ఏపీలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిల్లాల్లో భాగంగా సత్యసాయి జిల్లా కేంద్రంగా హిందూపురం ఉండాలని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తన డిమాండ్ ను వినిపించారు. హిందూపురం టౌన్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మౌన దీక్షకు సిద్ధమయ్యారు. అంతకు ముందు మీడియాతో మాట్లాడుతూ తమ డిమాండ్‌ను నెరవేర్చుకునే పోరాటంలో భాగంగా అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. రాత్రికి రాత్రే కొత్త జిల్లాల ప్రకటన చేశారని.. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే ఎన్నో లాభాలు ఉన్నాయని చెప్పారు. ఆధ్యాత్మిక అంశాల ఆధారంగానే సత్యసాయి జిల్లా, దాని కేంద్రం ఏర్పాటుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన ఆరోపించారు. ఆధ్యాత్మికత ఆధారంగా జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తే ధర్నాలు చేయబోరని ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. తనకంటే అధికంగా ఆధ్యాత్మిక చింతన ఎవరికైనా ఉందా? అని ఆయన ప్రశ్నించారు. తాను అఖండ అని, అన్ స్టాపబుల్ గా పోరాడతానని అన్నారు. ఈ ప్రాంతం కోసం ఏం చేయడానికైనా సిద్ధమని ప్రకటించారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేస్తేనే ఆధ్యాత్మికంగానూ అన్ని విధాలుగా సరిపోతుందని చెప్పారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని ఆయన తెలిపారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు. తమ డిమాండ్ నెరవేర్చకపోతే ధర్నా చేస్తామని, ఎవడొచ్చి ఆపుతాడో చూస్తానని అన్నారు. ఉద్యోగుల ఆందోళన నుంచి దృష్టిని మళ్లించేందుకే కొత్త జిల్లాల ప్రకటన చేశారని బాలకృష్ణ ఆరోపించారు.
హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మౌన దీక్ష చేపట్టారు. తన నివాసం నుంచి పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్దకు చేరుకున్న బాలకృష్ణ అక్కడి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తు టీడీపీ శ్రేణులు, యువత పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే బాలకృష్ణ మౌనదీక్ష చేపట్టారు. సాయంత్రం అఖిలపక్ష నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో బాలయ్య పాల్గొననున్నారు. ఈ సమావేశంలో హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలనే డిమాండ్‌తో చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై చర్చించనున్నారు. చాలా ఏళ్లుగా హిందూపురంను జిల్లాగా చేస్తారనే ప్రచారం కొనసాగింది. ఇప్పుడు ఊహించని విధంగా ప్రభుత్వం నుండి ప్రకటన వచ్చింది.