భారత ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ సోమ్‌నాథ్ ఆలయంలో కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొన్ని ప్రాజెక్టుల ప్రారంభోత్సవంతో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తాలిబాన్లను ఉద్దేశించేనని స్పష్టంగా అర్థం అవుతోంది. విధ్వంసక శక్తులు, తీవ్రవాద భావజాలంతో రాజ్యాలను పాలించేవారు వారి ఆధిపత్యాన్ని కొంతకాలం మాత్రమే చలాయించగలరని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. అలాంటి వారు మానవజాతిని ఎన్నటికీ అణచివేయలేరని.. అందుకే వారి ఉనికి శాశ్వతం కాదని అన్నారు. సోమ్‌నాథ్ ఆలయం ఎన్నోసార్లు విధ్వంసానికి గురయ్యింది. విగ్రహాలను కూడా చాలా సార్లు అపవిత్రం చేశారు. ఆలయ ఉనికిని నాశనం చేసే ప్రయత్నాలు జరిగాయి. కానీ, ఇలా దాడులు జరిగిన ప్రతిసారీ సోమ్‌నాథ్ ఆలయం మరింత వైభవాన్ని సాధించిందని.. ఇది ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తోందని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. సోమ్‌నాథ్ ఆలయం నవభారతానికి చిహ్నమని, గడిచిన వందల సంవత్సారాల్లో ఈ దేవాలయాన్ని, ఉనికిని అంతం చేయడానికి చేయని ప్రయత్నం లేదని తెలిపారు. పతనం చేయడానికి ప్రయత్నం జరిగిన ప్రతిసారీ తిరిగి లేచి నిలబడిందని.. దీనిని సాధ్యం చేసిన సోమనాథ్ ట్రస్ట్ సభ్యులకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సోమనాథుని భక్తులకు మోదీ కృతజ్ఞతలు తలిపారు.
2013లో ప్రపంచ పర్యాటకంలో 65 స్థానంలో ఉన్న భారత్.. 2019 నాటికి 34వ స్థానానికి చేరుకున్న విషయాన్ని ప్రధాని మోదీ గుర్తుచేశారు. దేశంలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని చెప్పుకొచ్చారు. తద్వారా కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఆధ్యాత్మిక పర్యాటకంతో భవిష్యత్తరాలు మన సంస్కృతీ సంప్రదాయాలకు అనుసంధానమవుతారని అన్నారు. మోదీ అధ్యక్షుడిగా ఉన్న సోమనాథ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ. 3.5 కోట్లతో అహిల్యాబాయి దేవాలయాన్ని నిర్మించారు. పిలిగ్రిమేజ్ రెజువనేషన్ అండ్ స్పిరిచ్యువల్, హెరిటేజ్ అగ్‌మెంటేషన్ డ్రైవ్) పథకం కింద సోమనాథ్ ప్రొమెనేడ్‌ను రూ.47 కోట్లకు పైగా ఖర్చుతో అభివృద్ధి చేశారు. సోమ్‌నాథ్‌లోని ఎగ్జిబిషన్ సెంటర్, పార్వతీదేవి ఆలయం, పాత సోమ్‌నాథ్ దేవాలయ ప్రాంగణ పునఃర్నిర్మాణం ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.