్నికల సంఘం సిఫారసు మేరకు పలు కీలక సవరణలు చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇందులో భాగంగా ఓటర్ ఐడీతో ఆధార్ కార్డును అనుసంధానం చేయనున్నట్టు స్పష్టం చేసింది. కేంద్ర మంత్రివర్గం ఈ ప్రతిపాదనలకు బుధవారం ఆమోదం తెలపడంతో వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే ఇందుకు సంబంధించిన బిల్లులు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
దీనితో పాటు.. ఓటింగ్ ప్రక్రియ, ఓటర్ల జాబితాను బలోపేతం చేయడం, ఈసీకి మరిన్ని అధికారాలు, నకిలీలను తొలగించడం వంటి నాలుగు ప్రధాన సంస్కరణలు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. పాన్-ఆధార్ లింక్ చేసినట్లే, ఒకరి ఓటర్ ఐడీ లేదా ఎలక్టోరల్ కార్డ్‌తో ఆధార్ కార్డ్ సీడింగ్‌కు కేంద్రం అనుమతించనున్నది. అయితే సుప్రీంకోర్టు గోప్యతా తీర్పునకు అనుగుణంగా స్వచ్ఛంద ప్రాతిపదికన చేయనున్ననున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించామని, సానుకూల ఫలితాలు వచ్చాయని ఈసీ తెలిపింది. ఆధార్ కార్డు అనుసంధానంతో నకిలీల తొలగింపు, ఓటర్ల జాబితా బలోపేతానికి దోహదపడుతుందని కేంద్రం తెలిపింది.
మరోవైపు ఓటర్ల జాబితాలో పేరు నమోదు కోసం మరిన్ని ప్రయత్నాలకు అనుమతించనుంది ఈసీ. వచ్చే ఏడాది జనవరి 1 నుండి 18 సంవత్సరాలు నిండిన తొలిసారి ఓటర్లు నాలుగు వేర్వేరు కటాఫ్ తేదీలతో సంవత్సరానికి నాలుగు సార్లు నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ప్రస్తుతం సంవత్సరానికి ఒకసారి మాత్రమే కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ జరుగుతోంది. కొత్త విధానం అమల్లోకి వస్తే.. ఏటా నాలుగుసార్లు ఓట్లను నమోదు చేసుకోవచ్చన్నమాట.
మరోవైపు సర్వీస్ మహిళా ఆఫీసర్ల భర్తలకు ఓటు అవకాశం కల్పించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఇందుకోసం జెండర్-న్యూట్రల్ చట్టాన్ని తీసుకురానున్నది. ప్రస్తుత చట్టం ప్రకారం రక్షణ రంగంలో పని చేసే పురుషుల భార్యలు మాత్రమే ఓటు వేసే అవకాశమున్నది. ప్రస్తుతం రక్షణ రంగంలో మహిళల పాత్రతోపాటు వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో మహిళా అధికారిణుల భర్తలు ఓటు వేసే అవకాశం కొత్త చట్టం ద్వారా కల్పించనున్నారు.
మరోవైపు ఎన్నికల నిర్వహణ కోసం ఏదైనా ప్రాంగణాన్ని స్వాధీనం చేసుకోవడానికి అవసరమైన అన్ని అధికారాలను కూడా ఈసీకి కేంద్రం ఇచ్చింది. ఎన్నికల సమయంలో పాఠశాలలు, ఇతర ముఖ్యమైన సంస్థలను స్వాధీనం చేసుకోవడంపై కొన్ని అభ్యంతరాలున్న నేపథ్యలంలో ఈసీకి ఈ అధికారాన్ని కల్పించింది. ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ కీలక ఎన్నికల సంస్కరణలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ సంస్కరణలతో దేశంలో ఎన్నికల వ్యవస్థ పారదర్శకంగా మారనుంది.