More

    కేంద్రమంత్రిగా బండి సంజయ్..?! తెలంగాణ నుంచి అవకాశం ఎవరికి..?

    బడ్జెట్ సమావేశాలకు ముందు కేబినెట్ విస్తరణ జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కొంతమంది బీజేపీ ఎంపీలకు కేబినెట్‎లో చోటు కల్పించడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనికి ఇప్పటికే ఆశావహులు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఢిల్లీ సర్కిల్స్‎లో తమ అవకాశాలను పరీక్షించుకుంటున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మంత్రివర్గంలో స్థానం కల్పించడానికి ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ ఎంపీల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. దక్షిణాదిన తెలంగాణ రాష్ట్రాన్ని బీజేపీ టార్గెట్ చేసుకోవడంతో కచ్చితంగా ఒకరికి అవకాశం కల్పిస్తారనే చర్చ జోరుగా కొనసాగుతోంది.

    తెలంగాణ బీజేపీ ఎంపీల్లో కేబినెట్ మంత్రి పదవి ఎవరిని వరించే అవకాశముంది..? దీనికి సంబంధించిన సామాజిక లెక్కలేంటి..? ఏ నాయకుడికి పదవి ఇస్తే పార్టీకి ఎంత లాభిస్తుంది..? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నుంచి నలుగురు ఎంపీలుగా గెలిచారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, అదిలాబాద్ నుంచి సోయం బాపూరావు, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి గెలుపొందారు. వీరిలో ఇప్పటికే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా పదవిలో ఉన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు మంత్రి పదవి లభించే అవకాశముందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సహేతుక కారణాలూ ఉన్నాయనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తర్వాత అంతటి పేరున్న వ్యక్తి ధర్మపురి అరవిందే అని బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అందుకు తగినట్టే.. అరవింద్ కూడా దూకుడు మీదున్నారు. బీఆర్ఎస్ పార్టీని ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. దీనికి తోడు సొంత నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ కూతురు కవితను ఓడించిన పేరుంది. ఇక సామాజికవర్గం విషయంలో కూడా ధర్మపురి అరవింద్ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవారు. ఉత్తర తెలంగాణలో మున్నూరు కాపు బలమైన సామాజిక వర్గం కావడంతో అరవింద్ కు ఈసారి మంత్రి పదవి వరిస్తుందని భావిస్తున్నారు.

    అటు, అదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు కు కూడా మంత్రి పదవి వచ్చే అవకాశముందని పార్టీ వర్గాల్లో వినికిడి. కేంద్ర ప్రభుత్వం మంత్రి పదవుల్లో గిరిజనులకు, దళితులకు పెద్దపీట వేస్తోంది. రాష్ట్రపతిని కూడా గిరిజన సామాజిక వర్గం నుంచి ఎంపిక చేయడం ఇందుకు సంకేతం. ఇప్పటికే బీజేపీ తెలంగాణలో బీసీలకు పెద్ద పీట వేసింది. తల్లోజు ఆచారికి జాతీయ బీసీ కమిషన్ లో చోటు కల్పించింది. బండి సంజయ్ కు పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టింది. సీనియర్ నేత కిషన్ రెడ్డికి కేబినెట్ లో చోటు కల్పించింది. కానీ, బడుగు, బలహీన వర్గాల నుంచి.. మంత్రివర్గంలో సరైన ప్రాతినిథ్యం ఇవ్వలేకపోయింది బీజేపీ అధిష్టానం. అందుకే, ఈసారి ఎలాగైనా ఆ సామాజిక వర్గానకి అవకాశం ఇవ్వాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే, గిరిజన సామాజిక వర్గం నుంచి గెలిచిన ఏకైక బీజేపీ ఎంపీ సోయం బాపూరావును అదృష్టం వరించవచ్చు.

    మరోవైపు, కేంద్ర మంత్రి పదవి కోసం బండి సంజయ్ పేరు కూడా వినిపిస్తున్నప్పటికీ.. బీజేపీ మాత్రం ఆ ఆలోచన చేయకపోవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే, పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో ఇప్పటికే తనదైన ముద్ర వేసుకున్నారు బండి సంజయ్. పైగా ఆయన సారథ్యంలో బీజేపీ మునుపెన్నడూ లేనివిధంగా ఎమ్మేల్యే సీట్లు గెలుచుకుంది. దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు బండి సంజయ్ ను మార్చే అవకాశం లేదని ఇప్పటికే బీజేపీ అధిష్టానం సంకేతాలిచ్చింది. సంజయ్ అధ్యక్షుడయ్యాక పార్టీ ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఇదే దూకుడుతో కొనసాగితే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశముందని భావిస్తున్న తరుణంలో మంత్రి పదవి ఇవ్వకపోవడమే మేలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సంజయ్ కు మంత్రి పదవి ఇస్తే అధ్యక్ష బాధ్యతల నిర్వహణ తలనొప్పిగా మారుతుందనీ,.. రెంటికీ చెడ్డ రేవడిగా మారే అవకాశముందంటున్నారు. దీంతో పాటు బీజేపీ పార్టీ అధ్యక్షులకు మంత్రి పదవులు ఇచ్చిన దాఖలాలు కూడా తక్కువే.. ఈ కారణాల నేపథ్యంలో బండి సంజయ్ కు మంత్రి పదవులు ఇచ్చే అవకాశం తక్కువగా కనిపిస్తున్నాయి.

    ఇక కొద్ది రోజుల క్రితం టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన ఈటెల రాజేందర్ కు రాజ్యసభ సీటు ఇచ్చి మంత్రి పదవి ఇచ్చే అవకాశాలున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఈటెల రాజేందర్ ఎలా స్పందిస్తారో అనేదానిపై సందిగ్దం నెలకొంది. ఈటెలకు రాష్ట్రస్థాయి రాజకీయాలపైనే ఎక్కువగా ఆసక్తి ఉండటంతో ఢిల్లీ వైపు చూడరనే ప్రచారం కూడా కొనసాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణలో.. తెలంగాణ నుంచి మంత్రి పదవి ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

    Trending Stories

    Related Stories