ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు ముగిసాయి. ఉదయగిరిలోని మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలను నిర్వహించారు. గౌతం రెడ్డి కుమారుడు కృష్ణార్జునరెడ్డి తండ్రి చితికి నిప్పంటించారు. అంత్యక్రియల్లో ఏపీ సీఎం జగన్‌తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలోని మంత్రి ఇంటి నుంచి ప్రారంభమైన అంతిమ యాత్ర జొన్నవాడ, బుచ్చిరెడ్డి పాలెం, సంగం, వాసిలి, నెల్లూరు పాలెం , డీసీపల్లి, మర్రిపాడు, బ్రాహ్మణపల్లి మీదుగా ఉదయగిరిలో మేకపాటి రాజమోహనరెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ వరకు సాగింది. దారిపోడువునా అభిమానులు, నియోజకవర్గ కార్యకర్తలు తమ నేతకు నివాళులర్పించారు. సీఎం జగన్ దంపతులు తాడేపల్లి నివాసం నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఉదయగిరికి చేరుకుని మంత్రి మేకపాటి అంతియ సంస్కారాల్లో పాల్గొని మంత్రి పార్ధివాదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాలర్పించారు.
మేకపాటి గౌతమ్ రెడ్డి కుమారుడు కృష్ణార్జున రెడ్డి మంగళవారం రాత్రి 11 గంటల తర్వాత నెల్లూరు నగరంలోని నివాసానికి చేరుకున్నారు. అమెరికా నుంచి నేరుగా ఆయన చెన్నై చేరుకుని అక్కడి నుంచి నెల్లూరుకు వచ్చారు. అప్పటికే మంత్రి మేకపాటి భౌతిక కాయాన్ని మంత్రి చాంబర్‌లో ఉంచారు. తన తండ్రి భౌతిక కాయంతో తనను ఏకాంతంగా వదిలేసి అందరూ బయటికెళ్లాలని కృష్ణార్జునరెడ్డి కోరారు.