దక్షిణ ఆస్ట్రేలియాలోని అడిలైడ్ లో ఉన్న మోడ్బరీ హైట్స్.. అక్కడ హర్గ్రేవ్ రిజర్వ్ పిచ్ లో అక్కడి హిందువులు వీకెండ్స్ లో క్రికెట్ ఆడుతూ ఉంటారు. అయితే కొందరు వ్యక్తులు కావాలనే పిచ్ మీద గోమాంసం వేశారు. రెండు కేజీలకు పైగా గోవు మాంసాన్ని క్రికెట్ పిచ్ మీద కావాలనే వేయడం.. అక్కడి హిందువులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఈ ఘటన మే7 వ తేదీన చోటు చేసుకుంది. హిందువులు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో కావాలనే కొందరు వ్యక్తులు గోమాంసం వేయడంతో వివాదం మొదలైంది. హిందువులు గోమాతను ఎంతో పవిత్రంగా భావిస్తారు. వీకెండ్స్ లో హిందువులు వచ్చి అక్కడ క్రికెట్ ఆడుతారని తెలిసే కావాలని ఈ పని చేశారు.
7న్యూస్ మీడియా సంస్థతో జాన్ స్నైడర్ మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు ఏ మాత్రం ఉపేక్షించకూడదని అన్నారు. పోలీసులు ఈ ఘటన గురించి ఆరా తీయడానికి వచ్చినప్పుడు సాక్ష్యాలను చూపించడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. మరొక స్థానికుడు స్టీఫెన్ ప్రిడ్జియన్ మాట్లాడుతూ కొందరు ఆకతాయిలు కావాలనే చేసిన పని ఇతర మతస్థులను అవమానపరిచే విధంగా ఉన్నాయని అన్నారు.
స్థానికంగా ఉన్న హిందువైన నుపుర్ షా మాట్లాడుతూ.. ఈ ఘటన పట్ల హిందువులంతా చాలా బాధపడుతూ ఉన్నారని.. హిందూ కమ్యూనిటీకి చెందిన చాలా మంది వారాంతాల్లో క్రికెట్ ఆడుతూ ఉంటారని.. కానీ ఇలా చేయడం తమకు నచ్చలేదని అన్నారు. ఎంతో పవిత్రంగా తాము గోమాతను చూసుకుంటామని.. ఇలా గోమాంసాన్ని పిచ్ పై వేయడం జాత్యహంకార చర్య అని అన్నారు.
స్థానిక పోలీసులు మాట్లాడుతూ ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులను తప్పకుండా పట్టుకుంటామని అన్నారు. ఇలాంటి జాత్యహంకార ఘటనలకు ఆస్ట్రేలియాలో ఏ మాత్రం తావులేదని అన్నారు. ఘటనకు బాధ్యులైన వ్యక్తుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన చోటు చేసుకున్న తర్వాత అక్కడి హిందువులెవరూ ఆ పిచ్ పై క్రికెట్ ఆడడానికి సముఖంగా లేరట.. ఈ ఘటన వారి మనోభావాలను దెబ్బతీసిందని స్థానికులు చెప్పారు. పలువురు ఆస్ట్రేలియన్లు ఈ ఘటనను ఖండించారు.