Sports

గోల్డ్ గెలవడానికి ఎంతగానో ప్రయత్నించా.. ఆమె సక్సెస్ స్టోరీ

ఒలింపిక్స్ లో నేడు వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి చాను రజత పతకాన్ని గెలిచింది. 49 కిలోల విభాగంలో ఆమె ఈ ఘనత సాధించింది. స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్ లలో కలిపి ఆమె 202 కిలోల బరువునెత్తింది. స్నాచ్ లో 87 కిలోలు (84, 87, 89), క్లీన్ అండ్ జెర్క్ లో 115 (110, 115, 117) కిలోలు ఎత్తింది. చైనాకు చెందిన హూ ఝూహీ 210 కిలోల (94, 116) బరువునెత్తి స్వర్ణం సాధించింది. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి తర్వాత వెయిట్‌లిఫ్టింగ్‌లో మెడ‌ల్ గెలిచిన తొలి అథ్లెట్‌గా మీరాబాయి నిలిచింది.

తాను గోల్డ్ కోసం గ‌ట్టిగానే ప్ర‌య‌త్నించాన‌ని ఆమె చెప్పుకొచ్చింది. మెడ‌ల్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉందని.. మొత్తం దేశం ఎన్నో అంచ‌నాల‌తో న‌న్ను చూస్తోందని తెలిపింది. ఉత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నించానని.. దీనికోసం చాలా శ్రమించానని తెలిపింది. గోల్డ్ మెడ‌ల్ గెల‌వ‌డానికి గ‌ట్టిగానే ప్ర‌య‌త్నించాను కానీ గెల‌వ‌లేక‌పోయానని తెలిపింది. కానీ ప్ర‌య‌త్న‌మైతే చేశాను. రెండో లిఫ్ట్ చేసిన‌ప్పుడే మెడ‌ల్ గెలుస్తాన‌ని తెలిసిపోయిందని మీరాబాయి చెప్పింది. ఈరోజు మెడల్ సాధించడానికి కారణం తాను ఎన్నో ఏళ్లుగా పడిన కష్టమేనని తెలిపింది.

2016 రియో ఒలింపిక్స్‌ లో అర్హ‌త సాధించ‌గ‌లిగింది. కానీ అక్క‌డ తీవ్ర నిరాశ ఎదురైంది. క్లీన్ అండ్ జెర్క్‌లో ఒక్క‌సారి కూడా బ‌రువు ఎత్త‌లేక వెనుదిరిగింది. ఒకానొక సమయంలో మీరాబాయి గేమ్‌ను వ‌దిలేయాల‌ని భావించింది. కానీ కొంత‌కాలం త‌ర్వాత ఆ బాధ నుంచి తేరుకుని బ‌లంగా పుంజుకుంది. ఏడాది త‌ర్వాత జ‌రిగిన వ‌ర‌ల్డ్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియ‌న్‌షిప్స్‌లో ఏకంగా గోల్డ్ మెడ‌ల్ గెలిచింది. క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి తర్వాత వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌షిప్స్‌లో గోల్డ్ గెలిచిన రెండో ఇండియ‌న్ వెయిట్‌లిఫ్ట‌ర్‌గా చ‌రిత్ర సృష్టించింది. దేశంలో అత్యున్న‌త పౌర‌పుర‌స్కారం రాజీవ్ ఖేల్‌ర‌త్న ద‌క్కింది. 2018లో ప‌ద్మ‌శ్రీ అవార్డుతో ప్ర‌భుత్వం స‌త్క‌రించింది.

మణిపూర్ కు చెందిన మీరాబాయి ఇంఫాల్‌కు 20 కిలోమీట‌ర్ల దూరంలోని నాంగ్‌పాక్ కాక్‌చింగ్ అనే ఊళ్లో ఓ నిరుపేద కుటుంబంలో పుట్టింది. క‌ట్టెలు కొట్టుకొచ్చి క‌డుపు నింపుకునేవారు. అంద‌రి కంటే చిన్న‌దైనా కూడా మొద‌టి నుంచీ బ‌రువులు మోయడంలో మీరాబాయ్ దిట్ట‌. 12 ఏళ్ల వ‌య‌సులోనే త‌న కంటే పెద్ద‌వాళ్ల‌యిన తోబుట్టువులు కూడా మోయ‌లేని బ‌రువును త‌ల‌పై ఎత్తుకొని 2 కిలోమీట‌ర్లు అవ‌లీల‌గా న‌డిచేది. మీరాబాయ్ ఐదేళ్ల వ‌య‌సులోనే త‌ల‌పై ఓ నీటి బ‌కెట్‌ను పెట్టుకొని కొండ‌ను ఎక్క‌డం నేర్చుకుంది. అప్పుడ‌ది కుటుంబ అవ‌స‌రం. నీటి బ‌కెట్ల‌తోపాటు క‌ట్టెలు మోయ‌డం అలవాటు చేసుకుంది. 14 ఏళ్ల వ‌య‌సులో వెయిట్‌లిఫ్టింగ్ వైపు చూసింది. ఇక వెయిట్‌లిఫ్టింగ్ శిక్ష‌ణ కోసం త‌న ఊరికి 50 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ట్రైనింగ్ సెంట‌ర్‌కు రోజూ వెళ్లి వ‌చ్చేది. మొద‌ట కోచ్ అనితా చాను ఆమెకు శిక్ష‌ణ ఇచ్చింది. అక్క‌డ మీరాబాయ్ మొద‌ట వెదురు బొంగుల‌నే బార్‌బెల్స్‌గా ఉప‌యోగించి బ‌రువులు మోసింది. అలా త‌న టెక్నిక్‌ను మెరుగుప‌ర‌చుకున్న ఆరు నెల‌ల త‌ర్వాత సాంప్ర‌దాయ వెయిట్‌లిఫ్టింగ్ వైపు మ‌ళ్లింది. రెండేళ్ల‌లోనే స‌బ్‌జూనియ‌ర్ స్టేట్ లెవ‌ల్ చాంపియ‌న్‌షిప్‌లో గోల్డ్ మెడ‌ల్ గెలిచే స్థాయికి చేరింది. 2011లో జూనియ‌ర్ కేట‌గిరీలో తొలిసారి నేష‌న‌ల్ మెడ‌ల్ గెలిచింది. త‌న ఆరాధ్య వెయిట్‌లిఫ్ట‌ర్ కుంజ‌రాణిదేవి ద‌గ్గ‌రికి తీసుకెళ్లింది. 2014లో కామ‌న్వెల్త్ గేమ్స్ రూపంలో తొలిసారి అంత‌ర్జాతీయ వేదిక‌పై స‌త్తా చూపే అవ‌కాశం ద‌క్కింది. తొలిసారే 48 కేజీల విభాగంలో సిల్వ‌ర్‌తో మెరిసింది. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ టోక్యో 2020లో సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

2 × 4 =

Back to top button