ముంబైలోని కొలాబాలోని హోటల్ తాజ్ మహల్ ప్యాలెస్ వెలుపల పార్క్ చేసిన లగ్జరీ బస్సులలో ఒకదానిని ధ్వంసం చేశారు మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS)కి చెందిన సభ్యులు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు ఎంఎన్ఎస్ కార్యకర్తలను ముంబైలోని కొలాబా పోలీస్ స్టేషన్ అధికారులు అరెస్టు చేశారు. ఈ బస్సు త్వరలో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2022 మ్యాచ్‌ల కోసం ఆటగాళ్లను తీసుకెళ్లడానికి ఉద్దేశించబడింది. ధ్వంసమైన వాహనాన్ని IPL ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బస్సుగా ఉపయోగించాల్సి ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆపి ఉంచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ టీమ్ బస్సుపై దాడి చేసినందుకు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 143,147,149,427 కింద 5-6 మంది గుర్తు తెలియని వ్యక్తులపై ముంబైలోని కొలాబా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయబడింది. ఆ తర్వాత ముంబై పోలీసులు MNSకు చెందిన ప్రశాంత్ గాంధీని అదుపులోకి తీసుకున్నారు. సంతోష్ జాదవ్, మరో వ్యక్తిని కూడా విచారిస్తూ ఉన్నారు.
ఈ సంఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం, బస్సు గ్లాస్‌పై DC యొక్క నినాదం ‘వి రోర్ టుగెదర్’ అని రాసి ఉండడంతో ధ్వంసమైన బస్సు ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందినదిగా కనిపిస్తుంది. IPL మ్యాచ్‌ల కోసం స్థానిక బస్సు ట్రాన్స్పోర్ట్ లను విస్మరించారనే ఆరోపణలపై MNS రవాణా విభాగమైన ‘మహారాష్ట్ర వహతుక్ సేన’ ఈ దాడికి పాల్పడింది. ఐపిఎల్ ఆటగాళ్లను పికప్, డ్రాప్ చేసే కాంట్రాక్ట్ స్థానిక వ్యాపారికి ఇవ్వకపోవడంతో MNS కార్యకర్తలు రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, MNS-వాహతుక్ సేన (రవాణా విభాగం)కి చెందిన నలుగురు వ్యక్తులు.. కోపంతో ఊగిపోయారు. అర్ధరాత్రి దాటిన తర్వాత బస్సు దగ్గర గుమిగూడడం, బస్సు ముందు భాగంలో వారి డిమాండ్ల పోస్టర్లను అతికించడం చూడవచ్చు. అనంతరం నినాదాలు చేస్తూ ఆగి ఉన్న బస్సు అద్దాలు ధ్వంసం చేశారు.
ఈ చర్యను సమర్థిస్తూ, MNS-VS ప్రెసిడెంట్ సంజయ్ నాయక్ పలు వ్యాఖ్యలు చేశారు. ‘IPL టోర్నమెంట్ కోసం రాష్ట్రం బయట నుండి బస్సులను అద్దెకు తీసుకున్నారని.. అందుకే తాము నిరసన వ్యక్తం చేస్తున్నామని’ అన్నారు. నిర్వాహకులకు అవసరమైన వాహనాలను అందించగలగినప్పటికీ స్థానికులకు ఉపాధి అవకాశాలను ఇవ్వలేదని పేర్కొన్నారు. “ఓ వైపు మేము నిరసనలు తెలియజేస్తూ ఉన్నా, ఢిల్లీ, ఇతర ప్రాంతాల నుండి ఇక్కడకు అనేక బస్సులను తీసుకుని వచ్చారు. ఇతర చిన్న వాహనాలను అనుమతించారు. స్థానిక మరాఠీ ప్రజల జీవనోపాధిని ప్రభావితం చేస్తోంది” అని నాయక్ IANS కి చెప్పారు.
రిషబ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సభ్యులు మార్చి 26న ప్రారంభమయ్యే రాబోయే IPL 2022 కోసం సన్నాహాలు ప్రారంభించడానికి ముంబై చేరుకున్నారు. DC మార్చి 27న బ్రబౌర్న్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో టోర్నమెంట్‌ను ప్రారంభించనుంది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఢిల్లీ క్యాపిటల్స్ హోటల్ చుట్టూ భద్రతను పెంచారు.