ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి పర్యటనలో భాగంగా ప్రతిష్ఠాత్మక కాశీ విశ్వనాథ్ కారిడార్ ను ప్రారంభించారు. విఖ్యాత కాశీ విశ్వేశ్వరుడి ఆలయం చుట్టూ నిర్మించిన ఈ కారిడార్ లో అత్యున్నత స్థాయి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వారణాసి పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పవిత్ర గంగానదిలో స్నానమాచరించారు. భరతమాత, రాణి అహల్యబాయి హోల్కర్ విగ్రహాలకు నీరాజనాలు అర్పించారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెంట ఉండగా.. కాశీ విశ్వనాథ్ ధామ్ కాంప్లెక్స్ లో తిరుగుతూ కనిపించాడు. కాశీ విశ్వనాథ్ ధామ్ కార్మికులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పేరుపేరునా పలకరించి వారితో ఆప్యాయంగా ముచ్చటించారు.
విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టు పనుల్లో భాగమైన నిర్మాణ కార్మికుల సేవలకు గౌరవంగా వారిపై ప్రధాని నరేంద్ర మోదీ పూల వర్షం కురిపించారు. అనంతరం వారితో కలిసి ఆయన గ్రూప్ ఫొటో తీయించుకున్నారు. ప్రధాని మోదీతోపాటు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా సహపంక్తి భోజనం చేశారు. ప్రధాని మోదీతో కలిసి భోజనం చేసిన ఆ నిర్మాణ కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం మోదీ వారితో కాసేపు మాట్లాడారు.
కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టు ఆవిష్కరణ తర్వాత నిర్వహించిన సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో చమట చిందించిన సోదర, సోదరీమణులకు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. కరోనా మహమ్మారి సమయంలోనూ కార్మికులు పనులు ఆపలేదన్నారు. ఇప్పుడు వాళ్లను కలిసి ఆశీర్వాదం తీసుకునే అవకాశం తనకు దక్కిందన్నారు. ఈ కారిడార్ కేవలం భవనాల నిర్మాణం కాదని.. భారత సనాత సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీక అని మోదీ అన్నారు. కాశీ విశ్వనాథుడి ఆలయ నిర్మాణంలో ఇది సరికొత్త అధ్యాయమని, కాశీలో అడుగుపెట్టగానే ప్రత్యేక అనుభూతి కలుగుతోందని అన్నారు. కారిడార్ నిర్మాణంలో శ్రామికుల కష్టం వెలకట్టలేనిదన్నారు. ఈ కారిడార్ సాయంతో దివ్యాంగులు, వృద్ధులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవచ్చని తెలిపారు మోదీ.