ప్రధాని నరేంద్ర మోదీపై ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ, ఆయన దోస్త్ అబ్బాస్ గురించి ఒవైసీ ప్రస్తావించడం దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. మోదీ స్నేహితుడిని ప్రస్తావిస్తూ ఒవైసీ.. బీజేపీకి కౌంటర్ ఇచ్చారు.
ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ ఇటీవలే 100వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా మోదీ.. హీరాబెన్ కాళ్లు కడిగి ఆమెకు సపర్యలు చేశారు. హీరాబెన్ పుట్టిన రోజు సందర్భంగా మోదీ.. తన బ్లాగ్ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన తల్లితో గడిచిన జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్న మోదీ.. తన చిన్ననాటి మిత్రుడు అబ్బాస్ గురించి కూడా ప్రస్తావించారు.
ప్రధాని మోదీకి తన చిన్నతనంలో అబ్బాస్ అనే ఫ్రెండ్ ఉండేవాడని చెప్పుకొచ్చారు. తన తండ్రికి ఓ స్నేహితుడి ఉండేవాడని.. అయితే, ప్రమాదవశాత్తు ఆయన చనిపోయారని తెలిపారు. దీంతో ఆయన కొడుకు అబ్బాస్‌ను.. మోదీ తండ్రి.. వారి ఇంటికి తీసుకువచ్చారని.. అబ్బాస్ తనతోనే చదువు పూర్తి చేసినట్టు మోదీ చెప్పారు. అలాగే, ఈద్ పండగ వేళ తన తల్లి ఆ అబ్బాయికి ప్రేమతో వంటలు చేసేదని మోదీ గుర్తు చేశారు.
కాగా, మోదీ చెప్పిన విషయాలపై అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ జీ.. ఒకవేళ మీ మిత్రుడు అబ్బాస్ ఉండి ఉంటే.. ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు సరైనవో కావో అడిగి తెలుసుకోవాలన్నారు. ఈ క‍్రమంలోనే నిజంగా మోదీకి ఇలాంటి ఫ్రెండ్ ఉన్నట్లు ఎవరికీ తెలియదన్నారు. ఒకవేళ అబ్బాస్ ఉండి ఉంటే.. ఇస్లామిక్ మతపెద్దలతో పాటు తాను కూడా మాట్లాడే ప్రసంగాలను విని వాటిపై వివరణ ఇచ్చేలా మోదీ చర్యలు తీసుకోవాలని అసద్ కోరారు. అలాగే, సుపుర్ శర్మ వ్యాఖ్యలను అబ్బాస్ కూడా అంగీకరించడు. తామేమైనా ఏవైనా అబద్దాలు చెబితే.. మీ ఫ్రెండ్ అబ్బాస్ ద్వారా తెలుసుకోండి మోదీ జీ అంటూ అసద్ కామెంట్స్ చేశారు. అంతటితో ఆగకుండా.. అబ్బాస్ అడ్రస్ ఇస్తే తామే అతని వద్దకు వెళ్తామని అసద్ స్పష‍్టం చేశారు.
ఇదిలాఉంటే అబ్బాస్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నారు. అతను తన కొడుకుతో కలిసి అక్కడే నివసిస్తున్నాడు. అబ్బాస్ కు ఇద్దరు కుమారులు. అతని పెద్ద కుమారుడు గుజరాత్ లోని కసింపి గ్రామంలో, చిన్న కుమారుడు ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు. అయితే అబ్బాస్ గుజరాత్ ప్రభుత్వంలో ఫుడ్ అండ్ సప్లయిస్ డిపార్ట్ మెంట్ లోపనిచేసేవాడు. ఇప్పుడు రిటైర్డ్ అయినట్లు తెలుస్తుంది. ప్రధాని మోదీ అబ్బాస్ ప్రస్తావన తేవడంతో.. నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.