సోదర భావంతో భారత్ అందించిన సాయానికి శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ్ సింఘే కృతజ్ఞతలు తెలిపారు. భారత్ సాయం తమ దేశానికి చేరిందని, పాలపొడి, బియ్యం, ఔషధాలు వంటి 2 బిలియన్ల విలువైన మానవతా సహాయాన్ని అందించినందుకు భారత్, అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు మా హృదయపూర్వక కృతజ్ఞతలని ట్వీట్ చేశారు.
ఈ సరుకులను తమ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేస్తుందని కొలంబో ఒక ప్రకటనలో వెల్లడించింది. 9 వేల మెట్రిక్ టన్నుల బియ్యం, 50 మెట్రిక్ టన్నుల పాలపొడి, 25 మెట్రిక్ టన్నులకు పైగా మందులు, ఇతర ఔషధాలు వంటి 2 బిలియన్ రూపాయల విలువైన అత్యవసర వస్తువులను భారత్ శ్రీలంకకు అందించింది.
శ్రీలంకకు భారత్ పెద్దన్న వంటిదని మాజీ క్యాబినెట్ మంత్రి నమల్ రాజపక్సే తెలిపారు. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న తమ దేశానికి మానవతా సాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సోదరభావంతో భారత్ అందించిన సహాయాన్ని ఎప్పటికీ మరిచిపోలేమని నమల్ రాజపక్సా అన్నారు. ప్రధాని మోడీ, గౌరవ ముఖ్యమంత్రి స్టాలిన్‌కు కృతజ్ఞతలని అన్నారు. మాజీ ప్రధాని మహీంద రాజపక్సా కుమారుడైన నమల్ రాజ్‌పక్సా గతంలో క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు.
మరోవైపు ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకను మరో కీలక అంశం కలవరపెడుతోంది. ఇప్పటికే ఆ దేశంలో ఔషధాల కొరత నెలకొంది. ఈ నేపథ్యంలో అత్యవసర ఆపరేషన్లను సైతం వాయిదా వేయాల్సి వచ్చింది. దేశంలో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మందులు లేక రోగుల ఆరోగ్యం నానాటికీ క్షీణిస్తోందని… తక్షణమే ఔషధ సరఫరాను పెంచకపోతే రోగులు పెద్ద సంఖ్యలో మరణించడం తప్పదని హెచ్చరిస్తున్నారు.
మరోవైపు శ్రీలంకలో విదేశీ కరెన్సీ రిజర్వులు కూడా తగ్గిపోవడంతో… ఔషధాలను దిగుమతి చేసుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదు. దాదాపు 180 రకాల ఔషధాల కొరత ఉందని ఔషధాల సరఫరా విభాగంలో పని చేస్తున్న ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యాధికారుల సంఘం అధికార ప్రతినిధి డాక్టర్ వాసన్ రత్నసింగం మాట్లాడుతూ… పెట్రోల్, వంట గ్యాస్ కోసం క్యూలైన్లలో నిల్చున్నట్టు ఔషధాల కోసం నిల్చునే పరిస్థితి ఉండదని చెప్పారు. చికిత్స ఆలస్యమైతే ప్రాణాలు పోతాయని అన్నారు.