More

  కర్నాటక స్వామీజీ లైంగిక వేధింపుల కేసు.. వెలుగులోకి కళ్లు బైర్లు కమ్మే నిజాలు..! శివమూర్తి మురుఘాతో రాహుల్ ఫొటో వైరల్..!!

  కర్నాటకలోని మురుఘా మఠాధిపతి ‘శివమూర్తి మురుఘా’ లైంగిక వేధింపుల కేసులో.. తవ్వుతున్న కొద్దీ కళ్ళు బైర్లు కమ్మే నిజాలు వెలుగుచూస్తున్నాయి. ఒకరిద్దరు కాదు ఏకంగా 15 మంది అమాయక బాలికలపై అత్యాచారానికి పాల్పడినట్టు తెలుస్తోంది. మొదట ఇద్దరు బాలికలపై అత్యాచారం చేసినట్టు ఆరోపణలు రావడంతో గత సెప్టెంబర్ ఒకటిన శివమూర్తి మురుఘాను పోలీసులు అరెస్ట్ చేశారు. శివమూర్తి మురుఘా, మఠం పాలనాధికారితో పాటు.. మరో ముగ్గురు సిబ్బందిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులు పారిపోయే అవకాశలున్న కారణంగా నిందితులపై పోలీసులు ఔట్ లుక్ నోటీసులు కూడా జారీ చేశారు. బాధితుల తరఫున శిశు సంక్షేమ సమితి, జాతీయ మానవహక్కుల సమితి రంగప్రవేశం చేయటం, బాధితుల్లో ఒకరు దళిత వర్గానికి చెందినవారు కావడంతో నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది.

  ఇక, పోలీసుల విచారణలో కళ్లు బైర్లు కమ్మే నిజాలు వెలుగుచూస్తున్నాయి. బాలికలకు మత్తుమందు ఇచ్చి 2019 నుంచి పలుసార్లు లైంగిక దాడులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. అయితే శివమూర్తి మఠాధిపతి కావడంతో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందేమోనని.. పోలీసులు అతన్ని అజ్ఞాతానికి తరలించి విచారిస్తున్నారు. శివమూర్తి అరాచకాలు తట్టుకోలేక గత ఆగస్టులో ఇద్దరు బాలికలు మైసూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. తొలిసారి ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత కేసును చిత్రదుర్గ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేసి.. శివమూర్తి మురుఘను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నవంబర్ 4న చార్జిషీటును కోర్టుకు సమర్పించారు. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న శిమమూర్తి మురుఘ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించారు. శివమూర్తి మురుఘపై దాఖలైన మొత్తం 694 పేజీల ఛార్జ్ షీట్‌లో మఠంలో జరుగుతున్న అనేక షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేసును విచారించిన డీవైఎస్పీ అనిల్ నేతృత్వంలోని బృందం 2వ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టుకు మొత్తం 694 పేజీల చార్జిషీటును సమర్పించింది.

  ఇక, ఛార్జిషీటులోని అంశాలు మీడియాలో వస్తుండటంతో రాజకీయ నేతలు, ప్రజాసంఘాల నేతలు శివమూర్తి మురుఘపై బాహాటంగానే విమర్శిస్తున్నారు. తాజాగా కర్నాటక మాజీ సీఎం బి.ఎస్. యడ్యూరప్ప కూడా ఈ కేసుపై స్పందించారు. ఆయన ఇంత దిగజారిపోతారని అనుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ మురుగ చేసింది క్షమించరాని నేరమని, దీనిని అందరూ ఖండించాలని బీఎస్ యడ్యూరప్ప అన్నారు. అటు కాంగ్రెస్ ఎమ్మెల్యే, వీరశైవ మహాసభ అధ్యక్షుడు శామూరు శివశంకరప్ప కూడా శివమూర్తి మురుఘపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి స్వాముల వల్ల ఆడపిల్లలు మఠాలకు వెళ్లకూడదనే పరిస్థితి ఏర్పడుతుందని.. అలాంటి పరిస్థితి రాకూడదని అన్నారు.

  ఓవైపు శివమూర్తి మురుఘా కేసు కర్నాటకతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంటే.. మరోవైపు శివమూర్తి మురుఘాను రాహుల్ గాంధీ కలిసిన ఫొటో ఇప్పుడు వైరల్ గా మారింది. అసలు విషయం ఏమిటంటే.. ముత్తాత నెహ్రూ ముక్కలు చేసిన భారత్ ను మళ్లీ జోడిస్తానని ఓట్ల బిక్షాటన చేస్తున్న రాహుల్ గాంధీ.. సరిగ్గా శివమూర్తి మురుఘాపై ఆరోపణలు రావడానికి కొద్ది రోజుల ముందే కలిశాడు. భారత్ జోడో యాత్రలో భాగంగా తనను కలిసిన రాహుల్ గాంధీకి శివమూర్తి మురుఘ శివదీక్ష ఇచ్చారు. ఓట్ల యాత్ర.. సారీ.. జోడోయాత్ర సూపర్ హిట్ కావాలంటూ ఆశీర్వదించి పంపారు.

  ఇలా మన రాహుల్ జీ ఎవరినీ కలిసినా వివాదంగా మారుతోంది. భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీకి చేకూరే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా కలుగుతోంది. యాత్ర మెదటి రోజు కలిసిన వివాదాస్పద పాస్టర్ ‘జార్జ్ పొన్నయ్య’ నుంచి శివమూర్తి మురుఘా దాకా అందరూ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్నవారే. అయితే, గతంలోనూ శివమూర్తి మురుఘాపై అనేక ఆరోపణలున్నాయి. నిజానికి, కార్నాటకలో శివమూర్తి మురుఘా కంటే గొప్ప గురువులు ఎంతో మంది ఉన్నారు. నడిచే దైవంగా పిలువబడే సిద్దగంగ పీఠాధిపతి శివకుమార్ స్వామీజీ లాంటి వారు పరమపదించినా కూడా అంతటి గొప్ప మహత్యం కలిగిన పీఠాధిపతులు ఎందరో ఉన్నారు. కానీ, ఇటువంటి వారినెవరినీ కలవకుండా ఎంచుకుని మరీ వివాదాస్పద పీఠాధిపతిని కలిశాడు రాహుల్ గాంధీ.

  Trending Stories

  Related Stories