More

    CAA విషయంలో మరో సంచలనం..!

    పౌరసత్వ సవరణ చట్టం విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గుజరాత్‎లో మరో రెండు జిల్లాలకు సిటిజన్‎షిప్ సర్టిఫికెట్లు జారీ చేసేలా అనుమతులనిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. 1955 పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం సాధారణ పౌరుల్లాగే పొరుగు దేశాల నుంచి వలస వచ్చిన ఆరు మతాలకు చెందిన వారికి ఈ సర్టిఫికేట్లు జారీ చేసేందుకు అనుమతులు ఇచ్చారు. గుజరాత్‎లోని మెహ్‎సానా, ఆనంద్ జిల్లాలకు ఈ అనుమతులను జారీ చేస్తూ హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.

    అయితే, పొరుగుదేశాల నుంచి వలస వచ్చిన మైనార్టీ వర్గాలకు మన దేశంలో పౌరసత్వం కల్పించే విషయంలో.. కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో గుజరాత్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, హరియాణా, పంజాబ్‌లోని అనేక జిల్లాలకు ఈ విధమైన అనుమతులనిచ్చింది కేంద్రం. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఉండే పొరుగు దేశాల మైనార్టీలకు మరింత సులభంగా భారతీయ పౌరసత్వం లభించే వీలు కలుగుతుంది. 2016, 2018, 2021 సంవత్సరాల్లో విడతల వారీగా కొన్ని జిల్లాలకు అనుమతులనిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని పరిధిని మరింతగా పెంచేందుకు తాజాగా మరో రెండు జిల్లాల కేంద్రాలకు అనుమతిని కల్పించింది. అయితే భారత్‎ను ఆనుకుని ఉన్న దేశాల్లోని మైనార్టీలకు త్వరితగతిన పౌరసత్వం కల్పించేందుకు 2019లో కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టంలో మార్పులు తీసుకువచ్చింది. అప్పటిదాకా ఉన్న నిబంధనల ప్రకారం దేశంలోకి ప్రవేశించిన 11 సంవత్సరాల వరకు వీరికి పౌరసత్వం లభించేది కాదు. కానీ, 2019లో మోదీ ప్రభుత్వం చేసిన సవరణ ప్రకారం కేవలం ఐదేళ్లకే వీరికి భారత పౌరసత్వం కల్పించేలా వీలుకల్పించారు. ఈ చట్టం భారత్‎ను ఆనుకుని ఉన్న దేశాలైన పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‎లో ఉన్న మైనార్టీలకు వర్తిస్తుంది.

    ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం మానవతా దృక్ఫథంతో తీసుకువచ్చింది. భారత్ నుంచి విడిపోయిన ఈ దేశాలు తర్వాత మతపరమైన రాజ్యాలుగా అవతరించాయి. అన్ని దేశాలూ ఇస్లామిక్ రాజ్యాలుగా కావడంతో ఆయా దేశాల్లో ఇస్లామేతరులపై తీవ్ర అణచివేత కొనసాగుతోంది. బలవంతపు మతమార్పిడులకు పాల్పడటంతో ఆయా దేశాల్లో మైనార్టీల జనాభా రోజురోజుకీ పడిపోతోంది. ఈ అణచివేతను తట్టుకోలేక వీరందరూ భారత్‎కు వలస వస్తున్నారు. అయితే భారత్‎లోకి ప్రవేశించినా.. వీరికి 11 ఏళ్ళ వరకు భారత పౌరసత్వం వచ్చేదికాదు. దీంతో వీరిపై మానవతా దృక్పథంతో వ్యవహరించి పౌరసత్వ చట్టంలో కేంద్ర ప్రభుత్వం సవరణ తీసుకొచ్చింది. 11 ఏళ్ళ కాలాన్ని ఐదేళ్ళకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికనుగుణంగానే తర్వాతి సంవత్సరాల్లో ఇతర దేశాల మైనార్టీలు ఎక్కువగా జీవించే జిల్లాల కలెక్టర్లకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు అనుమతులు తీసుకు వచ్చింది. ఇందులో భాగంగానే తాజాగా మరో రెండు జిల్లాలకు సైతం ఈ అనుమతులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

    అయితే ఈ పౌరసత్వం పొందడానికి ఆయా దేశాల మైనార్టీలు భారత్‎లో స్థిరపడి ఐదేళ్ళు పూర్తి కావాల్సి ఉంటుంది. ఆ సమయంలో వీరు ఎటువంటి నేరాలకు పాల్పడకుండా, కేసులు లేకుండా ఉండాల్సి ఉంటుంది. అటువంటి వారు తమ పౌరసత్వాన్ని ఆన్‎లైన్‎లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్లను జిల్లా కలెక్టర్ సమీక్షించి దానిని అప్రూవ్ చేయడమో లేక తిరస్కరించడమో జరుగుతుంది. దీన్ని అప్రూవ్ చేస్తే కేంద్ర హోంశాఖకు పంపడం జరుగుతుంది. తర్వాత కేంద్ర హోంశాఖ వీటిని క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన వారికి పౌరసత్వం ఇవ్వడం జరుగుతుంది. ఈ చట్టం ద్వారా ఇప్పటికే కొన్ని వేలమంది మైనారిటీ శరణార్థులు భారత పౌరసత్వం పొందారు. ఒక్క గుజరాత్ లోనే ఇప్పటివరకు 1032 మంది పాకిస్తానీ శరణార్థులు భారత పౌరసత్వం పొందినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

    Trending Stories

    Related Stories