ఫేస్ బుక్ అంటే తెలియని వారు ఉండరు. ప్రపంచ వ్యాప్తంగా విరివిగా ఇంటర్నెట్ ఉపయోగించే జనాల్లో వారిలో సగానికి పైగా జీవితంలో ఓ భాగమైంది ఫేస్‌బుక్ లేదా ఎఫ్‌బీ.
బ్లూరంగులో కనిపించే ఫేస్‌బుక్ టికర్ ఇకపై మనకు కనిపించదు. రాబోయే రోజుల్లో సెర్చ్ ఇంజన్లలో ఫేస్‌బుక్ అని టైప్ చేస్తే పేజీలు దొరక్కపోవచ్చు. ఎందుకంటే ఇకపై ఫేస్‌బుక్ స్థానంలో మెటా కనిపించబోతుంది. హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్థిగా ఉన్న రోజుల్లో మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్‌ను 2004లో ప్రారంభించాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ అందరి స్మార్ట్‌ఫోన్లలో ఓ భాగమైంది ఫేస్‌బుక్. ఇప్పుడు మనం చూస్తున్న ఫేస్‌బుక్ లోగో, టిక్కర్ అంతా 2012లో పబ్లిక్ ఇష్యూకి వెళ్లినప్పుడు డిజైన్ చేసింది. గడిచిన పదేళ్లుగా ఇదే లోగో, టిక్కర్‌తో ఎఫ్‌బీ కనిపిస్తోంది. కానీ ఇకపై ఇది కనుమరుగు కానుంది.
ఫేస్‌బుక్‌తో ప్రయాణం ప్రారంభించిన మార్క్ జుకర్‌బర్గ్ ఆ తర్వాత వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లను సొంతం చేసుకుని ప్రపంచంలోనే అతి పెద్ద సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌గా ఫేస్‌బుక్‌ను తీర్చిదిద్దారు. అక్కడితో మార్క్ ప్రణాళికలు ఆగిపోలేదు. వాస్తవ ప్రపంచానికి దీటుగా టెక్నాలజీ సాయంతో మరో మాయ ప్రపంచానికి రూకలప్పన చేశాడు. దానికి మెటావర్స్‌గా పేరు పెట్టుకున్నాడు. మెటాపై నమ్మకంతో ఫేస్‌బుక్ కంపెనీ పేరుకూడా మెటా 2021 అక్టోబరులో మార్చేశాడు.
ఫేస్‌బుక్, ఇన్‌స్టా, వాట్సాప్ ఇవన్నీ టూడీ సెంట్రిక్ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్. కానీ మెటావర్స్ ఇందుకు విరుద్ధం. అందుకే మెటా మీదనే ఫోకస్ చేస్తూ ఇప్పటికే కంపెనీ పేరు మెటాగా మార్చాడు జుకర్‌బర్గ్. ఇప్పుడు దాన్ని మరింత విస్త్రృతం చేసే లక్ష్యంతో ఫేస్‌బుక్ టిక్కర్ , లోగోల స్థానంలో మెటా లోగో, టిక్కర్‌లను మనుగడలోకి తీసుకురాబోతున్నట్టు జున్ 9న అమెరికా స్టాక్‌మార్కెట్ నాస్‌డాక్‌కు తెలిపారు. కోట్లాది మంది ప్రజలకు చేరువైన ఫేస్‌బుక్ టికర్, లోగోలను మార్చితే ఏమవుతుందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జనంలోకి విస్త్రృతంగా చొక్కుకుపోయిన సంస్థల విషయంలో టికర్, లోగోల విషయంలో పెద్దగా ఫరక్ పడదంటున్నాయి మెటా వర్గాలు. కానీ ప్రజల సెంటిమెంట్‌తో ముడిపడిన అంశం కావడంతో నాస్‌డాక్ మరోరకంగా స్పందించింది. టికర్ మార్పు ప్రకటన అనంతరం మెటా షేర్ల విలువకు 6 శాతం మేర కోత పడింది.