సత్య నాదెళ్ల కుటుంబంలో ఊహించని విషాదం

0
879

మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెళ్ల , ఆయన భార్య అనుపమ దంపతుల కుమారుడు జైన్ నాదెళ్ల సోమవారం ఉదయం మరణించినట్లు మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ తెలిపింది. అతని వయస్సు 26 సంవత్సరాలు. అతను సెరిబ్రల్ పాల్సీతో జన్మించాడు. ఈ ఘటనతో సత్యనాదెళ్ల కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. జైన్ నాదెళ్లకు పుట్టుకతోనే బ్రెయిన్ పెరాలసిస్ వ్యాధి ఉంది. ఆ వ్యాధితోనే ఆయన బాధపడుతున్నారు. జైన్ మరణించినట్లు మైక్రో సాఫ్ట్ సంస్థ తన ఎగ్జిక్యూటివ్ సిబ్బందికి ఈ-మెయిల్‌లో తెలిపారు. నాదెళ్ల కుటుంబం కోసం ప్రార్థించాలని, వారికి ఏకాంతాన్ని ఇవ్వాలని కోరింది.

2014లో సత్య నాదెళ్ల CEO పాత్రను స్వీకరించినప్పటి నుండి వైకల్యాలున్న వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు ఉత్పత్తుల రూపకల్పనపై కంపెనీని దృష్టి సారించారు. జైన్‌ను పెంచడం, మద్దతు ఇవ్వడంలో తాను నేర్చుకున్న పాఠాలను ఉత్పత్తుల రూపంగా తీసుకుని వచ్చి ప్రపంచంలో ఉన్న ఎంతో మందికి సహాయం చేయాలని సత్య నాదెళ్ల సంకల్పించారు. జైన్ నాదెళ్ల ఎక్కువ భాగం సీటెల్ చిల్డ్రన్స్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటివ్ బ్రెయిన్ రీసెర్చ్‌లో చికిత్స తీసుకున్నాడు.

సత్య నాదెళ్ల, అనుపమ దంపతులకు కుమారుడు జైన్ తోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సత్య నాదెళ్ల హైదరాబాద్ కు చెందిన వారు. ఆయన తండ్రి బుక్కాపురపు నాదెళ్ల యుగంధర్ 1962 బ్యాచ్ ఐఏఎస్ అధికారి కాగా, తల్లి ప్రభావతి సంస్కృత లెక్చరర్. హైదరాబాద్ లోనే పాఠశాల విద్య పూర్తి చేసుకున్న సత్య నాదెళ్ల కర్ణాటకలో మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి ఎంఎస్ కోసం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.