More

    అత్యంత కష్టమైన నిర్ణయం తీసుకున్నానని చెప్పి వారందరికీ షాకిచ్చిన జుకెర్ బర్గ్

    పలు టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను సాగనంపుతూ ఉన్నాయి. చెప్పాపెట్టకుండా ఉద్యోగాల నుండి తీసివేస్తూ షాక్ లు ఇస్తున్నాయి. తాజాగా ఫేస్ బుక్ సంస్థ కూడా అదే బాటనే నడుస్తున్నట్లు స్పష్టం చేసింది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ లో 13 శాతం మంది ఉద్యోగులపై వేటు పడింది. ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా చీఫ్ మార్క్ జుకెర్ బర్గ్ ఫేస్ బుక్ లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 13 శాతం ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు. అంటే దాదాపుగా 11 వేల మందిపై ఈ ప్రభావం పడనుంది. ఇది తనకు అత్యంత కష్టమైన నిర్ణయమని, అయినా కూడా సంస్థ ప్రయోజనాల దృష్ట్యా ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని జుకెర్ బర్గ్ తెలిపారు. ఉద్యోగుల తొలగింపునకు గల కారణాలను కూడా జుకెర్ బర్గ్ తన ప్రకటనలో వివరించారు. యాడ్స్ ఆదాయం తగ్గడం వల్ల సంస్థ ఆదాయంపై తీవ్ర ప్రభావం పడిందని ఆయన తెలిపారు. ఫలితంగా కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడంపై దృష్టి సారిస్తున్నామన్నారు. ఈ క్రమంలో ఉద్యోగుల తొలగింపుతో పాటుగా వచ్చే ఏడాది తొలి త్రైమాసికం వరకు నియామక ప్రక్రియను నిలిపివేస్తున్నట్లుగా కూడా ఆయన ప్రకటించారు. ఈ పరిస్థితికి పూర్తి బాధ్యత తనదేనని తనను క్షమించాలంటూ తొలగింపునకు గురైన ఉద్యోగులను కోరారు. తొలగించిన ఉద్యోగులకు కంపెనీ నుంచి ఈ మెయిల్ వస్తుందని, ఆ వెంటనే వారి కంప్యూటర్లకు యాక్సెస్ ను నిలిపివేస్తామని జుకెర్ బర్గ్ తెలిపారు. తీసివేసిన ఉద్యోగులకు 16 వారాల వేతనం ఇవ్వనున్నారు. వారు సంస్థలో పనిచేసిన కాలానికి ఏడాదికి 2 వారాల చొప్పున అదనపు వేతనం ఇవ్వనున్నారు.

    Trending Stories

    Related Stories