కేరళలో బీజేపీ దూకుడు పెంచింది. ప్రచారంలోనే కాదు.. అభ్యర్థుల ఎంపికలోనూ దూసుకుపోతోంది. దేవభూమిలో ఎలాగైనా జెండా ఎగరేయాలని దృఢ సంకల్పంతో వున్న కమలనాథులు.. వ్యూహాత్మక నిర్ణయాల్లోనూ ప్రత్యర్థులకన్నా ముందున్నారు. ఓవైపు మేథోవర్గాన్ని పార్టీలోకి ఆహ్వానిస్తూనే.. మరోవైపు యువతకు పెద్దపీట వేస్తూ.. ముందుకు సాగుతున్నారు. తాజాగా సీఎం అభ్యర్థిని కూడా ప్రకటించి.. ఎన్నికల సమరాన్ని మరింత రంజుగా మార్చారు.
కేరళ సీఎం అభ్యర్థిగా ఇటీవలే పార్టీలో చేరిన ‘మెట్రో మ్యాన్’ ఇ. శ్రీధరన్ పేరును ప్రకటించింది బీజేపీ అధిష్టానం. రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా.. బీజేపీ నిర్వహిస్తున్న విజయ్ యాత్రలో రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్.. శ్రీధరన్ పేరును ప్రకటించారు. అంతేకాదు, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను కూడా పార్టీ త్వరలోనే ప్రకటిస్తుందని తెలిపారు.
ఇదిలావుంటే, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను సిద్దంగా ఉన్నానని.. పార్టీలో చేరకముందే శ్రీధరన్ ప్రకటించారు. అయితే, ఏ నియోజకవర్గం నుండి పోటీ చేయాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. బీజేపీ అధిష్టానం ఎక్కడి నుంచి పోటీచేయమన్నా చేయడానికి సిద్ధంగా వున్నానని తెలిపారు. తాను ఏ సీటులోనైనా పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నట్టుగా చెప్పారు. కేరళలో బీజేపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని బలంగా నమ్ముతున్నానని శ్రీధరన్ అన్నారు. తాను డోర్ టు డోర్ ప్రచారం చేయనని.. కానీ, తన సందేశం మాత్రం ఓటర్లకు చేరుతుందని చెప్పారు.
దేవభూమిలో వేళ్లూనుకుని ఉన్న వామపక్ష, కాంగ్రెస్ పార్టీలను ఎదుర్కొనేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందుకే వివాద రహితుడైన, అన్ని వర్గాల్లో మంచి పేరు, గుర్తింపు ఉన్న శ్రీధరన్ ను సీఎం అభ్యర్థిగా తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది. సీఎం అభ్యర్థిగానే కాదు, 16 మంది సభ్యుల ఎన్నికల కమిటీలోనూ మెట్రో మ్యాన్ కు చోటు కల్పించింది బీజేపీ అధిష్టానం. నిజానికి, తాను బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించిన రోజునే.. సీఎం కావాలన్న తన ఆసక్తిని ఓ మీడియా పంచుకున్నారు శ్రీధరన్. బీజేపీ అధికారంలోకి వస్తే తాను ముఖ్యమంత్రిని అవుతానని వెల్లడించారు. అప్పుల ఊబి నుంచి బయట పడేడమే తన లక్ష్యమని తెలిపారు. అలాగే, అభివృద్ధికి మౌలిక వసతులు కల్పించాలని శ్రీధరన్ చెప్పారు. ముఖ్యమంత్రే ఎందుకు అవ్వాలనుకుంటున్నారు..? గవర్నర్ అవ్వొచ్చు కదా..? అని ప్రశ్నకు కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. గవర్నర్ గిరీ కంటే తాను ముఖ్యమంత్రిగా వుంటేనే రాష్ట్రానికి ఎక్కువ సేవ చేయగలనన్నారు. రాజ్యాంగబద్ధ పదవి అయిన గవర్నర్‌కు పెద్దగా అధికారాలు ఉండవని కుండబద్దలు కొట్టారు.
ఇక, పార్టీలో చేరికకు ముందు ఓ స్థానిక మీడియా ఛానెల్‌తో మాట్లాడిన శ్రీధరన్.. తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలనుకుంటున్న తాను.. ఒక్కడిగా ఏమీ చేయలేను కాబట్టే బీజేపీలో చేరుతున్నట్టు తెలిపారు. బీజేపీ అన్ని పార్టీలకన్నా విభిన్నమైన పార్టీ అని.. అందుకే ఆ పార్టీలో చేరుతున్నానని తెలిపారు. వృత్తిపరమైన అంశాలను పక్కనబెట్టి పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి సారిస్తానని అన్నారు. బీజేపీ వస్తేనే కేరళ ప్రజలకు న్యాయం జరుగుతుందన్న ఆయన.. పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీచేస్తానని అప్పుడే ప్రకటించారు. ఊహించినట్టుగానే పార్టీలోకి రాగానే.. ఎమ్మెల్యే అభ్యర్థిత్వమే కాదు.. ఏకంగా సీఎం అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ అధిష్టానం.
శ్రీధరన్ ను సీఎం అభ్యర్థిగా ఎన్నుకోవడంతో.. కేరళలో బీజేపీ మరింత బలోపేతమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే, కేరళలోని అన్ని వర్గాల్లోనూ శ్రీధరన్ కు సౌమ్యుడిగా మంచి పేరుంది. శ్రీధరన్ కు ‘మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పేరుంది. దేశంలో మెట్రో రైల్వే వ్యవస్థకు రూపకల్పన చేసింది ఈయనే. వృత్తిరీత్యా సివిల్ ఇంజినీరైన శ్రీధరన్.. మన దేశంలో ప్రజా రవాణా ముఖచిత్రాన్నే సమూలంగా మార్చేశారు. ఈయన సారథ్యంలో కొంకణ్ రైల్వేతో పాటు ఢిల్లీ మెట్రో నిర్మాణం జరిగింది. శ్రీధరన్ గైడెన్స్‌లోనే లక్నో మెట్రో రికార్డు టైమ్‌లో పూర్తయింది.
అంతేకాదు, సొంత రాష్ట్రం కేరళలోని కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ ప్రాజెక్టుకు ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. భారతీయ రైల్వేల అభివృద్ధికి ఎంతో కృషి చేసిన శ్రీధరన్.. ప్రభుత్వ కార్యకలాపాలను, రాజకీయాలను చాలా దగ్గర్నుంచి చూశారు. ఈ అనుభవం తమకు లాభిస్తుందని బీజేపీ భావిస్తోంది. 140 సీట్లు కేరళ అసెంబ్లీలో ఏప్రిల్ 6న ఒకే దశలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో శ్రీధరన్ మార్కు కచ్చితంగా వుంటుందని రాజకీయ నిపుణులు అంచనావేస్తున్నారు.