కాషాయంతో కలిసిన ఎంఐఎం..!

0
728

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరనేది జగమెరిగిన సత్యం. పరిస్థితులకు అనుగుణంగా.. అధికారం దక్కించుకోవడం కోసం శత్రువులు మిత్రువులు అవుతారు.. మిత్రులు శత్రువులవుతారు. మహారాష్ట్రలోనూ ఇదే జరగబోతుంది.

హిందుత్వ వ్యతిరేక పార్టీగా విమర్శలు ఎదుర్కొంటున్న MIM.. శివసేన ఇప్పుడు దోస్తీ కుదుర్చుకున్నాయి. కమలం పార్టీకి చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని పార్టీ నేతలు చెబుతున్నారు.

రాజకీయాల్లో ప్రత్యర్థిని చిత్తు చేయడమనేది చాలా అవసరం. ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీలు అవసరానికి తగ్గట్టుగా తమ నిర్ణయాలను మార్చుకుంటూ వ్యూహాలు రచిస్తూ.. ముందుకు సాగుతాయి. కాషాయ రంగు అంటేనే కారాలు మిరియాలు నూరే MIM పార్టీ… బీజేపీని ఓడించేందుకు మరో కాషాయ పార్టీతో చేయి కలిపింది.

మహారాష్ట్ర రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి శివసేన నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూటమితో పొత్తుకు సై అన్నది. ఈ కూటమి తరపు అభ్యర్థికి MIM ఎమ్మెల్యేలు ఓటు వేయనున్నారు. MIMకు చెందిన ఔరంగాబాద్ ఎంపీ ఇంతియాజ్ జలీల్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. తమ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ధూలియా, మాలేగావ్ నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించిన కొన్ని సూచనలను ప్రభుత్వానికి చేశామని ఇంతియాజ్ చెప్పారు. అయితే, శివసేనతో తమకున్న సిద్ధాంతపరమైన విభేదాలు మాత్రం భవిష్యత్తులో కొనసాగుతాయని చెప్పడం మాత్రం గమనార్హం.

హర్యానా, రాజస్థాన్‌, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని 16 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 57 సీట్లకు ఇటీవల ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిలో 41 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 16 స్థానాలకు ఎన్నిక నిర్వహించనున్నారు. ఇందులో మహారాష్ట్రకు చెందిన ఆరు స్థానాలు ఉన్నాయి. వీటిలో ఒక స్థానానికి కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఇమ్రాన్‌ ప్రతాప్‌గర్హీ పోటీలో ఉన్నారు. దీంతో ఆయనకు మద్దతు తెలపాలని ఎంఐఎం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు ఓటేయనున్నారు.

ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశామని తెలిపారు. ఈ ఎన్నికల్లో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, పీయూష్‌ గోయల్‌, కాంగ్రెస్‌ నేతలు రణ్‌దీప్‌ సూర్జేవాలా, జైరాం రమేశ్‌, ముకుల్‌ వాస్నిక్‌, శివసేనకు చెందిన సంజయ్‌ రౌత్‌ భవితవ్యం తేలనున్నది. ఏదేమైనప్పటికీ శివసేన కూటమితో MIMచేతులు కలపడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here