మదర్ థెరెసా వెల్ఫేర్ ట్రస్టులో ఘోరం చోటు చేసుకుంది. ఇద్దరు మైనర్ అమ్మాయిలను లైంగికంగా వేధించిన ఘటన బయటకు వచ్చింది. జార్ఖండ్ ప్రభుత్వం గుర్తింపు పొందిన మదర్ థెరెసా వెల్ఫేర్ ట్రస్ట్ లో గత కొన్నేళ్లుగా లైంగిక వేధింపులు చోటు చేసుకుంటూ ఉన్నాయనే విషయాలు బయటకు వచ్చాయి. ఇద్దరు మైనర్ లపై లైంగిక వేధింపులు జరిగాయనే ఫిర్యాదు పోలీసులకు అందింది. మిగిలిన అమ్మాయిలను కూడా విచారించగా గత 4 సంవత్సరాలుగా అక్కడి అమ్మాయిలపై లైంగిక వేధింపులు చోటు చేసుకుంటూనే ఉన్నాయని బయటపెట్టారు. దీంతో జార్ఖండ్ పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ మొదలుపెట్టారు.
ఇద్దరు బాధితులు తప్పిపోయిన తరువాత.. పోలీసులు వారిని పట్టుకున్నారు. ఎందుకు పారిపోయారు అని అడగగా.. భయంకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. బాలికల సెల్‌ఫోన్‌లను ట్రాక్ చేసి పట్టుకున్నారు. విచారణ సమయంలో.. బాలికలు ఆశ్రయంలోని సంరక్షకుల చేతుల్లో నిరంతర హింస, లైంగిక వేధింపుల నుండి తప్పించుకోడానికి ఆశ్రయం నుండి పారిపోవాలని నిర్ణయించుకున్నామని పోలీసులకు తెలిపారు. స్కూల్స్, కాలేజీలు మూసి వేయడంతో లాక్డౌన్ సమయంలో ఆశ్రయానికి పంపబడ్డారు.
16, 17 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు మైనర్ బాలికలు వీడియో-రికార్డ్ స్టేట్మెంట్లు ఇచ్చారని జంషెడ్పూర్ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ ఎం తమిళ వానన్ తెలిపారు. వారు తమ స్టేట్మెంట్లలో చేసిన ఆరోపణలన్నింటినీ ప్రత్యేక పోక్సో కోర్టుకు పంపించారు. బాలికలు హోమ్ లో వద్ద శారీరకంగా మరియు మానసికంగా హింసించబడ్డారని వెల్లడించారు. నిందితుడు ఎన్జీఓ డైరెక్టర్ హర్పాల్ సింగ్ థాపర్, అతని భార్య పుష్ప రాణి తిర్కీ, తూర్పు సింగ్భూమ్ జిల్లా శిశు సంక్షేమ కమిటీ (సిడబ్ల్యుసి) చైర్‌పర్సన్, వార్డెన్ గీతా సింగ్, ఆమె కుమారుడు ఆదిత్య సింగ్, మరో సిబ్బంది టోనీ సింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. మైనర్ థాపర్, ఇతర వ్యక్తులు మైనర్లను లైంగికంగా వేధించగా, తిర్కీ వారిని కొట్టేవారు. రక్షించిన ఇద్దరు బాలికల ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం, భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ల కింద నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
బయటకు వచ్చిన నిర్ఘాంతపోయే విషయాలు:
పోలీసుల విచారణలో ఎన్నో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. హర్పాల్ సింగ్ థాపర్ వార్డెన్ 19 ఏళ్ల కుమార్తెతో శారీరక సంబంధాలు కలిగి ఉన్నాడని దర్యాప్తులో తేలింది. అతను ఇతరులతో కలిసి అమ్మాయిలపై లైంగిక వేధింపులకు దిగేవాడు. గత నాలుగేళ్లుగా సిడబ్ల్యుసి చీఫ్ రాణి తిర్కీకి బాలికలు పదేపదే ఫిర్యాదు చేసినప్పటికీ, నేరస్తులపై ఆమె ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. రక్షించబడిన ఇద్దరు బాలికలపై అత్యాచారం జరిగిందో లేదో తెలుసుకోవడానికి పోలీసులు వైద్య నివేదికల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ హోమ్ లో ఉండే అమ్మాయిలు బయట ఏవేవో పనులు చేస్తూ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ట్రస్ట్ వార్తల్లో నిలిచింది. జిల్లా యంత్రాంగం దీనిపై విచారణకు ఆదేశించింది. నలుగురు సభ్యుల బృందం మరింత లోతుగా విచారిస్తూ ఉన్నారు. బ్రెయిన్ ట్యూమర్ కారణంగా 25 రోజుల క్రితం ఈ హోమ్ లో మరణించిన మూడున్నర సంవత్సరాల బాలిక మరణంపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జార్ఖండ్ ప్రభుత్వం ఆమోదించిన ఈ ఎన్జీఓకు మదర్ థెరెసా మిషనరీస్ ఆఫ్ ఛారిటీతో ఎటువంటి సంబంధం లేదని ఆరోపించారు. ఖరంగజార్‌లోని షంషేర్ టవర్ వద్ద ఉన్న ఈ ఆశ్రయంలో మూడు అంతస్తులు ఉన్నాయి. 23 మంది బాలికలు రెండవ అంతస్తులో రెండు గదుల్లో నివసిస్తున్నారు. వార్డెన్ తన కుమార్తె మరియు కొడుకుతో ఒకే అంతస్తులో మరొక గదిలో నివసిస్తున్నారు. థాపర్, తిర్కీ మొదటి అంతస్తులో ఉండగా.. 22 మంది బాలురు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండేవాళ్లు.
థాపర్, తిర్కీ ప్రభుత్వ నిధులను మరియు ప్రైవేట్ విరాళాలను వారి వ్యక్తిగత ఖాతాల్లోకి బదిలీ చేసేవారని.. అది కూడా విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. “దుస్తులు, ఆహారం మరియు ఇతర వస్తువుల కోసం చాలా మంది ప్రజలు విరాళంగా ఇచ్చిన డబ్బును వారు తీసుకున్నారని బాలికలు మాకు చెప్పారు. వేర్వేరు బృందాలు రహస్య రహస్య స్థావరాలపై దాడి చేస్తున్నారు. ఐదుగురు నిందితులను త్వరలో అరెస్టు చేస్తాము ” అని అధికారులు తెలిపారు.