National

కబలించిన కొండచరియలు.. 7 మంది మృతి.. 45మంది జవాన్ల ఆచూకీ గల్లంతు..!

మణిపూర్ లో విషాదం చోటు చేసుకుంది. నోనీ జిల్లాలో తుపుల్ రైల్వే నిర్మాణ శిబిరంపై భారీ కొండచరియలు విరిగిపడటంతో ఏడుగురు మరణించారు. అనేక మంది అదృశ్యమయ్యారు. ఈ ఘటన బుధవారం రాత్రి జరగ్గా, ఈ ఘటనలో మృతి చెందిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మరోవైపు భారత సైన్యం, అస్సాం రైఫిల్స్‌ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టుపుల్ యార్డ్ రైల్వే నిర్మాణ శిబిరం వద్ద కొండచరియలు విరిగిపడిందని, ఇది తమెంగ్‌లాంగ్, నోనీ జిల్లాల గుండా ప్రవహించే ఇజేయి నది ప్రవాహానికి కూడా ఆటంకం కలిగించిందని, ఆనకట్ట లాంటి నిల్వ పరిస్థితిని సృష్టించిందని నోనీ డిప్యూటీ కమిషనర్ హౌలియన్‌లాల్ గైట్ తెలిపారు. సహయక చర్యలు ఇంకా కొనసాగుతుండటంతో, డిప్యూటీ కమిషనర్ సాధారణ ప్రజలు, ముఖ్యంగా పిల్లలు నది దగ్గరకు వెళ్లవద్దని హెచ్చరించారు.

అయితే ఇప్పటి వరకు 7 మృతదేహాలను వెలికితీశారు. రక్షించిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఇంకా 45 మంది తప్పిపోయారని నోనీ జిల్లా ఎస్‌డిఓ సోలమన్ ఎల్ ఫిమేట్ తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం మణిపూర్ సీఎం నిరంతరం టచ్‌లో ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి 19 మంది జవాన్లను నోనీ ఆర్మీ మెడికల్ యూనిట్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రతికూల వాతావరణంతో సహయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా భారీ కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో జిరిబామ్ – ఇంఫాల్ కొత్త లైన్ ప్రాజెక్ట్ టుపుల్ స్టేషన్ భవనానికి నష్టం వాటిల్లింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

fourteen + one =

Back to top button