More

  ముఖ్యమంత్రి ఇంటిపైకి పెట్రోల్ బాంబుతో దాడి..!

  మేఘాలయలో నేషనల్ లిబరేషన్ కౌన్సిల్‌(హెచ్‌ఎన్‌ఎల్‌సీ) మాజీ నేత చెరిష్‌స్టార్ఫీల్డ్ థాంగ్‌కీని పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంతో.. హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. థాంగ్‌కీ మద్దతుదారులు ప్రభుత్వ వాహనాలపై దాడులు చేశారు. ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా వ్యక్తిగత నివాసంపై ఆదివారం ఆందోళనకారులు పెట్రోల్ బాంబులు విసిరారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 3 వ మైలు ఎగువ షిల్లాంగ్‌లోని లైమర్‌లోని ముఖ్యమంత్రి వ్యక్తిగత నివాసం వద్ద ఈ దాడికి పాల్పడ్డారు. రెండు మోలోటోవ్ కాక్‌టైల్ బాటిళ్లను సీఎం నివాసంపై విసిరారు. వీటిలో మొదటి బాటిల్ ఇంటి ముందు భాగంలో పడగా.. రెండవది పెరడు వెనుకన పడింది. ఇది గమనించిన గార్డులు వెంటనే అక్కడకు చేరుకుని మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు.

  రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటలనకు బాధ్యత వహిస్తూ మేఘాలయ హోంమంత్రి లక్మెన్ రైంబుయ్ తన పదవికి రాజీనామా చేశారు. తనను హోం శాఖ నుంచి రిలీవ్ చేయాలని కోరుతూ సీఎం కాన్రాడ్ సంగ్మాకు లేఖ రాశారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి ఫ్యాక్స్‌ ద్వారా పంపారు. థాంగ్‌కీని ఇంటిపై పోలీసులు దాడి చేసి తీసుకెళ్లి ఆపై ఎన్‌కౌంటర్‌లో చంపేశారని తన రాజీనామా పత్రంలో రింబూయ్‌ ఆరోపించారు. పోలీసులు పరిమితులను దాటి ప్రవర్తించారని ఆరోపించారు. ఈ సంఘటన చూసి తానెంతగానే ఆశ్చర్యపోయానని, ఈ సంఘటనపై స్వతంత్ర, న్యాయ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి 8 గంటల నుంచి మంగళవారం రాత్రి వరకు కర్ఫ్యూ విధించారు. నాలుగు జిల్లాల్లో మొబైల్ ఇంటర్‌నెట్‌ సేవలను ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి.. 48 గంటల పాటు నిలిపివేశారు అధికారులు.

  చెస్టర్‌ఫీల్డ్ థాంగ్‌కీ 2018 లో లొంగిపోయారు. ఇటీవల లైతుంఖ్రా వద్ద చోటు చేసుకున్న పేలుడులో ఆయన పాత్రపై ఆధారాలు లభించడంతో ఆగస్టు 13 పోలీసులు అతని ఇంట్లో దాడులు నిర్వహించారు. మరిన్ని ఆధారాలు లభిస్తాయని పోలీసులు భావించారు. ఆ సమయంలో థాంగ్‌కీ పోలీసులపై కత్తితో దాడి చేయాలని చూశాడని.. ఈ క్రమంలో అతడిని ఎదుర్కొవడానికి జరిపిన కాల్పుల్లో థాంగ్‌కీ మృతిచెందాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై థాంగ్‌కీ కుటుంబ సభ్యులతో పాటు, మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. థాంగ్‌కీ అంత్యక్రియల్లో వందలాది మంది ఆయన మద్దతుదారులు నల్ల జెండాలతో నిరసన తెలియజేశారు. ఆందోళనకారులు పోలీసుల పైకి రాళ్లు విసరడంతో మొదలైన ఈ హింసాత్మక ఘటనలు.. కొన్ని గంటల్లోనే తీవ్రంగా మారిపోయాయి.

  మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా థాంగ్‌కీ మరణంపై విచారణకు ఆదేశించినున్నట్టు చెప్పారు. ఈ ఘటనను మేఘాలయ మానవ హక్కుల సంఘం సుమోటో కేసుగా విచారణకు స్వీకరించింది. దీనిపై 15 రోజుల్లోగా సమగ్ర నివేదిక అందించాల్సిందిగా చీఫ్ సెక్రటరీని కోరింది.

  Trending Stories

  Related Stories