More

    ట్రైబల్స్ ను మతం మారుస్తున్న పాస్టర్ పై మూకుమ్మడి దాడి

    ఛత్తీస్‌గఢ్‌లోని కబీర్‌ధామ్ జిల్లాలోని మారుమూల గ్రామంలో ఓ పాస్టర్ పై ఆదివారం నాడు దాడి జరిగింది. మత మార్పిడి చేస్తున్నాడనే అభియోగాలపై అతడిపై దాడి చేశారు. పాస్టర్ మరియు అతని కుటుంబంపై 100 మందికి పైగా దాడి చేశారు. గిరిజన ప్రాంతాలలో క్రైస్తవ మిషనరీల ఆధ్వర్యంలో సామూహిక మత మార్పిడులకు వ్యతిరేకంగా దాడులు జరిగాయని పోలీసు అధికారులు తెలిపారు. మత మార్పిడులకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. ఆగష్టు 29 ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ప్రార్థన జరుగుతుండగా పాస్టర్ కావల్సింగ్ పరాస్తే ఇంట్లోకి దుండగులు చొరబడి.. దాడి చేశారు. పరాస్తే ఇంటిని కూడా ధ్వంసం చేశారని చెబుతున్నారు.

    కబీర్‌ధామ్ పోలీసు సూపరింటెండెంట్ మోహిత్ గార్గ్ మాట్లాడుతూ.. ‘ప్రాథమిక సమాచారం ప్రకారం 100 మందికి పైగా స్థానికులు అతని ఇంట్లోకి చొరబడ్డారని.. ఆరాధనకు సంబంధించిన వస్తువులను ధ్వంసం చేసి, పత్రికలను కూడా చింపివేశారు’ అని చెప్పారు. మత మార్పిడులను ఆపాలని నినాదాలు చేశారని ఆయన అన్నారు. దాడి గురించి అప్రమత్తమైన వెంటనే పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుందని గార్గ్ సమాచారం అందించారు. ఈ విషయంలో కేసు నమోదైంది తదనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోబడతాయని గార్గ్ చెప్పారు.

    చాలా ప్రమాదకరమైన ధోరణి: క్రిస్టియన్ ఫోరం

    ఈ సంఘటనపై చత్తీస్‌గఢ్ క్రిస్టియన్ ఫోరమ్ అధ్యక్షుడు అరుణ్ పన్నాలాల్ మాట్లాడుతూ, “ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి, ఇది రాష్ట్రంలో ప్రబలంగా మారింది.” అని అన్నారు. ఈ దాడుల విషయంలో పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం కేవలం ప్రేక్షకులు మాత్రమేనని, దాడులను అరికట్టడానికి ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోలేదని పన్నాలాల్ ఆరోపించారు. “గత 15 రోజులలో, రాష్ట్రవ్యాప్తంగా మా మతపరమైన ప్రదేశాలలో కనీసం 10 దాడులు జరిగాయి, కానీ ఏ ఒక్క కేసులోనూ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మాకు న్యాయం కావాలి, అయితే, ఇలాంటి సంఘటనలు పునరావృతం కావడం వల్ల విధ్వంసానికి పాల్పడే వారికి ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తోందని తమకు అనిపిస్తోంది”అని పన్నాలాల్ ఆరోపించారు. చర్చిల విధ్వంసానికి సంబంధించిన అన్ని ఆధారాలను సమర్పిస్తూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేస్తామని పన్నాలాల్ చెప్పుకొచ్చారు.

    Related Stories