కశ్మీర్ ఫైల్స్ ను బ్యాన్ చేయాలంటూ రోడ్డెక్కిన మౌలానాలు, ఇస్లామిక్ లీడర్లు

0
1105

ది కశ్మీర్ ఫైల్స్.. సినిమా ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఓ వర్గం మాత్రం ఈ సినిమాపై గుర్రుగా ఉంది. కొందరు నాయకులు కూడా నిజాలు ప్రపంచానికి తెలిశాయని తెగ బాధపడుతూ ఉన్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ జిల్లాకు చెందిన మౌలానాలు 28 మార్చి 2022న ఆనంద్ నగర్‌లోని ఒక పాఠశాలలో కశ్మీర్ ఫైల్స్‌పై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మౌలానాలు కశ్మీర్ ఫైల్స్ చిత్రం విడుదల చేయడం ఒక దురదృష్టకరమైన పరిణామం అని అన్నారు. అంతేకాకుండా ఈ సినిమా ద్వారా కొందరు రాజకీయం చేస్తున్నారని పేర్కొన్నారు. ముత్తాహిదా మజాలిస్-ఈ-అమాల్ అనే సంస్థ విలేకరుల సమావేశాన్ని నిర్వహించింది. సహరాన్‌పూర్ జిల్లాలోని ముస్లింలు, మదర్సాలు, పాఠశాలలు, కళాశాలలు, ఇతర ముస్లిం సంస్థలను కలుపుకుని మతపరమైన కార్యక్రమాలను ముత్తాహిదా మజాలిస్-ఈ-అమాల్ నిర్వహిస్తుంటుంది.

ది కశ్మీర్ ఫైల్స్ సినిమా ద్వారా మత సామరస్యానికి భంగం కలిగించే ప్రయత్నం జరుగుతోందని ముత్తాహిదా మజాలిస్-ఈ-అమల్ ప్రతినిధి షేర్ షా ఆలం అన్నారు. పరస్పర సోదరభావాన్ని అంతం చేసే ప్రయత్నాలు జరగడం దురదృష్టకరమని అన్నారు. మిల్లీ కౌన్సిల్ జిల్లా అధ్యక్షుడు మౌలానా అబ్దుల్ మాలిక్ ముకేసి, జమియత్ ఉలమా ఉత్తరప్రదేశ్ సభ్యుడు మౌలానా షాహిద్ మజాహిరి తదితరులు విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. జీ నివేదిక ప్రకారం, షేర్ షా ఆజం మాట్లాడుతూ, “ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం గురించి ఈ విలేకరుల సమావేశం జరిగింది. ఈ సినిమా దేశంలో విద్వేషాలు సృష్టిస్తోంది. తక్షణమే ఈ చిత్రాన్ని నిషేధించాలి. మరచిపోయిన పాత జ్ఞాపకాలను మళ్లీ ఎంచుకొని, కట్టుకథలు తయారు చేసి, జనం మధ్యలో వదిలేయడం వల్ల ప్రయోజనం ఏమిటి? ప్రజలు ఒకరినొకరు ద్వేషిస్తారు.. ద్వేషం ఉన్నప్పుడు తగాదాలు, మూక హత్యలు జరుగుతాయి.” అని అన్నారు. ”ఈ చిత్రంలో చారిత్రక అంశాలన్నింటినీ వక్రీకరించారు. శాంతి, సామరస్యాలను కాపాడే మార్గం ఇది కాదు. దేశంలోని ప్రజలు ఒకరినొకరు ద్వేషించకూడదని, తప్పుదారి పట్టించకూడదని మేము కోరుకుంటున్నాము.” అని అన్నారు.

విలేఖరుల సమావేశానికి హాజరైన జర్నలిస్టులు సినిమా గురించి ప్రశ్నలు అడగడం ప్రారంభించడంతో, మౌలానా ఆగ్రహానికి గురయ్యాడు. అంతేకాకుండా జర్నలిస్టుతో గొడవకు దిగాడు. ఇతరులు జోక్యం చేసుకున్న తర్వాత అక్కడి పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. కశ్మీర్ ఫైల్స్ చిత్రం 1990లో కశ్మీర్‌లోని ఇస్లామిక్ టెర్రరిస్టులచే కశ్మీరీ హిందువులపై జరిగిన మారణహోమం, తరువాత వారి వలసల ఆధారంగా రూపొందించబడిన చిత్రం. ఈ చిత్రం 11 మార్చి 2022న విడుదలైంది.