నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజాకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రోజా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. తిరుపతిలో దిగాల్సిన విమానాన్ని బెంగుళూరులో సురక్షితంగా ల్యాండ్ చేశారు. రోజా ఎక్కిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం ఈరోజు ఉదయం10:55 గంటలకు తిరుపతికి చేరుకోవాల్సి ఉంది. కానీ ఫ్లైట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని బెంగళూరు వైపు తీసుకెళ్లారు. ఆ సమయంలో విమానంలోని 70 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. బెంగుళూరులో ఫ్లైట్ సురక్షితంగా ల్యాండ్ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే రోజా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘ఇంకా విమానంలోనే ఉన్నాం. విమానం డోర్స్ ఇంకా ఓపెన్ కాలేదు. పైలట్‌కు ఇంకా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు’ అని రోజా ఓ వీడియోను విడుదల చేశారు.
ఈ విమానంలో టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కూడా ఉన్నారు. రాజమండ్రి నుంచి వీరు ఇండిగో విమానంలో తిరుపతికి బయల్దేరారు. అయితే విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో విమానాన్ని బెంగళూరుకు తరలించారు. గంటపాటు విమానాన్ని గాల్లోనే తిప్పారు. ఆ తర్వాత ల్యాండ్ చేసినప్పటికీ ఎవర్నీ విమానం నుంచి కిందకు దింపలేదు.
ఈ ఘటనపై రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ జీవితాలతో ఇండిగో చెలగాటం ఆడిందని.. నాలుగు గంటల పాటు తమను విమానంలోనే కూర్చోబెట్టారని తెలిపింది. బెంగళూరులో విమానం నుంచి దిగాలనుకున్న వారు రూ. 5 వేలు ఇవ్వాలని సిబ్బంది అడిగారని ఆరోపించారు రోజా. తాను ఇండిగోపై కోర్టులో కేసు వేస్తానని చెప్పారు. ప్రయాణికుల ప్రాణాలతో ఇండిగో అధికారులు , సిబ్బంది ఆటలాడుకుంటున్నారని మండిపడ్డారు. సాంకేతిక లోపమే అయినా ప్రయాణికులకు సమాచారం ఇవ్వాలని.. ల్యాండ్ అయిన తరువాత కూడా ఎందుకు అంత సేపు ఫ్లైట్ లో ఉంచాల్సి వచ్చిందనే కారణం కూడా చెప్పలేదని రోజా తెలిపారు.
టీడీపీ నేత యనమల సైతం సిబ్బంది, అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. క్షేమంగా చేరుకున్నందుకు ఆనందంగానే ఉన్నా.. ప్రయాణికుల ప్రాణాలతో ఇలా ఆటాలు ఆడుకోవడం దారుణమన్నారు.