మధ్యప్రదేశ్‎లో గెలిచిందెవరు..? హిందూ మహిళా..? ఎంఐఎం పార్టీనా..?

0
746

రాజకీయ నాయకులే కాదు.. పార్టీ పని తీరు కూడా విజయం కోసమే ప్రయత్నిస్తుంది. ప్రత్యర్ధిని ఓడించేందుకు ఎంతవరకైనా దిగజారడం దేశ పాలిటిక్స్‎లో ఆనవాయితీ. బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్‎లో జరిగిన సంస్థల ఎన్నికల్లో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది.

దేశంలో విస్తరించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ఎంఐఎం పార్టీ.. ఇతర రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో పోటీలకు అభ్యర్ధులను దింపుతోంది. అందులో భాగంగానే మధ్యప్రదేశ్‎లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అభ్యర్ధులను నిలబెట్టింది. అందులో అనూహ్యంగా ఓ హిందూ గృహిణికి ఎంఐఎం పార్టీ టికెట్ కేటాయించింది. ఆమె నిలబడిన వార్డులో ఎక్కువ మంది హిందువులు ఉండటంతో ఎంఐఎం గెలుపు కోసం ఈ నిర్ణయం తీసుకోకతప్పలేదు. ఆ పార్టీ అంచనాలకు తగ్గట్టుగా ఆ మహిళ వార్డు మెంబర్‎గా విజయం సాధించింది.

ఓ హిందూ అభ్యర్థి మధ్యప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంఐఎం తరుపున గెలుపొందడం అక్కడి రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఊహించని రీతిలో ఓ మహిళా అభ్యర్థిని బరిలోకి దింపి గెలుపు అందుకుంది ఆ పార్టీ. స్వయానా మంత్రే దగ్గరుండి అక్కడి ప్రచార బాధ్యతలను చూసుకున్నా.. ఆమె గెలుపును ఆపలేకపోయారు. తన విజయానికి గానూ వార్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. హామీలను నెరవేరుస్తానంటోంది అరుణ ఉపాధ్యాయ. అయితే ఎంఐఎం మొట్టమొదటిసారి మధ్యప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. మొదటి ఫేజ్‌లో నాలుగు చోట్ల సంచలన విజయం సాధించింది. ఆయా చోట్ల బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులను ఓడించారు ఎంఐఎం అభ్యర్థులు. ఇప్పుడు రెండో ఫేజ్‌లోనూ ఏడు స్థానాల్లో పోటీ చేస్తే.. మూడు స్థానాలు కైవసం చేసుకుంది. అందులో ఖార్‌గావ్‌ మున్సిపల్‌ స్థానం విజయం ప్రత్యేకంగా నిలిచింది.

ఈ మున్సిపాలిటీలో వార్డు నెంబర్‌ 2లో పోటీకి దిగింది గృహిణి అయిన అరుణ శ్యామ్‌ ఉపాధ్యాయ. ఆమె భర్త శ్యామ్‌ ఉపాధ్యాయ స్థానికంగా ఉద్యమవేత్త. రాజ్యాంగం, దళిత-వెనుకబడిన వర్గాల వాదనకు ఆకర్షితుడై ఎంఐఎంలో చేరాడు. తొలుత పార్టీ సీటును శ్యామ్‌కే కేటాయించాలనుకుంది. కానీ, అనూహ్యంగా స్థానికంగా మహిళలతో కలివిడిగా ఉండే అరుణకు బరిలోకి దించింది. కీలకమైన మున్సిపాలిటీ కావడంతో మధ్యప్రదేశ్‌ మంత్రి విశ్వాస్‌ సారంగ్‌ తన అనుచరులతో ప్రచారం చేయించినప్పటికీ.. అరుణనే గెలుపు అందుకుంది. ఈ విజయాన్ని బట్టి స్పష్టంగా అర్ధం అవుతుంది. ప్రజలు ఎప్పుడైనా పార్టీని కాదు.. అభ్యర్ధిని చూసి ఓటు వేస్తారని మరోసారి రుజువైంది. ప్రస్తుతం కొన్ని ప్రధాన పార్టీలు చేసే రాజకీయాలు చూసి ప్రజలు ఎప్పుడో పార్టీలను నమ్మడం మానేశారు. అందుకే ఎంఐఎం పార్టీ అభ్యర్ధి అయినా హిందూ మహిళ కావడంతో ఆమెను భారీ మెజార్టీతో గెలిపించారు.

మరోవైపు బుధవారం కౌంటింగ్‌ జరిగిన ఐదు మున్సిపల్‌ కార్పొరేషన్లలో కాంగ్రెస్‌, బీజేపీలు రెండేసి స్థానాల్లో గెలుపొందగా, ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. మోరేనా, కట్నీ, దేవాస్, రేవా, రత్లాం సహా ఐదు మున్సిపల్ కార్పొరేషన్లకు ఓట్ల లెక్కింపు జరిగింది. వీటిలో దేవాస్, రత్లాంలలో బీజేపీ మేయర్ అభ్యర్థులు గెలుపొందగా, రేవా, మోరెనాలో కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి విజయం సాధించారు. కట్ని మున్సిపల్ కార్పొరేషన్‌లో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. దీనికి ముందు, జూలై 17న 11 మునిసిపల్ కార్పొరేషన్లకు కౌంటింగ్ నిర్వహించగా, బీజేపీ స్థానిక సంస్థలను కైవసం చేసుకోగా, మూడు స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. ఒక స్థానాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ చేజిక్కించుకుంది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

two + nineteen =