దీదీకి వారణాసిలో.. జైశ్రీరామ్ నినాదాలతో హిందూ సంఘాల గ్రాండ్ వెల్కమ్

0
712

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వారణాసిలో హిందూ యువ వాహిని సభ్యులు గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు. జై శ్రీరామ్ నినాదాలు చేయడమే కాక, నల్ల జెండాలను చూపిస్తూ ‘మమతా బెనర్జీ గో బ్యాక్’ వంటి నినాదాలతో స్వాగతం పలికారు. ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏడో దశ ఓటింగ్‌కు ముందు సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులకు ప్రచారం చేసేందుకు దీదీ వెళ్లారు. అఖిలేష్ యాదవ్‌తో కలిసి ఎన్నికల ర్యాలీలో ప్రసంగించేందుకు మమతా బెనర్జీ వారణాసికి వచ్చినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. మమతా బెనర్జీ కాన్వాయ్ ను అడ్డుకున్న వ్యక్తులు జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ ఉన్న అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇండియా అన్‌టోల్డ్ అనే ట్విటర్ యూజర్ అలాంటి ఒక వీడియోను పోస్ట్ చేశారు. అందులో పోలీసులు కొంతమంది కార్యకర్తలను వెంబడించడం కనిపించింది. హిందూ యువ వాహిని నాయకులు కార్యకర్తలు దీదీని అడ్డుకున్నారు. ‘బెంగాల్‌లో హిందువుల మారణహోమానికి కారణమైన మమతా బెనర్జీ కాశీకి వచ్చారు.. జై శ్రీరామ్ అని బిగ్గరగా నినాదాలు చేయడం ద్వారా, ఈ భారతదేశం సనాతన హిందువుల భూమి అని, హిందువులను అవమానించే బెంగాల్ కాదని ఆమె దృష్టికి తీసుకురావాలనుకున్నాం’ అని హిందూ సంఘాల సభ్యులు తెలిపారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీజేపీ సోషల్ మీడియా కో-కన్వీనర్ శశి కుమార్ తన ట్వీట్‌లో “మమతా బెనర్జీకి వారణాసిలో భారీ నిరసనలు ఎదురయ్యాయి. ప్రజలు ఆమె కాన్వాయ్ ను కదలనివ్వలేదు, జై శ్రీరామ్ నినాదాలతో నల్ల జెండాలతో ఆమెకు స్వాగతం పలికారు. ఆమె షెడ్యూల్ చేసిన చాలా కార్యక్రమాలను రద్దు చేయాల్సి వచ్చింది” అని అన్నారు. ఈ ట్వీట్‌తో పాటు ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు.

3 మార్చి 2022న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నియోజకవర్గం వారణాసిలో సమాజ్‌వాదీ పార్టీ (SP), ఆ మిత్రపక్షాల కోసం ప్రచారం చేయడానికి మమతా బెనర్జీ వచ్చారు. ఐర్హే గ్రామంలో అఖిలేష్ యాదవ్‌తో కలిసి ర్యాలీ నిర్వహించనున్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల చివరి దశలో వారణాసిలోని ఎనిమిది నియోజకవర్గాలతో సహా మొత్తం 54 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి.

మమతా బెనర్జీకి జై శ్రీరామ్ నినాదాలతో నిరసన ప్రదర్శనలు ఎదురవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో హిందూ కార్యకర్తలు వివిధ సందర్భాల్లో ఆమెను ఇలానే అడ్డుకున్నారు. జనవరి 2021లో, కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్ వద్ద నేతాజీ జయంతి వేడుకల సమయంలో అక్కడ ఉన్న ప్రజలు జైశ్రీరాం నినాదాలు చేయడంతో దీదీకి చాలా కోపం వచ్చింది. ప్రసంగించడానికి నిరాకరిస్తూ ఆమె వేదిక నుండి దిగిపోయారు. అదే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొన్నారు.