ఇప్పుడు కార్పోరేట్ ఆస్పత్రులు పిశాచులు సంచరించే శ్మశానాలుగా మారినప్పుడు ఆనందయ్య మందు “ఆనందో బ్రహ్మ” కాక మరి ఏమిటి..? డాక్టర్ల దగ్గరకు వెళ్ళినప్పుడు జ్వరం, దగ్గు, జలుబు ఉన్నాయి అని రోగి చెప్పకుండా, నాకు నాలుగు ఎకరాల పొలం, మూడు లక్షల బ్యాంకు బ్యాలెన్స్, ఇద్దరు ఎద్దుల్లా పనిచేసే కొడుకులు ఉన్నారని చెప్పాల్సిన దుస్థితి..!? ఖర్మ రా బాబూ.. ప్లాస్మా వైద్యం, రెమ్డెసివిర్ సూపర్ అన్నారు. తర్వాత తుస్సుమన్నారు కదా..! ఇప్పుడు మనల్ని చంపేందుకు బ్లాక్ ఫంగస్, వైఫ్ ఫంగస్ ఎన్ని రోగాలో.. వాటిని తగ్గించేందుకు ఎన్ని మందులో..! తెలియనంత కన్ఫ్యూజన్.
దీనమ్మ జీవితం.. ఏదో చీకట్లో దీపంలా ఆనందయ్య కనిపించాడు. క్యూలు కట్టారు. అయినా తెలుగు టీవీలకు
ఏం మాయ రోగం..? ఇది కరోనా కన్నా ఘోరం..!! అయ్యో..! ఇంకా జన విజ్ఞాన వేదిక వాళ్ళు రంగంలోకి దిగలేదు. వెంటనే ఆపేందుకు..!! నెల్లూరు జనవిజ్ఞాన వేదిక వాళ్లు మాత్రం ప్రకటన చేశారు.. ఈ మందు తక్షణం ఆపేయాలని..! గుడ్డిలో మెళ్లలా సీపీఐ నారాయణ మాత్రం మద్దతు ప్రకటించాడు. ఆశ్చర్యం.. హమ్మయ్య.. ఆయుర్వేదం మంచిది అని చెప్తే ఈ దేశంలో జాతీయ వాదానికి లాభం జరుగుతుందని ఇక్కడా రాజకీయమే..! కొందరు గమ్మున కూర్చున్నారు.
అయ్య బాబోయ్.. అల్లోపతి క్రైస్తవులదని, యునానీ ముస్లింలదనీ.. ఆయుర్వేదం హిందువులదనీ అజ్ఞానం.. అసలు యునానీ ఏ దేశంలో ఉందో కూడా తెలియదు.. యునానీతో ముస్లిం దేశాలకు సంబంధమే లేదు. కానీ, అరబ్బుల వాడకం వల్ల అదేదో ముస్లిం వైద్యం అయి కూర్చుంది. యునానీ ఉన్నది గ్రీకులో.. అలాగే యూరోప్ దేశాలతో పాటు ఎన్నో దేశాలు ఎంతో కష్టపడి అలోపతిని అభివృద్ధి చేసినా.. అది క్రైస్తవుల వైద్యం అయింది. ఇన్ని శషభిషలు మధ్య ఆనందయ్య అనే అపర ధన్వంతరి.. అశ్వినీ దేవతలే అవతారం ఎత్తి వచ్చినట్టుగా, కృష్ణపట్నంలో అమాయకంగా ఇంటి పేరుతో సహా పరిచయం చేసుకుంటున్నాడు.
నవ గోప్యాలలో “ఆయుర్విత్తం గృహ చిద్రం మంత్ర ఔషధం” 9 రహస్యాలు ఎవరికీ చెప్పకూడదు అని వాటిలో ఔషధం కూడా ఒకటి పెట్టారు. అలాగే “నట విట గాయక గణికా వచ స్సీధురసం గ్రోలేడు చెవికిన్ కటువీ శాస్త్రము” అని ఎవరికి ఆయుర్వేదం చెప్పకూడదో బ్రహ్మ మిత్రుడు అనే గురువు మనుచరిత్రలో చెప్తాడు. కానీ, పాపం ఆనందయ్య పిప్పళ్ళు తోక మిరియాలు వేపాకు మామిడాకు అల్లం పసుపు పట్టా.. ఇలా దినుసులన్నీ ఓపెన్ గా చెప్పేస్తున్నాడు. ఇప్పుడు ఎంతమంది సగం సగం వైద్యం తెలిసినవాళ్ళు ఈ దినుసులతో నకిలీ మందులు తయారు చేస్తున్నారో చెప్పలేం.
అయినా గతంలో తమిళనాడుకు చెందిన రామన్ పిళ్లై మూలికలతో పెట్రోల్ చేస్తానని అని ముందుకు వచ్చాడు. చివరకు అతనినీ నేరస్తుడిని చేశారు. అలాగే 2014లో మణికందన్ అనే తమిళ యువకుడు రథం అనే స్కూటర్ తయారు చేసి సింగిల్ చార్జీతో నాలుగు వందల కిలోమీటర్ల ప్రయాణం చేసేలా దాని రూపొందించాడు. ఆఖరికి చెన్నైలోని ఒక సంస్థ మేధో హక్కుల కింద ఫిర్యాదు చేసి అతనినీ మింగేసింది.
అదేవిధంగా బాలరాజు మహర్షి అనే గొప్ప వైద్యుడిని చచ్చేవరకు మనం ఎవరు గుర్తించలేదు. జర్మన్ వాళ్లు తీసుకెళ్లి అతనితో పుస్తకాలు రాయించి, ఆయన ఔషధాలతో డ్రగ్స్ తయారు చేసుకున్నారు. ఆయన మరణించే ముందు తిరుమల తిరుపతి దేవస్థానం వారికి ఎలా బుద్ధి పుట్టిందో తెలియదు కానీ “బాలరాజు మహర్షి గృహ వైద్యం” పేరుతో ఆయన పుస్తకాలు ప్రింట్ చేసింది. పోయిన సంవత్సరం. రాందేవ్ బాబా తిప్పతీగ మొదలైన వాటితో ఒక ఔషధం తయారు చేస్తే, వెంటనే దానిపై విషం కక్కారు. పెప్సీ లాగా తమ దుకాణం బంద్ అవుతుంది అనుకున్నారు. వెంటనే దాడి..!? బత్తిన సోదరుల చేప మందు జన విజ్ఞాన వేదిక తమ అజ్ఞానాన్ని మొత్తం ఉపయోగించి బందు చేయించే ప్రయత్నం చేసింది. అయినా మృగశిర కార్తె నాడు లక్షల మందికి అది ప్రసాదం పేరుతో అందుతుంది.
అయినా వీళ్ళు మాట్లాడితే “మందు రహస్యాలు” చెప్పమంటారు. ఆయుర్వేదంలో కలిపే ప్రతి వస్తువుతో పాటు ఆ వైద్యుల హస్తవాసి ఉంటుంది. ప్రతి మొక్కకు నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రం రోజే అది సేకరించాలి. ఇంగ్లీష్ మందుల్లో ఏ ఇంగ్రీడియంట్స్ కలిపి చేస్తున్నారు. అన్న విషయం ఎవరైనా అడిగారా..? వాటి సైడ్ ఎఫెక్ట్స్ ను ఎప్పుడైనా పరిశీలించారా..!? శాస్త్రీయత అంటే.. వీళ్ళు ఏదో శాంకవకుప్పే గర్భం నుంచి పుట్టినట్టు.. మెడలో స్టెతస్కోప్ వేసుకుని అవతారమెత్తినట్లు.. మైక్రోస్కోపు నెత్తిమీద పెట్టుకుని తిరుగుతున్నట్లు.. ఎదవ ఆర్గ్యుమెంట్.
అసలు కరోనాకు మందు ఉందా..? మరి లక్షలు ఖర్చు అయ్యేటట్లు వైద్యం ఎందుకు చేస్తున్నారు..!? పేదవాళ్ల కుటుంబాలు ఆరి పోతున్నాయి. ఒక్కో ఇంట్లో మూడు నాలుగు పీనుగలు లేస్తున్నాయి. కన్న కొడుకు చస్తే “పుత్రశోకం నిరంతరం” అన్నట్టుగా ముసలి తల్లిదండ్రులు జీవితాంతం ఏడవాల్సిందే. కష్టకాలంలో శ్మశానానికి కూడా వెళ్లలేని దుస్థితి. అయినా నా దీనికంతా కారణమైన చైనాపై ఈగ కూడా వాలనివ్వని చెంచాలు.. ఛీ..! అయినా, నాటు వైద్యం పూర్వం గ్రామాల్లోని నాయీ బ్రాహ్మణులకు ఎవరి నేర్పించారు..? ఆదివాసీలకు పసరు పరిజ్ఞానం ఏ విజ్ఞాన శాస్త్రంలో బోధించారు. పులిప్పాని వైద్యం.. సహదేవ పశువైద్యం.. చరక సంహిత.. సుశ్రుత సంహిత.. రసరత్న సముచ్చయము.. తంత్ర గ్రంధాలు.. ఇవన్నీ.. క్వీన్ విక్టోరియా మహారాణి బాబు వచ్చి రాశాడా..? కేపాల్ కు.. చర్లపల్లికి వెళ్లి చూడండి.. అక్కడ
ఎందరు పల్లెటూరి వాళ్ళు విరిగిన ఎముకలను అతికించుకుని బ్రతికి పోతున్నారో.. సయాటికా మొదలైన కీళ్లనొప్పులకు వరంగల్ వెళ్లి ఆయుర్వేద వైద్యుడిని చూడండి..సేవ ఏంటో తెలుస్తుంది. క్యాన్సర్ కు శివమొగ్గలో తెచ్చిన మందు ఎందరికి జీవం పోస్తుందో.. వాడుతున్న వాళ్ళని అడిగి చూడండి.. పేనుకొరుకుడు వస్తే ఏళ్లకు పైగా వైద్యం చేసే డెర్మటాలజిస్ట్ లు స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. కానీ, ఆదివారంనాడు బెల్లంలో ఆకును దంచి నయం చేస్తున్న ఓ అనామకుడు వికారాబాద్ జిల్లా దోమలో ఉన్నాడు వెళ్లి తెలుసుకోండి. ఇప్పటివరకు ఇంగ్లీష్ వైద్యంలో పచ్చకామెర్లుతో సహా ఎన్నో వ్యాధులకు మందులు లేవు కదా. అంత మాత్రాన ఇంగ్లీషు వైద్యం పనికిరానిది కాదు. అది ఎన్నో అద్భుతాలు సాధించింది. కానీ, అది మాత్రమే గొప్పది మిగతా వాటికి శాస్త్రీయత లేదు అనడం దుర్మార్గం. రామాయణంలో మరణించిన దశరథుడి శరీరాన్ని భరతుడు, కైక తల్లి గారి ఇంటి నుండి వచ్చే వరకు తైల ద్రోణిలో ఉంచారు కదా.. ఇది విజ్ఞానం కాదా..! ఇలాంటివి బోలెడు చెప్పొచ్చు.
విమర్శించేవాళ్ళు ఆనందయ్యను చరకుడు, సుశ్రుతుడుతో పోల్చకండి. కనీసం అతని గొప్పతనం గుర్తించండి. అతడు సామాన్యుడు అయినా అతని చేతి గుణంలో ఏదో గొప్పతనం ఉంది. ఆయుర్వేదంలో నాటు మందులో చేతి గుణమే గొప్ప ప్రతిభ. ఇప్పుడు ప్రభుత్వాన్ని, సాక్షాత్తు ప్రధానమంత్రిని, ఆఖరుకు కార్పోరేట్ వ్యాపారాన్ని తట్టుకున్న రామ దేవ్ ను తిట్టి పోస్తున్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వెనుక ఉన్న శక్తులే.. ఈ ఆనందయ్యను కూడా అమాంతం మింగ చూసే గ్యాంగ్. మెడికల్ మాఫియా నుండి కార్పొరేట్ శక్తుల నుండి ఆనందయ్యను రక్షించుకుందామా..? లేదంటే ఈ ఆనందయ్యనూ మాత్రగా మార్చుకొని మింగేద్దామా..?
– ఆనందయ్య ఆయుర్వేద వైద్యం నేపథ్యంలో.. ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పి. భాస్కరయోగి వ్యాసం