తెలంగాణలో పకడ్బందీగా 10th, ఇంటర్ పరీక్షలు

0
684

పదవ తరగతి, ఇంటర్మీడియేట్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. పదవ తరగతి, ఇంటర్మీడియేట్ పరీక్షల నిర్వహణపై ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేనతో కలిసి జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.


రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పరీక్షలు 9,07,396 మంది విద్యార్థులు, పదవ తరగతి పరీక్షలు 5,09,275 మంది విద్యార్థులు హాజరవుతారని మంత్రి తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. మే నెలలో ఎండల తీవ్రత అధికంగా ఉండటంవల్ల విద్యార్థులకు సమస్యలు రాకుండా పరీక్ష కేంద్రానికి విద్యార్థులు సమయానికి చేరుకునే విధంగా ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలని సూచించారు. పరీక్షల నిర్వహణ సమయంలో హైదరాబాద్ లో ముగ్గురు మానసిక వైద్య నిపుణులను ఏర్పాటుచేసి టోల్ ఫ్రీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నారు. టోల్ ఫ్రీ నెంబర్ 1800-5999333 నెంబరుకు విద్యార్థులతో మాట్లాడించాలని ఈ నెంబరు ప్రతి పరీక్ష సెంటర్ ప్రిన్సిపాల్ వద్ద ఉండే విధంగా చూడాల్సి ఉంటుంది.
ప్రాథమిక చికిత్స అందించేందుకు మందులు, ఓఆర్ఎస్. ప్యాకెట్లతో ఎఎన్ఎమ్ లు, ఆశా వర్కర్లను అందుబాటులో ఉండేలా సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తుతో పాటు 144 సెక్షన్ ను అమలులో ఉంటుందని, పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచేలా చర్యలు చేపడతామని తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ ప్రతిక్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, జిల్లా వైద్య అధికారి స్వరాజ్య లక్ష్మి, సైబరబాద్ కమిషనరేట్ డి.సి.పి.శిల్పవల్లి, ఏ.సి.పి.శంకర్, జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాశాఖ అధికారి వెంక్య నాయక్, పోలీస్ శాఖ అధికారులు, జిల్లా ట్రేజరీ అధికారి, కలెక్టరేట్ కార్యాలయ తహసీల్దార్ జయశ్రీతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here