Telugu States

జగన్, కేసీఆర్ లు అవినీతిలో నెంబర్ వన్ స్థానం కోసం పోరాడుతున్నారు: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈరోజు విజయవాడలో పర్యటించారు. ఆయన ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని మద్యం, ఇసుక, ల్యాండ్ మాఫియాలు నడిపిస్తున్నాయని చెప్పారు. ఏపీలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని… అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మాఫియాల ఆట కట్టిస్తామని అన్నారు. లిక్కర్ మాఫియాతో ఏపీ ప్రభుత్వానికి లింక్ ఉందని చెప్పారు. అన్ని విషయాలు త్వరలోనే బయటకు వస్తాయని అన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు ను వ్యతిరేకించి జగన్ ను రాష్ట్ర యువత గెలిపించారని, అలాంటి యువతను జగన్ అన్ని విధాలా మోసం చేశారని అన్నారు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు కూడా తరలిపోయేలా జగన్ పాలన కొనసాగుతోందని విమర్శించారు. మూడున్నరేళ్ల వైసీపీ పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయని, దీని వల్ల యువత ఆరోగ్యం పాడవుతోందని చెప్పారు. గంజాయి ముఠాలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ స్థాయిలో అత్యంత అవినీతి రాష్ట్రాల్లో ఏపీ నాలుగో స్థానంలో, తెలంగాణ రెండో స్థానంలో ఉన్నాయని చెప్పారు. జగన్, కేసీఆర్ లు అవినీతిలో నెంబర్ వన్ స్థానం కోసం పోరాడుతున్నారని విమర్శించారు. ఏపీలో నీటి కుళాయిల కోసం కేంద్రం రూ. 4,500 కోట్లు ఇస్తే, జగన్ ఆ నిధులను మళ్లించి కేవలం రూ. 4 కోట్లు మాత్రమే ఇచ్చారని అన్నారు. ఏపీకి మూడు ఇండస్ట్రియల్ కారిడార్ లను ప్రధాని మోదీ ఇచ్చారని… కేంద్రం నుంచి వేల కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారని, ఈ విషయాన్ని బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. ఏపీకి మోదీ 21 లక్షల ఇళ్లను కేటాయించినా.. ఇంతవరకు పేదలకు వాటిని జగన్ అప్పగించలేదని అనురాగ్ ఠాకూర్ విమర్శించారు.

Related Articles

Back to top button