More

    మిల్కాసింగ్ జీవితం.. ప్రతి క్రీడాకారుడికి ఓ పాఠ్యపుస్తకం

    ముస్లిం మతోన్మాదులు.. కళ్లముందే కన్నవాళ్లను నరికి చంపారు. చూస్తుండగానే తోబుట్టువుల ఉసురు తీశారు. ప్రాణభయంతో పారిపోయి ఓ శరణార్థుల క్యాంపులో తలదాచుకుంటే.. అక్కడికీ వచ్చారు. వారి కళ్లబడకుండా ఎలాగోలా తప్పించుకున్నా.. ఎక్కడికెళ్లాలో తెలియదు..! ఎలా బతకాలో తెలియదు..!! దేశ విభజన సమయంలో.. ఓ బాలుడి దీనగాథ ఇది. అలాంటి విపత్కర పరిస్థితుల కోలుకోవడం సాధ్యమేనా..? కానీ, ఆ బాలుడు కోలుకున్నాడు. గుండెనిబ్బరంతో ఎదిగాడు. తాను ఎదగడమే కాదు.. దేశానికీ పేరుతెచ్చాడు. నాడు ప్రాణభయంతో పరుగులు పెట్టిన ఆ చిన్నోడు.. చివరికి ట్రాక్‌ మీదే జీవితాన్ని వెతుక్కున్నాడు. ట్రాక్‌పై పరుగెత్తడమే తన జీవితమని భావించాడు. అలా పరుగెత్తీ పరుగెత్తీ.. స్వతంత్ర భారత దేశంలో మొట్టమొదటి ఛాంపియన్‌గా అవతరించాడు. అతడే ‘ది ఫ్లయింగ్ సిక్ మిల్కాసింగ్’. కొవిడ్ అనంతర సమస్యలతో బాధపడుతూ.. శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచిన మిల్కాసింగ్ జీవితం.. ప్రతి భారతీయ క్రీడాకారుడికి ఓ పాఠ్యపుస్తకం.

    1929 నవంబర్ 20న ప్రస్తుత పాకిస్తాన్ లోని ముజఫర్ నగర్ జిల్లా కోట్ అడ్డు తాలూకాలోని గోవిందపురలో జన్మించారు మిల్కాసింగ్. 15 మంది సంతానంలో మిల్కాసింగ్ ఒకరు. మిల్కా జీవితంలో తొలి అంకమంతా అష్టకష్టాలతో గడిచింది. దేశవిభజనకు ముందే ఎనిమిదిమంది తోబుట్టువులను కోల్పోయాడు మిల్కా. అదీ చాలదన్నట్టు దేశ విభజన ఆయన జీవితంలో చిచ్చుపెట్టింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్న సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు. దేశ విభజన గొడవలతో దేశం అట్టుడిపోతున్న పోతున్న రోజులవి. ముస్లిం మతోన్మాదులు కొన్ని లక్షలమంది హిందువులు, సిక్కులను ఊచకోత కోశారు. ఆ గొడవల్లో తన తల్లిదండ్రులను కూడా కోల్పోయారు మిల్కాసింగ్. తన తల్లిదండ్రులను, ముగ్గురు తోబుట్టువులను కళ్లముందే కడతేర్చినా.. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి ఉండిపోయారు. అక్కడి నుంచి ప్రాణాలతో బయటడిన మిల్కా.. ఓ శరణార్థుల క్యాంపులో కొన్నాళ్లు గడిపారు. ఆ తర్వాత ఢిల్లీలో ఉంటున్న తన సోదరి దగ్గరికి వెళ్లేందుకు ట్రెయిన్ ఎక్కేశారు. అయితే, టిక్కెట్ లేకపోవడంతో.. అరెస్ట్ చేసి తీహార్ జైల్లో పెట్టారు. విషయం తెలుసుకున్న అతని సోదరి.. ఇంట్లో నగలన్నీ అమ్మేసి తమ్మడిని జైలు నుంచి విడిపించి తీసుకెళ్లారు. అలా కొన్నాళ్లు తన సోదరి ఇంట్లో, కొన్నాళ్లు శరణార్థుల క్యాంపులో పెరిగారు మిల్కాసింగ్.

    కానీ, చేతిలో చిల్లిగవ్వలేదు. ఎలా బతకాలో తెలియదు. దీంతో చిన్నచిన్న నేరాలకు పాల్పడ్డారు. ఇది చూసి ఆవేదన చెందిన మిల్కాసింగ్ సోదరుడు మల్కాన్.. ఆ తర్వాత అతన్ని ఆర్మీలో చేరడానికి ఒప్పించారు. ఈ క్రమంలో ఆర్మీలో చేరేందుకు మూడుసార్లు ప్రయత్నించి విఫలమయ్యారు మిల్కాసింగ్. చివరికి నాలుగో ప్రయత్నంలో విజయం సాధించారు. అక్కడి నుంచి మిల్కాసింగ్ జీవితం మలుపుతిరిగింది. ఆర్మీ ట్రెయినింగ్ కోసం తొలిసారి మన తెలుగు నేలపైనే అడుపెట్టారు మిల్కాసింగ్. 1951 లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోని ‘ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్ సెంటర్’లో చేరారు. 1960 వరకు.. అంటే తొమ్మిదేళ్లపాటు మిల్కా సింగ్ సికింద్రాబాద్‌లోనే ఉన్నారు. ఇక్కడ ఉంటున్నప్పుడే పై అధికారులు అతడిలోని అథ్లెట్‎ను గుర్తించి ప్రోత్సహించారు. అలా మిల్కా జీవితం ట్రాక్ ఎక్కింది. నిజానికి, చిన్నప్పటి నుంచే మిల్కాసింగ్ కు పరుగెత్తడమంటే చాలా ఇష్టం. చదువుకునే రోజుల్లో ఇంటి నుంచి స్కూల్‌కు.. స్కూల్ నుంచి ఇంటికి రోజూ 10 కిలోమీటర్ల పరుగులు పెడుతుండేవారట. అయితే, ఆర్మీలో చేరాక పరుగులు పెట్టడం కూడా ఒక ఆట అని తెలుసుకున్నారు మిల్కా సింగ్.

    ఇక అప్పటి నుంచి రన్నింగ్ పై మక్కువ పెంచుకున్నారు. సికింద్రాబాద్ ప్రాంతంలోని అమ్ముగూడ ప్రాంతంలో రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవారు మిల్కా. అక్కడున్న ఓ కొండ చుట్టూ రాళ్లు నింపిన బ్యాగ్‌ మోసుకుంటూ రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవారు. అంతేకాదు బొల్లారం రైల్వే స్టేషన్‌లోని రైలు పట్టాలపై కూడా పరుగులు తీసేవారు. ఒక్కోసారి రైలుతో పాటు సమానంగా పరుగెత్తుతూ సాధన చేసేవారు. ఈ విషయాలన్నీ ఓ సందర్భంలో మిల్కాసింగే స్వయంగా మిల్కా చెప్పుకొచ్చారు. మిల్కాసింగ్ ఛాంపియన్ అయిన తర్వాత.. EME సెంటర్‌లోని ఒక ప్రాంతానికి మిల్కాసింగ్ కాలనీ అని పేరుపెట్టారు. అంతే కాదు, సికింద్రాబాద్ లోని ఓ స్టేడియానికి కూడా మిల్కా సింగ్ పేరు పెట్టారు. అలా మిల్కాసింగ్ ఒక అథ్లెట్‌గా మారడానికి వేదికైన కంటోన్మెంట్ ప్రాంతం చరిత్రలో నిలిచిపోయింది.

    ఓవైపు జవానుగా దేశానికి సేవలందిస్తూనే.. మరోవైపు క్రీడాకారుడిగా దేశం పేరు నిలబెట్టారు మిల్కాసింగ్. 1956లో ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో జరిగిన ఒలింపిక్స్ లో పాల్గొని.. తొలి భారతీయ స్ప్రింటర్ గా రికార్డు సృష్టించారు. అయితే, అనుభవ లేమి కారణంగా.. నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మెడల్ గెలుచుకోకపోయినా.. ఆ ఒలింపిక్స్ ద్వారా ఎన్నో మెలకువలు నేర్చుకున్నారు. చార్లెస్ జెన్ కిన్స్ వంటి ఛాంపియన్ల సలహాలు లభించాయి. ఇక, 1958 కార్డిఫ్ కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించడంతో.. మిల్కాసింగ్ తొలిసారిగా ప్రపంచ వేదికపై తనదైన ముద్ర వేశారు. అప్పటి ప్రపంచ రికార్డ్ హోల్డర్ మాల్కం స్పెన్స్‌ను 440 గజాల పరుగుల పోటీలో ఓడించి చరిత్ర సృష్టించారు. ఆ టోర్నీలో మాల్కం స్పెన్స్ కి, మిల్కా సింగ్ కి తేడా అర అడుగు మాత్రమే. పోటాపోటీగా సాగిన ఈ పరుగుపందెంలో మిల్కా చిరుతపులిని తలపిస్తూ.. స్పెన్స్ కంటే కొన్ని క్షణాల ముందే వైట్ టేప్ ను టచ్ చేశారు. టేప్ ను టచ్ చేయగానే స్పృహతప్పి అక్కడే మూర్ఛపోయారు. వెంటనే మిల్కాను స్ట్రెచర్‌పై తీసుకెళ్లి ఆక్సిజన్ అందించారట. తెలివి వచ్చిన తరువాతే తాను విజయం సాధించిన విషయాన్ని గుర్తించారట మిల్కాసింగ్. దీనినిబట్టి విజయం కోసం ఆయన.. ఎంతలా తెగించి పరుగెత్తారో అర్థం చేసుకోవచ్చు. తేరుకున్న తర్వాత సహచరులు ఆయనను భుజాలపై ఎత్తుకుని తిప్పారు. త్రివర్ణ పతాకాన్ని తన ఒంటికి చుట్టుకుని స్టేడియం మొత్తం పరిగెత్తారు. కామన్వెల్త్ క్రీడల్లో ఒక భారతీయుడు సాధించిన తొలి బంగారు పతకం ఇదే.

    ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్, మిల్కాసింగ్ మెడలో స్వర్ణ పతకం వేస్తుండగా భారత జెండా సగర్వంగా పైకి ఎగిరింది. అది చూసి మిల్కాసింగ్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ సమయంలో వీఐపీ ఆవరణ నుంచి.. చిన్న జుత్తుతో, చీర కట్టులో వున్న ఓ మహిళ తనవైపు పరిగెత్తుకుంటూ రావడం చూశారు మిల్కా. వచ్చీరాగానే ఆమె మిల్కాను కౌగిలించుకుని అభినందించారు. భారత టీం చీఫ్ అశ్వని కుమార్ ఆమెను మిల్కాసింగ్ కి పరిచయం చేశారు. ఆమెవరో కాదు.. బ్రిటన్‌లో అప్పటి భారత హైకమిషనర్, నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ సోదరి విజయలక్ష్మి పండిట్. అప్పుడు.. మీకు ఏం బహుమతి కావాలో చెప్పమని ప్రధాని నెహ్రూ అడిగారని.. విజయలక్ష్మి పండిట్ అన్నారట. అందుకు, ఈ ఆనంద క్షణాల్ని ఆస్వాదించడానికి దేశం మొత్తం ఒకరోజు సెలవు ప్రకటించమని అన్నారట మిల్కాసింగ్. మిల్కా కోరిక మేరకు.. ఆయన భారత్ కు తిరిగొచ్చిన తర్వాత ఒక రోజు సెలవు ప్రకటించారట ప్రధాని నెహ్రూ.

    ఇక అప్పటి నుంచి మిల్కాసింగ్ వెనుదిరిగి చూసుకోలేదు. అదే ఏడాది అంటే 1958 టోక్యో ఏషియన్ గేమ్స్ లో రెండు స్వర్ణ పతకాలు సాధించారు. 200 మీటర్ల, 400 మీటర్ల ఈవెంట్లలో గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నారు. అంతేకాదు, అదే ఏడాది కటక్ లో జరిగిన నేషనల్ గేమ్స్ లో కూడా రెండు స్వర్ణ పతకాలు సాధించారు. అప్పటికే మిల్కాసింగ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఆ సందర్భంలో 1960లో జరిగిన పాకిస్తాన్, భారత్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనేందుకు మిల్కాసింగ్ కు ఆహ్వానం అందింది. అప్పటికే మిల్కా దెబ్బకు.. టోక్యో ఏషియన్ గేమ్స్ లో సిల్వర్ మెడల్ తో సరిపెట్టుకున్న.. పాకిస్తాన్ అథ్లెట్ అబ్దుల్ ఖాలిక్.. బదులు తీర్చుకునేందుకు రగిలిపోతున్నాడు. అయితే, మిల్కా సింగ్ పాకిస్తాన్ వెళ్లేందుకు నిరాకరించారు. విభజన సమయం తాలూకు చేదు జ్ఞాపకాలు ఆయనను వెంటాడాయి. తన కళ్ల ముందే తన తండ్రిని హత్య చేసిన సంగతి ఆయన ఎప్పటికీ మరచిపోలేకపోయారు. దీంతో పాక్ గడ్డపై అడుగుపెట్టబోనని భీష్మించుకున్నారు మిల్కాసింగ్. కానీ, ప్రధాని నెహ్రూ స్వయంగా నచ్చజెప్పడంతో కాదనలేక పాకిస్తాన్ వెళ్లారు. పాక్ పై ఉన్న ద్వేషమో.. లేక, ఆ దేశం ముందు తలవంచొద్దన్న పౌరుషమో తెలియదు గానీ.. కేవలం 20.7 సెకన్లలో రేసును పూర్తిచేసి ప్రపంచ రికార్డు ను సమం చేశారు మిల్కాసింగ్. దీంతో లాహోర్ స్టేడియం ఒక్కసారిగా మారుమోగిపోయింది. రేసులో ఓడిపోయిన ఖాలిఖ్ స్వదేశంలో అవమానభారంతో అక్కడే నేలమీద కూర్చుండి ఏడ్చేశాడు. పాకిస్తాన్ ప్రేక్షకులతో పాటు.. ఖాలిఖ్ గెలుపు ఖాయమనుకున్న నాటి పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ సైతం.. మిల్కా పరుగు చూసి ఖంగు తిన్నాడట. అందుకే, గోల్డ్ మెడల్ అందిస్తున్న సందర్భంలో.. అసలు మీరు ఈరోజు పరుగెత్తలేదు, ఎగిరిపోయారు, అందుకే, మీకు ‘ఫ్లయింగ్ సిక్’ అనే బిరుదు ఇస్తున్నా.. అన్నారట ఆయూబ్ ఖాన్. అలా మన మిల్కాసింగ్ కు ‘ఫ్లయింగ్ సిక్’ అనే బిరుదు వచ్చింది. ఇక ఆ నాటి నుంచి కొన్నేళ్లపాటు ట్రాక్ పై మిల్కాకు ఎదురులేకుండాపోయింది. 1962 జకర్తా ఏషియన్ గేమ్స్ లో రెండు స్వర్ణపతకాలు, 1964లో కలకత్తాలో జరిగిన నేషనల్ గేమ్స్ లో రజతపతకం సాధించారు మిల్కాసింగ్.

    ఓవైపు ఆర్మీ జవానుగా దేశసేవచేస్తూ.. మరోవైపు క్రీడాకారుడిగా దేశ కీర్తి ప్రతిష్టలను పెంచిన మిల్కాసింగ్.. మరో క్రీడాకారిణిని వివాహం చేసుకుని.. క్రీడలపట్ల తనకున్న ఇష్టాన్ని చాటిచెప్పారు. మిల్కాసింగ్ సతీమణి నిర్మల్ సైనీ ప్రముఖ వాలీబాల్ క్రీడాకారిణి. 1955లో శ్రీలంకలో పర్యటించిన భారత మహిళా వాలీబాల్ జట్టుకు కెప్టెన్ గా సేవలందించారు. యాదృచ్ఛికమేమిటంటే.. మిల్కా సింగ్ సతీమణి నిర్మల్ కూడా కొవిడ్ అనంతర సమస్యలతోనే ఇటీవలే ప్రాణాలు కోల్పోయారు. ఆమె తుదిశ్వాస విడిచిన కేవలం ఐదు రోజులకు.. మిల్కాసింగ్ కూడా అదే సమస్యతో ప్రాణాలు వదిలారు. మిల్కా దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు సంతానం. మిల్కాసింగ్ కుమారుడు జీవ్ మిల్కాసింగ్ సైతం క్రీడాకారుడే. దేశంలో ప్రముఖ గోల్ఫ్ ఆటగాళ్లలో జీవ్ ఒకరు. ఇక మిల్కాసింగ్,.. తన కూతురు సోనియా సాన్వాలికా సహకారంతో.. ‘ది రేస్ ఆఫ్ మై లైఫ్’ ఆటోబయోగ్రఫీ రాశారు. ఈ పుస్తకం ఆధారంగానే 2013లో ‘భాగ్ మిల్కా భాగ్’ సినిమా తీశారు. రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో.. ఫర్హాన్ అక్తర్ మిల్కా పాత్రలో ఒదిగిపోయారు. వందకోట్ల గ్రాస్ ను రాబట్టిన ఈ చిత్రం.. నేషనల్ అవార్డుతో పాటు ఐదు ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డులు కూడా గెలుచుకుంది.

    క్రీడలన్నా, దేశమన్నా మిల్కాసింగ్ కు ఎనలేని అభిమానం. 1999 కార్గిల్ వార్‎లో హర్వీందర్ బిక్రమ్ సింగ్ అనే భారత జవాను వీరమరణం పొందడంతో.. ఆయన ఏడేళ్ల కుమారుడిని దత్తతీసుకున్నారు మిల్కాసింగ్. ఇది ఆయన దేశభక్తికి తార్కాణం. సామాజికసేవలోనూ మిల్కా సింగ్ ఎప్పుడూ ముందుండేవారు. తన బయోపిక్ ‘భాగ్ మిల్కా భాగ్’ మూవీ హక్కుల్ని కేవలం ఒక్కరూపాయికే ఇవ్వడమే కాకుండా.. 15 శాతం లాభాలను ఛారిటీకి బదలాయించేలా ఒప్పందం చేసుకున్నారు. అంతేకాదు, నిరుపేద పిల్లల కోసం రోమ్ ఒలింపిక్స్ నాటి తన షూను వేలం వేసి తన దేశభక్తిని చాటుకున్నారు. మిల్కాసింగ్ సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1959లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. మిల్కాసింగ్ భౌతికంగా మనమధ్య లేకపోయినా.. ట్రాక్ పై పరుగులు పెడుతున్న ప్రతి భారతీయ క్రీడాకారుడికి స్ఫూర్తినిస్తూనేవుంటారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడావేదికలపై త్రివర్ణపతాకంలా పైకెగురుతూనేవుంటారు ఓ ‘ఫ్లయింగ్ సిక్’లా.

    Trending Stories

    Related Stories