ప్రముఖ నటి మీనా కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యం బారినపడి గత కొన్ని నెలలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె భర్త విద్యాసాగర్ గత రాత్రి చెన్నైలో మృతి చెందారు. విద్యా సాగర్ వయసు 48 సంవత్సరాలు.
జనవరిలో మీనా కుటుంబం కరోనా బారినపడింది. ఆ తర్వాత వారు కోలుకున్నప్పటికీ విద్యాసాగర్ మాత్రం కోలుకోలేకపోయారు. చెన్నైలోని ఆసుపత్రిలో చేర్చారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో గత రాత్రి కన్నుమూశారు. విద్యాసాగర్ మరణవార్త తెలిసి చలనచిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. విషయం తెలిసిన సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. విద్యాసాగర్ అంత్యక్రియలు నేడు చెన్నైలో జరగనున్నాయి. బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన విద్యాసాగర్‌ను 2009లో మీనా వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమార్తె ఉంది.
మీనా చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లో తన కెరీర్‌ను ప్రారంభించింది. 90వ దశకం మరియు 2000వ దశకంలో టాప్ హీరోయిన్ గా నిలిచింది. సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమకు చెందిన ఎంతో మంది స్టార్స్ తో ఆమె నటించింది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తరువాత, ఆమె తన వయస్సుకు తగ్గ పాత్రలను సినిమాల్లో పోషించడం ప్రారంభించింది. మీనా అడుగుజాడల్లో, కుమార్తె నైనికా కూడా చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెరపైకి వచ్చింది. ఆమె బ్లాక్ బస్టర్ మూవీ ‘తేరి’లో విజయ్ కూతురి పాత్రను పోషించింది.