More

    పర్యాటకుల తీరుపై ఆందోళన వ్యక్తం చేసిన మోదీ

    దేశంలో లాక్ డౌన్ సడలింపులు తీసుకుని రాగానే పెద్ద ఎత్తున పర్యాటకులు ప్రముఖ ప్రాంతాలకు ఎగబడ్డారు. హిమాచల్ ప్రదేశ్ లోని మనాలీలో పర్యాటకుల తీరును అత్యంత కలవరానికి గురిచేసింది. ఎన్నో పర్యాటక ప్రాంతాల్లో ప్రజలు గుంపులుగా గుంపులుగా చేరిపోయారు. మాస్కులు ధరించలేదు, సామాజిక దూరం పాటించలేదు..! ఇలా ఎన్నో అంశాలపై నిపుణులు కలవరం వ్యక్తం చేశారు.

    టూరిస్టుల తీరుపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ముఖానికి మాస్కులు లేకుండా తిరగడం సరికాదని మార్కెట్ ప్రదేశాల్లో గుంపులుగా చేరవద్దని సూచించారు. ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అక్కడి కరోనా పరిస్థితులపై మంగళవారం(జులై 13) నిర్వహించిన సమీక్షా సమావేశంలో మోదీ మాట్లాడారు. హిల్ స్టేషన్స్ కు, మార్కెట్లకు వచ్చే పర్యాటకులు సామాజిక దూరం పాటించడం లేదని, మాస్కులు ధరించడం లేదని మోడీ అన్నారు. జనసమూహం ఉండే ప్రాంతాల్లో కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆయన ఆయా రాష్ట్రాల సిఎంలకు సూచించారు. థర్డ్ వేవ్ రాకముందే ఒకసారి టూరిస్టు ప్రదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేసి వద్దాం అనే ఆలోచనలు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదని.. పరిస్థితిని అర్థం చేసుకుని థర్డ్ వేవ్‌ రాకుండా నివారించగలగాలని అన్నారు. పర్వత ప్రాంతాల్లో పర్యాటకులను చూస్తుంటే నాకు ఆందోళన కలుగుతోందని మోదీ చెప్పుకొచ్చారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మనం నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని మోదీ స్పష్టం చేశారు.

    కరోనా నిబంధనలను విధిగా పాటించాలని మోదీ దేశ ప్రజలను కోరారు. కరోనా సెకండ్ వేవ్ కంటే థర్డ్ వేవ్ ఉధృతంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. థర్డ్ వేవ్ ను నిలువరించేందుకు టీకా ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ప్రజల సహకారంతోనే కరోనా కట్టడి సాధ్యమని, కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచాలని, కరోనా నియంత్రణకు పక్కా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. కరోనా అనేక రూపాంతరాలు చెందుతూ ప్రమాదకారిగా మారుతుందని, ప్రజలు కరోనా నిబంధనలను విధిగా పాటించాలని ఆయన స్పష్టం చేశారు. మోదీ అధ్యక్షతన వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశంలో అసోం,మణిపూర్,మేఘాలయ,అరుణాచల్ ప్రదేశ్,మిజోరాం,నాగాలాండ్,సిక్కీం,త్రిపుర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.

    Trending Stories

    Related Stories