పోలీసు కస్టడీలోకి ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు సాదుద్దీన్

0
950

జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా పబ్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటనకు సంబంధించిన కేసులో ఏ-1గా ఉన్న సాదుద్దీన్‌ను పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. సాదుద్దీన్ కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేసింది. వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. నేరం జరిగిన ప్రదేశంలో సీన్ రికన్‌స్ట్రక్న్ చేయాల్సి ఉందని ప్రాసిక్యూషన్ తన వాదనలో పేర్కొంది. ఇందుకోసం నిందితుడిని పోలీసు కస్టడీకి అప్పగించాలని తెలిపింది. మూడు రోజుల పాటు సాదుద్దీన్‌ను పోలీసు కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులు కాగా వీరిలో సాదుద్దీన్ ఒక్కడే మేజర్. మిగిలిన ఐదుగురు కూడా మైనర్లే. వీరిలో సాదుద్దీన్‌తో పాటు నలుగురు మైనర్లపై సామూహిక అత్యాచారం (376 డీ), పోక్సో చట్టం, కిడ్నాప్, ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. మరో మైనర్‌పై పోక్సో, లైంగిక వేధింపుల చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు మైనర్లు.. ప్రస్తుతం జువైనల్‌ హోమ్‌లో ఉన్నారు. వీరిని ప్రశ్నించేందుకు అనుమతివ్వాలని జువైనల్‌ కోర్టులో పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు.