ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఫోన్‌లో మాట్లాడారు. సుమారు 35 నిమిషాల పాటు వీరిద్దరి మధ్య సంభాషణ కొనసాగింది. తూర్పు ఉక్రెయిన్‌లోని సుమీ నగరంలో తీవ్రమైన పోరు మధ్య చిక్కుకుపోయిన వందలాది మంది భారతీయ పౌరులను తరలించడానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మద్దతును ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నాడు కోరారు. గత కొన్ని రోజులుగా సుమీ నుండి దాదాపు 700 మంది భారతీయులు సురక్షితమైన ప్రాంతాలకు తరలించారు. ఉక్రెయిన్ అంతటా ఉన్న దాదాపు 16,000 మంది భారతీయ పౌరులను తరలించే ఏర్పాట్లను చేశారు.
రష్యాతో ఓ వైపు పోరు కొనసాగిస్తూనే నేరుగా చర్చల నిర్ణయం తీసుకోవడంపై జెలెన్‌స్కీని ప్రధాని మోదీ అభినందించారు. ఇక ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించడంలో అందించిన సాయానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. రష్యా కాల్పుల విరమణ ప్రకటించిన నేపథ్యంలో సుమీ నుంచి మిగతా భారతీయుల తరలింపునకు సహకారం అందించాలని ప్రధాని కోరారు. దౌత్య మార్గాల్లో సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రధాని సూచించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఉక్రెయిన్‌లోని పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య ప్రత్యక్ష సంభాషణను కొనసాగించడాన్ని మోదీ అభినందించారు. భారతీయ పౌరుల తరలింపు కోసం ఉక్రెయిన్ ప్రభుత్వం అందించిన సహాయానికి జెలెన్స్కీకి కృతజ్ఞతలు తెలిపారు. యుద్ధం మొదలయ్యాక ఇద్దరు నేతల మధ్య ఇది రెండో ఫోన్ సంభాషణ. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశం మద్దతు కోరేందుకు జెలెన్స్కీ ఫిబ్రవరి 26న మోదీకి ఫోన్ చేశారు. ఆ సమయంలో హింసను తక్షణమే ముగించి, చర్చలకు రావాలని ప్రధాని మోదీ ఆయన్ను కోరారు. ఉక్రెయిన్ నుంచి భారతీయులను రప్పించే ప్రయత్నాల్లో భాగంగా మోదీ సోమవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కూడా మాట్లాడనున్నారు.