మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారం నాడు కుందల్పూర్ సిద్ధ క్షేత్రాన్ని పవిత్ర స్థలంగా ప్రకటించి, అక్కడ మాంసం మరియు మద్యం అమ్మకాలను నిషేధించారు. కుందల్‌పూర్ సిద్ధ క్షేత్రాన్ని పవిత్ర స్థలంగా ప్రకటిస్తున్నానని, ఇక్కడ మాంసం, మద్యాన్ని నిషేధిస్తామని ఎంపీ సీఎం చౌహాన్ చెప్పుకొచ్చారు. “నా జీవితంలో ఏదైనా సమస్య ఎదురైనప్పుడల్లా నేను గురుదేవ్‌ను స్మరించుకుంటాను. ఆయన ఆశీర్వాదంతో నా సమస్య పరిష్కారమైంది” అని కుందల్‌పూర్‌లోని పంచకల్యాణక్ ఉత్సవ కార్యక్రమంలో శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. శివరాజ్ సింగ్ చౌహాన్ తన భార్య సాధనా చౌహాన్‌తో కలిసి దామోహ్ జిల్లా కుందల్‌పూర్‌లో పంచకల్యాణక్ ఉత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. బండక్ పూర్ ప్రాంతాన్ని కూడా ఆయన పవిత్ర స్థలంగా ప్రకటించారు. అక్కడ కూడా మద్యం, మాంసం అమ్మబడవు.
ఆచార్య విద్యాసాగర్ మహరాజ్ స్ఫూర్తితో కుందల్‌పూర్, బండక్‌పూర్‌లను పవిత్ర ప్రాంతాలుగా ప్రకటిస్తున్నామని, ఇక్కడ పూర్తిగా మాంసం, మద్య నిషేధం అమలులో ఉంటుందని సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ అన్నారు. బండక్‌పూర్ పట్టణం శివుని ఆలయానికి ప్రసిద్ధి చెందింది. విద్యాసాగర్ మహారాజ్ కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిలోగా హిందీలో మెడికల్, ఇంజినీరింగ్ సిలబస్‌ను ప్రారంభిస్తుందని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. గోసంరక్షణ కోసం ప్రజలు ముందుకు రావాలని, మంచి పర్యావరణం కోసం మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ నెల ప్రారంభంలో, మధ్యప్రదేశ్ మంత్రి విశ్వాస్ సారంగ్ మాట్లాడుతూ.. వచ్చే విద్యా సంవత్సరం నుండి భోపాల్‌లోని గాంధీ మెడికల్ కాలేజీలో ప్రభుత్వం హిందీలో MBBS సిలబస్‌ను ప్రారంభిస్తుందని చెప్పారు.