ఇటీవలి పుదుచ్చేరి పర్యటనలో రాహుల్ విజ్ఙాన ప్రదర్శనకు.. అదే పుదుచ్చేరి పర్యటనలో ప్రధాని మోదీ దీటైన సమాధానం ఇచ్చారు. కేంద్రంలో మత్స్యశాఖ లేదని మాట్లాడిన రాహుల్గ గాంధీ అజ్ఙానంపై మోదీ తనదైన రీతిలో విమర్శలు గుప్పించారు.
కేంద్రంలో మత్స్య శాఖ లేదని, దాని కోసం ఓ శాఖను ఏర్పాటు చేయాలని రాహుల్ చెప్పడంతో షాక్ కు గురయ్యానని అన్నారు మోదీ. నిజానికి కేంద్రంలో మత్స్య శాఖ అనేది ఒకటుందని.. దానిని, 2019లో తమ ప్రభుత్వమే ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. అంతేకాదు, బ్రిటీష్ వారు మన దేశాన్ని ఆక్రమించి ‘విభజించు – పాలించు’ అన్న సిద్ధాంతాన్ని అనుసరించారని.. కాంగ్రెస్ ఓ మెట్టు పైకెక్కి ‘విభజించు – అబద్ధమాడు – పాలించు’ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారని అన్నారు. అబద్దాలు చెప్పడంలో కాంగ్రెస్ నేతలకు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ అన్నీ ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు ప్రధాని మోదీ.
అంతేకాదు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేలా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీలోని కొంతమంది వ్యక్తులు సందర్భానికి తగ్గట్టు ప్రాంతాల మధ్య, వర్గాల మధ్య చిచ్చు పెడుతున్నారని.. పరోక్షంగా రాహుల్ గాంధీపై మండిపడ్డారు. ఇటీవల కేరళ పర్యటనలో రాహుల్ గాంధీ దేశాన్ని ఉత్తర, దక్షిణ ప్రాంతాలుగా విభజిస్తూ మాట్లాడిన వ్యాఖ్యలపై మోదీ ఇలా కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు, పుదుచ్చేరికి ‘హై కమాండ్ పాలన’ అక్కర్లేదని.. బీజేపీకి ప్రజలే ‘హై కమాండ్’ అని అన్నారు.
అంతకుముందు పుదుచ్చేరిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శ్రీకారం చుట్టారు. జవహర్ లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఖేలో ఇండియా స్కీమ్ లో భాగంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో అథ్లెటిక్ ట్రాక్ కు శంకుస్థాపన చేశారు. అలాగే, సాగర్ మాల పథకంలో భాగంగా పుదుచ్చేరి పోర్ట్ డెవలప్ మెంట్, 56 కిలోమీటర్ల మేర ఎన్45ఏ విస్తరణకు ప్రధాని శంకుస్థాపన చేశారు. బాలికా క్రీడాకారుల కోసం వంద పడకల బాలికా వసతి గృహాన్ని ప్రారంభించారు.
ఇదిలావుంటే, కేంద్రంలో మత్స్యశాఖ లేదన్న తన అజ్ఙానపు వ్యాఖ్యలపై ఓవైపు విమర్శలు వెల్లువెత్తుతుంటే,.. తాజాగా మరోసారి అదే తప్పు చేశాడు రాహుల్ గాంధీ. కేరళ పర్యటనలో వున్న ఆయన.. మత్స్యకారులతో కలిసి సముద్రంలోకి వేటకు వెళ్లాడు. మత్స్యకారులు చేపలుపడుతుంటే హఠాత్తుగా సముద్రంలోకి దూకి ఈతకొట్టాడు. ఈ సందర్భంగా మత్స్యకారుల సంక్షేమం గురించి మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే, మత్స్యశాఖను ఏర్పాటు చేస్తామని మరోసారి పప్పులో కాలేశాడు. దీంతో రాహుల్ అజ్ఙానంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తున్నాయి.