పేషెంట్ దుస్తుల్లో ఉన్న ఓ వ్యక్తి ఆసుపత్రి ఫ్లోర్ ను శుభ్రం చేస్తూ ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఇంతకూ ఆ ఫోటోకు అంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణమేమిటా అని అనుకుంటూ ఉన్నారా..? ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి మిజోరాం మినిస్టర్. విఐపి కల్చర్ ను పక్కన పెట్టేసిన మిజోరాం రాష్ట్ర పవర్, ఎలక్ట్రిసిటీ మినిస్టర్ ఆర్.లాల్జిర్లియానా ఇలా ఆసుపత్రి ఫ్లోర్ ను తుడుస్తూ కనిపించారు. లాల్జిర్లియానా పేషెంట్స్ డ్రెస్ ను వేసుకుని మాప్ ను తీసుకుని ఫ్లోర్ ను తుడుస్తూ ఉన్నారు. గత వారం లాల్జిర్లియానాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అవ్వడంతో ఆయన జోరామ్ మెడికల్ కాలేజీ(జెడ్.ఎం.సి.) లో చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే ప్రతిదీ పని వాళ్ళు చేయాలని అనుకున్నారో ఏమో తన వంతుగా ఆ ఫ్లోర్ ను తుడిచారు.

లాల్జిర్లియానా కుటుంబానికి కరోనా సోకింది. ఆయన భార్య, కుమారుడు కూడా కరోనా బారిన పడ్డారు. కొద్దిరోజులుగా ఐసోలేషన్ లోనే ఉంటున్నారు. మే 12న లాల్జిర్లియానా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. అక్కడే వైద్యులు ఆయనకు చికిత్సను అందిస్తూ వచ్చారు. శుక్రవారం ఆయన ఆరోగ్యం కాస్త కుదుటపడడంతో లేచి మాప్ ను తీసుకుని ఆసుపత్రి ఫ్లోర్ ను కాస్తా తుడిచారు. 71 సంవత్సరాల మిజో నేషనల్ ఫ్రంట్ కు చెందిన లాల్జిర్లియానా చేసిన పనిని అక్కడే ఉన్న వాళ్ళు ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఫ్లోర్ ను తుడవాల్సిన స్వీపర్లు సమయానికి రాకపోవడంతో ఆయనే ఈ పనికి పూనుకున్నారని ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. చాలా మంది నాయకులు సేవలు చేయించుకునే వారే తప్ప.. సేవలు చేసే వారు తక్కువ అని చెబుతూ ఉంటారు. అలాంటి అరుదైన కోవకు చెందిన వారే లాల్జిర్లియానా కూడా అని పలువురు ప్రశంసలు గుప్పిస్తూ ఉన్నారు. స్పెషల్-విఐపి ట్రీట్మెంట్ కావాలని గగ్గోలు పెట్టే గల్లీ లీడర్లు ఉన్న ఈ కాలంలో లాల్జిర్లియానా వంటి వాళ్ళు ఎంతో మంది కళ్ళు తెరిపిస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఉన్నారు. లాల్జిర్లియానా ఇలా చేయడం ఇదే మొదటి సారి కాదట.. ఇంతకు ముందు ఢిల్లీ లోని మిజోరాం హౌస్ ను సందర్శించినప్పుడు కూడా ఇలానే శుభ్రం చేశారట..!