National

మోదీ-నితిన్ గడ్కరీలది ఒకటే మాట

భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ల సంఖ్యను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉంది. దేశంలో కరోనా వ్యాక్సిన్‌ సరఫరాను భారీగా పెంచేందుకు అనుక్షణం కృషి చేస్తున్నామని భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇటీవలే చెప్పుకొచ్చారు. కరోనాపై పోరులో వ్యాక్సినేషన్‌ ప్రధాన ఆయుధమని, టీకాలపై ప్రజల్లో నెలకొన్న అపోహలను సమష్టికృషితో తొలగించాలని కూడా ఆయన కోరారు. క్షేత్రస్థాయిలో వ్యాక్సిన్‌లు వృథా కాకుండా చూడాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. తొమ్మిది రాష్ట్రాల్లోని 46 జిల్లాల కలెక్టర్లతో ప్రధాని మోదీ వర్చువల్‌ సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో అనుభవాలను తెలియజేయాలని అధికారులను ప్రధాని కోరారు. ఆసుపత్రులలో పడకలతో పాటు వ్యాక్సిన్ల లభ్యతపై ప్రజలకు సరైన సమాచారం అందించాలని, అప్పుడే ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని ప్రధాని తెలిపారు.

యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ కూడా వ్యాక్సిన్లను వీలైనంత త్వరగా తయారు చేయడానికి ఉన్న మార్గాలను అన్వేషిస్తూ ఉన్నామని స్పష్టం చేశారు. వ్యాక్సిన్‌ ఉత్పత్తి పెంచేందుకు మరిన్ని ఫార్మా కంపెనీలకు అనుమతి ఇవ్వాలని ఆయన అన్నారు. వ్యాక్సిన్‌ డిమాండ్‌.. సరఫరా కంటే ఎక్కువగా ఉంటే సమస్య ఉత్పన్నమవుతుందని.. ఒక సంస్థకు బదులుగా.. మరో పది కంపెనీలు వ్యాక్సిన్‌ తయారీకి లైసెన్స్‌ ఇవ్వాలన్నారు. మొదట దేశంలో సరఫరా చేసిన తర్వాత మిగులు ఉంటే ఎగుమతి చేయవచ్చన్నారు. ప్రతి రాష్ట్రంలో రెండు, మూడు ప్రయోగశాలలున్నాయని వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయడానికి వారికి ఫార్ములా ఇవ్వాలన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌ను తాము కోరుకుంటున్నామని, దేశంలోని అన్ని జిల్లాలూ మెడికల్ ఆక్సిజన్ విషయంలో స్వయం సమృద్ధి సాధించాలని అన్నారు.
కరోనా మమమ్మారి కాలంలో ప్రజలు పాజిటివ్ ఆలోచనలు, ఆత్మస్థైర్యం కలిగి ఉండాలని కేంద్రమంత్రి సూచించారు.

కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌, స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్లకు డీజీసిఐ అనుమతి లభించింది. భారత్‌ బయోటెక్‌, సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సంస్థలు తమ వ్యాక్సిన్లను దేశంలో తయారు చేస్తున్నాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ త్వరలోనే స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయనుంది. వ్యాక్సిన్ల కొరత కారణంగా ప్రజలకు వ్యాక్సిన్లను అందించలేకపోతున్నామని పలు రాష్ట్రాలు ఇప్పటికే పిర్యాదులు చేశాయి. పలు రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లకు ఆహ్వానం పలికాయి. రాబోయే రోజుల్లో వ్యాక్సిన్ల సంఖ్యను భారీగా పెంచుతామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

18 − six =

Back to top button