వేగం పాలనకు ప్రాణాధారం. సత్వర స్పందన, సమయోచిత నిర్ణయం ప్రభుత్వాలకు ఆక్సిజన్. నిర్ణయాత్మక ధోరణి, నిక్కచ్చి వ్యవహారం పాలకులకు షరతుగా ఉండాల్సిన లక్షణం. గత జాడ్యాల తొలగింపు, సంస్కరణల మేళవింపు అభివృద్ధిని వేగిరం చేస్తుంది. పర్యవసానంగా ప్రజలకు పాలన చేరువ అవుతుంది.
ఇపుడు….రహదారులు ఫైటర్ జెట్ల రన్ వేలు. హైవేలు యుద్ధ విమానాలకు స్థావరాలు. అట్టుడుకుతున్న హిమాలయాల్లో వ్యూహాత్మక నిర్మాణాలు….ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా? నిజమా, కాదా? అని సందేహిస్తున్నారా? ఇది నిజం. ఇదే నిజం!
నిగనిగలాడే స్టార్చింగ్ షర్ట్ లు వేసుకుని ప్రెస్ మీట్లలో మాట్లాడే మంత్రుల కాలం పోయిందిప్పుడు. ఆదేశించిన లక్ష్యం నెరవేర్చి తీరాలి. సంధించిన బాణం గురి తప్పకూడదు. కేబినెట్ టాస్క్ ఫోర్స్ దేశాన్ని చుట్టేస్తోంది. మంత్రుల పనితీరుతో రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ముచ్చెమటలు పడుతున్నాయి. అవును. ప్రధాన నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ‘లక్ష్యనిర్ధారిత’ పద్ధతిలో పనిచేస్తోంది.
ఈ అమితాశ్చర్యాల… కథా కమామిషు ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తాను.
కాలంతో పాటు పాలనలో మార్పురావాలి. సాంకేతిక అభివృద్ధితో కలిసి వడివడిగా అడుగులు వేయాలి. మారుమూల పల్లెలకు అభివృద్ధి ఫలాలు అందాలి. ఈ లక్ష్యాలనే నిర్దేశించుకుంది మోదీ ప్రభుత్వం. పారదర్శక పాలన, వేగవంతమైన అభివృద్ధి, సాంకేతికత మేళవించిన వనరుల అభివృద్ధి, నిపుణుల బృందాల ఏర్పాటు లక్ష్యంగా మంత్రులకు దిశానిర్దేశం చేసింది కేంద్రం. 77 మంత్రులను 8 గ్రూపులుగా విభజించింది. ఒక్కో గ్రూపులో 9 నుంచి 10 మంది మంత్రులు ఉంటారు. కేబినెట్ మంత్రి బృందాలకు సారథ్యం వహిస్తారు. యువ నిపుణులు, పదవీ విరమణ చేసిన అనుభవమున్న అధికారులను ఈ యజ్ఞంలో భాగం చేస్తోంది.
8 గ్రూపులుగా విభజించిన మంత్రుల బృందాలకు ప్రధాని మోదీ అధ్యక్షతన brainstorming sessions- ‘చింతన్ శివిర్స్’ సమావేశాలు నిర్వహిస్తోంది. ఒక్కో సమావేశం వ్యవధి నాలుగు గంటలుగా నిర్ధారించింది. ఇప్పటికే ఈ తరహా సమావేశాలు ఐదు జరిగాయి.
ఇందులో ఒక్కో మంత్రి పనితీరును పథకాల అమలు ఆధారంగా బేరీజు వేసింది. ఆయాశాఖలకు ప్రాతినిథ్యం వహిస్తున్న కేబినెట్ మంత్రుల పనితీరును అంచనా వేసేందుకు నాలుగు ప్రమాణాలను నిర్ణయించింది.
- Focused Implementation – అమలుపై దృష్టి సారించడం
- Ministry Functioning and Stakeholder Engagement –మంత్రివర్గ పనితీరు, భాగస్వాముల గుర్తింపు
- Party Coordination and Effective Communication పార్టీ సమన్వయం, సమర్థవంతమైన సమాచార వినిమయం
- Parliamentary practices – లోక్ సభలో మంత్రుల పనితీరు
brainstorming sessionsలో మంత్రుల పనితీరులో మరింత నైపుణ్యాన్ని పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టూ సమాచారం. అంతేకాకుండా అభివృద్ధి ఫలాలు కింది స్థాయి వరకు, ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు అందడమే ప్రధానంగా ఈ సమావేశాలు సాగుతున్నాయి. పాలనను వేగవంతం చేసేందుకు more hands-on approach విధానంపై ప్రధానంగా దృష్టి సారించింది.
ఒక్కో మంత్రికి లక్ష్యాలను నిర్దేశించడం, వాటి అమలుకు సంబంధించి వివరాలను ప్రధానికి, బృందం కో-ఆర్డినేటర్ –కేబినెట్ మంత్రికి తెలిసే విధంగా ‘పోర్టల్’ను రూపొందించారు. ఇందులో ప్రభుత్వ రూపొందించిన ప్రధాన పథకాల అమలు, విధానాలు ప్రచారం ఏ స్థాయిలో జరిగిందో నమోదు చేయాలి. మంత్రుల తీసుకున్న నిర్ణయాలు, షెడ్యూల్, సమావేశాల కోసం ప్రత్యేకంగా డాష్ బోర్డ్ ను ఏర్పాటు చేశారు. అభివృద్ధిలో భాగస్వాములయ్యేవారిని సమావేశపరిచడం, రాష్ట్రాలు, జిల్లాల వారీగా ప్రొఫైల్స్ ను ఏర్పాటు చేయడంపై ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించారు.
ఒక్కో గ్రూప్ ఆయా శాఖల్లో అభివృద్ధిని వేగవంతం చేసేందుకు, సాంకేతిక సాయం తీసుకునేందుకు సాంకేతికత, పరిశోధనలతో ఇతర కీలక రంగాల్లో నిపుణులైన వారిచే బృందాలను ఏర్పాటు చేయడం ముఖ్యమైంది. పదవీ విరమణ పొందిన నిపుణులైన అధికారుల అనుభవాలను రికార్డు చేసేందుకు ప్రత్యేకంగా ఓ పోర్టల్ ను రూపొందించారు. ఈ అనుభవాలను ఆయా శాఖలకు చెందిన మంత్రులు విధిగా అధ్యయనం చేయాలి.
కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరీ, నరేంద్ర సింగ్ తోమర్, పియూష్ గోయాల్, ధర్మేంద్ర ప్రధాన్, స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాగూర్ లు ఈ గ్రూపులకు కో-ఆర్డినేటర్ లుగా వ్యవహరిస్తున్నట్టూ సమాచారం. కో-ఆర్డినేటర్ లుగా వ్యవహరిస్తున్న మంత్రులు తమ అనుభవాలను ‘చింతన్ శివిర్’లలో సహచర మంత్రులతో ప్రెసెంటేషన్ ల రూపంలో పంచుకోవాలి.
ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ‘టిఫిన్ మీటింగ్స్’ ఏర్పాటు చేసిన అనుభవమే ఈ మొత్తం కొత్త ప్రక్రియకు కారణం. అందరు మంత్రులు తమ తమ ఇళ్ల నుంచి అల్పాహారాన్ని సమావేశాలకు తీసుకురావడం, పరస్పరం పంచుకుని తింటూ…కొత్త అంశాలు, ప్రతిపాదనలను చర్చించడం వినూత్న పద్ధతిగా నాడు ప్రచారం ఉండింది.
మొత్తంగా ‘చింతన్ శివిర్’ల లక్ష్యం ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించడంతో పాటు, పాలనను వేగవంతం చేయడం ప్రధానం. దీనివల్ల 2024 ఎన్నికల్లో సునాయాసంగా విజయం సాధించవచ్చని నిపుణులు అంచనావేస్తున్నారు.
‘వ్యూహాత్మక దృష్టితో చార్ ధామ్ రహదారులు’ ఆ కథేంటో చూద్దాం…..
నితిన్ గడ్కరీ పేరు చెపితే రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ముచ్చెమటలు పడుతున్నాయి. రెండు రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కీలక ప్రకటన చేశారు. ‘జూలైలో నితిన్ గడ్కరీ వస్తున్నాడు కాబట్టి జూలై 22 నాటికి రహదారుల నిర్మాణం’ పూర్తి కావాలని అధికారులను అదేశించారు. కాంట్రాక్టర్లు ఒకవేళ తాత్సారం చేస్తే బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని హుకూం జారీ చేశారు.
నితిన్ గడ్కరీ ఇటీవలే ‘చార్ ధామ్ రహదారుల నిర్మాణ’ ఉద్దేశాలను వెల్లడించారు. వ్యూహాత్మక లక్ష్యాలను తెలియజేశారు. టిబెట్ రీజియన్ చైనా భారీ స్థాయిలో రహదారులు, ఇతర సౌకర్యాలను వేగంగా పూర్తి చేస్తోంది. భారత సైన్యానికి టిబెట్ రీజియన్ లో రహదారుల నిర్మాణం అత్యవసరమని కేంద్రం భావిస్తోంది. 1962 యుద్ధ స్థితిని నివారించాలంటే రహదారులు నిర్మించాలని కేంద్రం భావిస్తోంది. ఓ స్వచ్ఛంద సంస్థ మాత్రం రహదారుల నిర్మాణాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని వివరణ కోరింది. అందుకు ప్రభుత్వం స్పందిస్తూ ‘వ్యూహాత్మక అవసరాల ప్రాధాన్యాన్ని’ కోర్టుకు తెలియజేసింది.
చార్ ధామ్ లో కేంద్రం ఇప్పటికే 670 కి.మీ రహదారి నిర్మాణాన్ని పూర్తి చేసింది. సైన్యానికి సంబంధించిన భారీ వహనాలు ప్రయాణించే విధంగా ఈ రహదారులను నిర్మించింది కేంద్రం. భారత్-చైనా సరిహద్దుల్లో సుమారు 44 వ్యూహాత్మక రహదారులను నిర్మిస్తోంది. 4వేల కిలోమీటర్ల సరిహద్దుల్లో-అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్ సహా ఈ రహదారుల నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. వీటి కోసం 21వేల కోట్లు వెచ్చిస్తోంది.
మనదేశం ఇప్పటికే నిర్మించిన రహదారుల వల్ల కలిగిన ప్రయోజనాలేంటో చూద్దాం….
భారత్-చైనా సరిహద్దుల్లోని భారత్ వైమానిక స్థావరానికి వెళ్లేందుకు భారత్ ఒక కొత్త రహదారిని వేసింది. లద్దాఖ్‌లో సముద్ర మట్టానికి 5,000 మీటర్ల ఎత్తులో ప్రపంచంలోనే ఎత్తైన ఈ ఎయిర్‌స్ట్రిప్ వరకు వెళ్లగలిగేలా 255 కిలోమీటర్ల పొడవున దార్బుక్-ష్యోక్-దౌలత్ బేగ్ ఓల్డీ రోడ్డు వేశారు. దాదాపు 20 సంవత్సరాలుగా కొనసాగిన ఈ రహదారి నిర్మాణం గత ఏడాది పూర్తయ్యింది. ఒకవేళ సరిహద్దుల్లో ఘర్షణలు ఏర్పడితే సైన్యాన్ని వేగంగా తరలించడానికి, వస్తువుల రవాణాకు ఈ మార్గం ఎంతో ఉపయోగపడుతుంది.
డీయెస్‌డీబీఓతో సహా ఈ మధ్య కాలంలో భారత్ చేపట్టిన నిర్మాణాలే చైనాకు ఆగ్రహం కలిగించాయని విశ్లేషకులు భావిస్తునారు. అయితే చాలా ఏళ్లుగా చైనా కూడా సరిహద్దుల వెంబడి ఇలాంటి నిర్మాణాలను అనేకం చేపట్టింది.
ఈ రోడ్డు నిర్మాణానికి ముందు దౌలత్ బేగ్ ఓల్డీ ఎయిర్‌స్ట్రిప్‌కు పరికరాలను, సామాగ్రిని హెలికాఫ్టర్ల ద్వారా మాత్రమే తరలించేవారు. ఇప్పుడు అదనపు రహదారులు, బ్రిడ్జ్ లు నిర్మించాక భారత గస్తీ సిబ్బంది తేలిగ్గా ముందుకు సాగడానికి మార్గం సులువయ్యింది. అలాగే పరికరాలను, సామగ్రిని స్థావరాల నుంచీ సులువుగా పైకి చేర్చగలుగుతున్నారు. దీంతో సరిహద్దుల్లో ఉన్న వ్యూహాత్మక పరిస్థితుల్లో మార్పు వచ్చింది.
ఇటీవల ఘర్షణల తరువాత కూడా అక్కడ రోడ్డు రవాణా సదుపాయాలను మెరుగుపరుస్తూనే ఉంటామని భారత్ సంకేతాలను ఇచ్చింది. చైనా సరిహద్దు వెంబడి లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం జార్ఖండ్ నుంచీ 12,000 మంది కార్మికులను తరలించారు.
సరిహద్దుల్లో చైనాకు దీటుగా తమ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి మనదేశం తీవ్రంగా కృషిచేస్తోంది. ఈ ప్రాంతంలో విస్తారమైన రోడ్డు, రైల్వే నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 73 వ్యూహాత్మక రహదారులను, 125 బ్రిడ్జ్ లను నిర్మించడానికి నిధులు మంజూరయ్యాయి.
మరో 9 వ్యూహాత్మక రైలు మార్గాల నిర్మాణం పూర్తయ్యే దశలో ఉన్నాయి. చైనా సరిహద్దు వెంబడి మిస్సమారి-టేంగా-తవాంగ్, బిలాస్‌పూర్-మండి-మనాలి-లేహ్ లైన్లతో సహా 9 రైల్వేలైన్లు పూర్తయ్యే దశలో ఉన్నాయి. వీటి ద్వారా భారత్ సైన్యం భారీ యుద్ధ సామగ్రిని తరలించడానికి వీలు కలుగుతుంది.
విమాన సదుపాయాల విషయానికొస్తే, ఎల్ఏసీ వెంబడి 25 ఎయిర్‌ఫీల్డ్స్ ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్స్ నెట్‌వర్క్ ను విస్తరించడంపై భారత్ దృష్టి సారించింది. ఇప్పటికే ఉన్న ఏఎల్‌జీల ఆధునీకరణతో పాటూ 7 కొత్త ఏఎల్‌జీలను నిర్మిస్తామని 2018లో భారత్ ప్రకటించి…అందుకు సంబంధించిన ప్రణాళికను 2021వరకూ చాలా మేర పూర్తి చేసింది. చైనా సరిహద్దుల్లోని అసోం రాష్ట్రంలో ఉన్న కీలక భారత వైమానిక దళ స్థావరం ఛబువాలో సుఖోయ్-30 అధునాతన యుద్ధ విమానాలను, చేతక్ హెలికాప్టర్లను మోహరించారు. ఈ స్థావరాన్ని ఇటీవల అభివృద్ధిచేశారు. మొత్తంగా పాలనలో వేగం పెరిగింది. ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇది మరింత తీవ్రమవుతుంది. భారత దేశ చరిత్రలో తొలిసారి ఇలాంటి ప్రయత్నం జరుగుతోంది. దీన్ని మనందరం స్వాగతిద్దాం.