అగ్నిపథ్ పథకంపై అపోహలను నమ్మకండి.. వాస్తవాలను తెలుసుకోవాలని పలువురు నాయకులు సూచిస్తూ ఉన్నారు. తాజాగా అగ్నిపథ్ గురించి ఆందోళనలు వద్దని.. ప్రతి ఒక్కరూ అగ్నిపథ్‌కు సహకరించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు. కావాలనే కొందరు యువతను రెచ్చగొడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్నివీర్‌లో ఒకసారి పనిచేస్తే ఆత్మ విశ్వాసం ఏర్పడుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే 1999లో అగ్నిపథ్ బీజం పడిందన్నారు. అనవసరంగా అగ్నిపథ్‌పై రాజకీయం చేయొద్దన్నారు. అగ్నిపథ్ ద్వారా దేశానికి మంచి జరుగుతుందని, ఎవరికీ నష్టం జరగదన్నారు. సైన్యంలో పనిచేయాలని చాలా మంది ఆశతో ఉన్నారని, అలాంటి వాళ్ళు అగ్నిపథ్‌లో చేరొచ్చన్నారు. మహింద్రలాంటి కంపెనీ అగ్నివీరులందరకీ జాబ్‌లు ఇస్తామంటున్నారని చెప్పుకొచ్చారు. అగ్నివీరులకు విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు ఉంటాయన్నారు.
తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా అగ్నివీరులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని హామీ ఇచ్చారు. అగ్నిపథ్ ను నిరసిస్తూ హింస చెలరేగడం బాధను కలిగిస్తోందని ఆయన అన్నారు. అగ్నివీరుల డిసిప్లిన్, స్కిల్స్ వల్ల వారికి ఎన్నో ఉద్యోగావకాశాలు ఉంటాయని చెప్పారు. అగ్నిపథ్ లో పని చేసిన యువతకు తమ మహీంద్రా గ్రూప్ ఉద్యోగావకాశాలను కల్పిస్తుందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం ద్వారా త్రివిధ దళాలకు ఎంపికయ్యే వారిలో 60 నుంచి 70 శాతం మంది పదో తరగతి వారే ఉంటారని సైనిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పురి తెలిపారు. వారి కాల పరిమితి ముగిసి బయటకు వచ్చే నాటికి వారి వయసు 21 నుంచి 25 ఏళ్ల లోపు ఉంటుందన్నారు. వారికి 12వ తరగతి సర్టిఫికెట్ జారీ చేస్తామని, ఆ తర్వాత వారు డిగ్రీ పూర్తి చేసేందుకు కూడా సాయం చేస్తామని అనిల్ పురి తెలిపారు. అగ్నివీరుల నాలుగేళ్ల కాలపరిమితి పూర్తయ్యాక 25 శాతం మందిని రెగ్యులర్ సర్వీసుల్లో చేర్చుకుంటామని, మిగిలిన వారికి కేంద్ర సాయుధ బలగాల్లో, రక్షణ శాఖ నియామకాల్లో 10 శాతం చొప్పున ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. వారికి పోలీసు శాఖలో ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కోరుతామన్నారు. సర్వీసు అనంతరం బయటకొచ్చే యువకుల చేతుల్లో రూ. 11.70 లక్షలు ఉంటుందని, ఆ మొత్తంతో వారు ఏదైనా వ్యాపారం కూడా పెట్టుకోవచ్చని లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పురి వివరించారు.