వినాయక చవితి రోజు మాంసం అమ్మకాలపై నిషేధం విధిస్తూ కర్ణాటక ప్రభుత్వం సరికొత్తగా ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్రంలో జంతు వధ మరియు మాంసం విక్రయాలను నిషేధించింది. బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో వినాయక చవితి రోజున మాంసం అమ్మకాలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. వినాయక విగ్రహం వేడుక సమయంలోనూ, నిమజ్జనంలోనూ 20 మందికి మించి పాల్గొనడానికి రాష్ట్రం అనుమతించదని కర్ణాటక ప్రభుత్వం ఇంతకు ముందే తెలిపింది. సెప్టెంబరు 10న జంతువులను చంపడం, మాంసం అమ్మకాన్ని నిషేధిస్తూ బీబీఎంపీ జాయింట్ కమిషనర్ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాత్రి 9 గంటలు దాటిన తర్వాత ఎటువంటి కార్యక్రమాలకూ అనుమతి ఉండదని ప్రభుత్వం జారీచేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ స్పష్టంచేశాయి. కరోనాను కట్టడి చేసేందుకు పండుగ సమయంలో నైట్ కర్ఫ్యూ అమలు జరుగుతుందని ఈ నిబంధనలు తేల్చిచెప్పాయి.
కేవలం మట్టి విగ్రహాలకే అనుమతులు ఉన్నాయని, అలాగే చవితి ఉత్సవాల్లో ఆహారం లేక ప్రసాదం పంపిణీకి కూడా అనుమతించబోమని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో 2శాతం కన్నా ఎక్కువ పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల్లో ఎటువంటి కార్యక్రమాలూ జరగబోవని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం ఐదు రోజుల పాటూ గణేష్ చతుర్థి వేడుకలకు అనుమతి ఇచ్చినప్పటికీ, బీబీఎంపీ మాత్రం మూడు రోజులకి తగ్గించింది. బీబీఎంపీ కమిషనర్, బెంగళూరు పోలీస్ కమిషనర్ కమల్ పంత్ మధ్య చర్చ తర్వాత ఈ ఉత్తర్వు జారీ చేయబడింది.
2020లో కూడా బీబీఎంపీ మూడు రోజుల పాటు గణేష్ చతుర్థి వేడుకలను అనుమతించింది. వార్డులో ఒక గణేష్ విగ్రహం మాత్రమే అనుమతించబడుతుందని బీబీఎంపీ ధృవీకరించింది. పౌర పాలక మండలి అంగీకారం మరియు ఆ ప్రాంతంలోని పోలీసు డిప్యూటీ కమిషనర్ ఆమోదం తర్వాత మాత్రమే దీనికి సంబంధించిన ఏవైనా మార్పులు ఆమోదించబడతాయని బీబీఎంపీ అధికారులు స్పష్టం చేశారు.