కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మద్దతుగా వాయిస్ వినిపిస్తున్నారు బాలీవుడ్ నటి కంగనా రనౌత్. ఆమెను పంజాబ్ లోని కర్తార్ పూర్ సాహిబ్ వద్ద రైతులు అడ్డుకున్నారు. రైతు ఉద్యమంపై ఆమె చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఆ నిరసనకారుల్లో ఉన్న కొందరు మహిళలతో కంగన మాట్లాడిన తర్వాత పరిస్థితి సద్దుమణిగింది. కంగన కారు వెళ్లేందుకు రైతులు దారివిడిచారు. ఈ విషయాన్ని కంగన సోషల్ మీడియాలో స్వయంగా వెల్లడించింది. తనను ఓ గుంపు చుట్టుముట్టిందని తెలిపింది. వారు తనను దూషించారని, చంపుతామని బెదిరించారని తెలిపింది. ఆ సమయంలో తనతో పాటు భద్రతా సిబ్బంది లేకపోతే ఏంజరిగేది? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. నేనేమైనా రాజకీయనేతనా.. ఇలాంటి ఘటన జరగడం విస్మయం కలిగిస్తోందని కంగనా తెలిపింది. నమ్మలేకపోతున్నాను. ఇదేం ప్రవర్తన?” అంటూ మండిపడింది.
ఇంస్టాగ్రామ్ లో ఈ ఘటనకు సంబంధించిన విషయాలను కంగనా రనౌత్ పంచుకుంది. తన స్వస్థలమైన హిమాచల్ ప్రదేశ్ నుండి పంజాబ్ చేరుకోగానే తన కాన్వాయ్‌పై రైతు నిరసనకారుల గుంపు మెరుపుదాడి చేసిందని ఆమె తెలియజేసింది. “నన్ను ఒక గుంపు చుట్టుముట్టింది. తమను తాము రైతులుగా పిలుచుకుంటున్నారు. వారు నాపై దాడి చేస్తున్నారు, దుర్భాషలాడుతున్నారు మరియు చంపేస్తామని బెదిరిస్తున్నారు”అని కంగనా చెప్పుకొచ్చింది. భద్రత లేకపోయి ఉంటే ఈ గుంపు తనకు ఎలాంటి హాని కలిగించేదోనని ఆమె భయం, ఆందోళన వ్యక్తం చేసింది.
పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన కంగనా మాట్లాడుతూ.. ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడం వలన నేను హిమాచల్ నుండి బయలుదేరి పంజాబ్ చేరుకున్నాను. నా కారును చుట్టుముట్టిన ఒక గుంపు తమను తాము రైతులమని చెప్పుకుంటూ నన్ను తిడుతూ ఉన్నారు. చంపుతామని బెదిరిస్తున్నారు. “ఇక్కడ పరిస్థితి నమ్మశక్యంగా లేదు. ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున పోలీసులు ఉన్నప్పటికీ నా వాహనం ఆగిపోయింది. నేను రాజకీయ నాయకురాలినా? నేను పార్టీని నడుపుతున్నానా? ఈ ప్రవర్తన ఏమిటి? నా పేరుతో చాలా మంది రాజకీయాలు చేస్తున్నారు. ఆ రాజకీయ ఎత్తుగడకు ప్రత్యక్ష పర్యవసానమే ఈ దాడి. మీరు గమనిస్తే, నన్ను అన్ని వైపుల నుండి గుంపు చుట్టుముట్టింది. పోలీసులు లేకుంటే, నన్ను కొట్టి చంపి ఉండేవారు ”అని కంగనా పునరుద్ఘాటించింది.
తన కారును బలవంతంగా ఆపివేసిన గుంపులోని కొంతమందితో సంభాషించడం కనిపించింది. ఆ తర్వాత ఆమె తప్పించుకుని అక్కడి నుండి వెళ్లిపోయింది. ఆమె పంజాబ్ పోలీసులు మరియు CRPF వారి మద్దతుకు ధన్యవాదాలు తెలిపింది. “నేను పూర్తిగా సురక్షితంగా ఉన్నాను. ఆ పరిస్థితి నుంచి బయటపడేందుకు నాకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు” అని కంగనా చెప్పుకొచ్చింది.
ఇక తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో.. “నన్ను ఎవరూ క్షమాపణ అడగలేదు మరియు నేను ఎప్పుడూ క్షమాపణలు చెప్పలేదు. నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి, దేనికి? పంజాబ్ ప్రజల పట్ల నిజమైన ప్రేమ మరియు శ్రద్ధ కోసమా? లేదు, నేను ఎప్పటికీ అలా చేయను… గుంపులో ఉన్న మహిళలతో సంభాషణ అన్ని మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ఉంది. దయచేసి పుకార్లు వ్యాప్తి చేయవద్దు. నేను ఎల్లప్పుడూ రైతులకు మద్దతునిస్తాను మరియు రైతుల బిల్లుకు అనుకూలంగా మాట్లాడాను మరియు నేను దానిని కొనసాగిస్తాను.” అని స్పష్టం చేసింది.
