ఫలితాలపై మోదీ, యోగి స్పందన ఇదే..!

0
732

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిల‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు పూర్తయింది. మొత్తం 403 సీట్లు క‌లిగిన యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల కౌంటింగ్ గురువారం ఉద‌యం నుంచి రాత్రి దాకా కొన‌సాగింది. రాత్రి 9.30 గంట‌ల స‌మ‌యానికి యూపీ ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ క్రమంలో బీజేపీ ఏకంగా 273 సీట్ల‌ను గెలుచుకుంది. స‌మాజ్ వాదీ పార్టీ మాత్రం 125 సీట్ల వ‌ద్దే ఆగిపోయింది. గ‌తంలో యూపీలో అధికారాన్ని చెలాయించిన బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ సింగిల్ సీటుకే ప‌రిమిత‌మైపోయింది. కాంగ్రెస్ కూడా కేవలం రెండు సీట్ల‌కే ప‌రిమిత‌మైంది. ఇత‌రులు రెండు సీట్ల‌లో విజ‌యం సాధించారు.

దేశంలోనే కీల‌క రాష్ట్రంగా ప‌రిగ‌ణిస్తున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో స‌రికొత్త రికార్డులు న‌మోదు చేస్తూ వ‌రుస‌గా రెండో సారి బీజేపీ విజ‌యం సాధించ‌గా సీఎంగా యోగి ఆదిత్యనాథ్ వ‌రుస‌గా రెండోసారి పద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. యూపీ ఎన్నిక‌ల్లో బీజేపీ విజయం ఖాయ‌మైన నేప‌థ్యంలో యోగి ఆదిత్య‌నాథ్ పార్టీ కార్య‌క‌ర్త‌లు, యూపీ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడారు. మోదీ నాయ‌క‌త్వంలో బీజేపీ అద్భుత విజ‌యం సాధించిందని.. మిత్ర‌ప‌క్షాల‌తో క‌లిసి పూర్తి మెజారిటీ సాధించామన్నారు. ఈవీఎంలు ట్యాంప‌ర్ చేశారంటూ కొంద‌రు దుష్ప్ర‌చారం చేశారని.. ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పుతో వాళ్ల నోళ్లు మూతప‌డ‌తాయన్నారు. బీజేపీకి విజ‌యం అందించిన ప్ర‌జ‌ల‌కు ధ‌న్య‌వాదాలు. మోదీ మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో యూపీ మ‌రింత మేర అభివృద్ధి సాధిస్తుందని చెప్పుకొచ్చారు. ప్రజలు డబుల్ ఇంజిన్ పాలనను కోరుకుంటున్నారన్న దానికి ఈ ఫలితాలే నిదర్శనమని అన్నారు. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పాలన చూసి ప్రజలు ఓట్లేశారని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీకి చెందిన ప్రభుత్వాలు ఉన్నప్పుడే అధికారం సాధ్యమని, మోదీ నాయకత్వంలో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో జయభేరి మోగించిందని యోగి అన్నారు. యూపీలో తొలిసారిగా ఎన్నికలు ఎంతో ప్రశాంతంగా ముగిశాయని తెలిపారు. బీజేపీ పాలనలో సురక్షితంగా ఉంటామని ప్రజలు విశ్వసిస్తున్నారని, మోదీ మార్గదర్శనంలో మరిన్ని ప్రజాసంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళతామని యోగి చెప్పారు.

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జ‌గ‌త్ ప్ర‌కాశ్ న‌డ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాల‌తో ఢిల్లీలోని బీజేపీ కార్యాల‌యానికి వ‌చ్చిన ప్ర‌ధాని మోదీ.. పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఈ ఎన్నిక‌ల్లో వ‌చ్చిన ఫ‌లితం ప్ర‌జాస్వామ్య విజ‌య‌మ‌ని మోదీ తెలిపారు. మ‌హిళ‌లు, యువ‌త బీజేపీకి అండ‌గా నిలిచారని.. తొలిసారి ఓటేసిన యువ‌కులు బీజేపీకి ప‌ట్టం క‌ట్టారన్నారు. గోవా ప్ర‌జ‌లు మూడోసారి బీజేపీకి అధికారాన్ని క‌ట్ట‌బెట్టారు. ఉత్త‌రాఖండ్‌లో మొదటిసారి బీజేపీ వ‌రుస‌గా రెండోసారి అధికారంలోకి వ‌చ్చిందని తెలిపారు. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు బీజేపీ పాల‌నా తీరును మెచ్చి ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పని అన్నారు. పేద‌రికం నిర్మూల‌నలో బీజేపీ చిత్త‌శుద్దితో ప‌నిచేసిందని అన్నారు.